తిరుమల బ్రహ్మోత్సవాలు: ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు.. పలు ప్రాంతాల కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు..

తిరుమల బ్రహ్మోత్సవాలు:  ముత్యపు పందిరి వాహనంపై  శ్రీవారు..  పలు ప్రాంతాల కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో  ముత్యపు పందిరి వాహన సేవ అశేష భక్తజన సందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి వాహన సేవ ముందు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  10 రాష్ట్రాల నుండి వచ్చిన 482 మంది కళాకారులు తమ సంస్కృతిని ప్రతిబింబించారు. 

తెలంగాణ నుండి వచ్చిన బృందం లంబాడీ, కూచిపూడి నృత్యాలతో ఉల్లాసభరితమైన ప్రదర్శనలు ఇచ్చారు... ఒరిస్సా కళాకారులు శ్రీకృష్ణ లీలలు, రాసకేలీ వంటి శాస్త్రీయ రూపకాలతో ఆకట్టుకున్నారు. ఉత్తరాఖండ్ నుండి వచ్చిన చోళియా నృత్యం యుద్ధ వీరుల సంప్రదాయాన్ని ప్రతిబింబించగా, రాజస్థాన్, గుజరాత్ బృందాలు ప్రసిద్ధి చెందిన దాండియా, రాస్/గర్భ జానపద నృత్యాలతో రంగుల శోభను తీసుకొచ్చాయి. 

తమిళనాడు నుండి భరతనాట్యం, ఆంధ్రప్రదేశ్ నుండి కూచిపూడి,  కేరళ నుండి మోహినీ ఘట్టం తమ సున్నితమైన, భావయుక్తమైన ప్రదర్శనలతో అలరించారు. కర్ణాటక బృందాలు ముక్తినాథ రథం వంటి సాంప్రదాయ రూపకాలను ప్రదర్శించగా, మహారాష్ట్ర నుండి వచ్చిన డ్రమ్ముల విన్యాసం ప్రేక్షకులను ఉత్తేజపరిచింది.