
కూకట్పల్లి, వెలుగు: తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శన ప్యాకేజీకింద భక్తులను తీసుకెళ్లడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు టీటీడీ అనుమతి ఇచ్చింది. సోమవారం కూకట్పల్లిలోని ట్రావెల్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీ బ్రోచర్ విడుదల కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు టీటీడీ ద్వారా మాత్రమే తిరుమల స్వామిని దర్శించుకునే అవకాశం ఉండేదని తెలిపారు. మొదటి సారిగా ఒక ప్రైవేటు ట్రావెల్స్కి టీటీడీ అనుమతి ఇవ్వటం అభినందనీయమన్నారు. జంట నగరాల్లోని వెంకటేశ్వరస్వామి భక్తులకు ఇది సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. భక్తులను నగరం నుంచి తీసుకువెళ్లటంతో పాటు దర్శనం, వసతి సౌకర్యాలన్నీ ప్యాకేజీలోనే ఉన్నాయని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని భరణి కోరారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.వి.రమణ మాట్లాడుతూ ఏపీటీడీసీతో కలిసి సంయుక్తంగా రెండు రకాల ప్యాకేజీలు భక్తులకు అందుబాటులో ఉంచామని తెలిపారు.