తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 24 గంటలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు చివరి దశలో ఉండగా  స్వామివారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిక్కిరిసిపోయి.. శిలాతోరణం వరకు రెండు కిలోమీటర్ల పొడవున క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. నాలుగు రోజులుగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, అన్నప్రసాదాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తితిదే అధికారులు, భద్రతా సిబ్బంది తెలిపారు


 నిన్న(జూన్ 4) శ్రీవారిని 87,434 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 39,957 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శనివారం (జూన్ 3)స్వామివారికి రూ.4.14 కోట్ల హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.