
తిరుమల శ్రీవారిని వడ్డీ కాసుల వాడా.. ఆపద మొక్కుల వాడా.. అనాథ రక్షకా.. గోవిందా.. గోవిందా అంటూ స్వామిని దర్శించుకుంటారు. పేరులోనే ఉంది వడ్డీ కాసుల వాడని.. కదా..! ప్రపంచ దేశాలనుంచి తిరుమలకు వచ్చి శ్రీవారికి భారీ మొత్తంలో విదేశీయులు ముడుపులు సమర్పిస్తారు. పదేళ్లలో ( 2015 నుంచి 2025 వరకు) శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీ లెక్కల గురించి తెలుసుకుందాం. . .
తిరుమల శ్రీనివాసుడు... భక్తజన ప్రియుడు వడ్డికాసుల వాడు .. సాక్షాత్తు కలియుగ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి మూల విరాట్టును .. రెప్పపాటు సమయం దర్శించుకుంటే జన్మ ధన్యమైందని భావిస్తారు భక్తులు. తృణమో ఫణమో అయినా తమకు ఉన్నంతలో స్వామికి హుండీలో సమర్పించుకోకుండా తిరుమల కొండకు వచ్చిన భక్తులెవరూ తిరుగు ప్రయాణం కారు అంటే అతిశయోక్తి కాదు. ఆవిధంగా గోవిందుడికి నగదూ, నాణేలూ, ఆభరణాలతో పాటు భూములు, భవనాల పత్రాలు కూడా హుండీ ద్వారా లభిస్తుంటాయి. హుండీ అనేది డబ్బు సేకరణకు సాధనం మాత్రమే కాకుండా, భక్తికి ప్రతీకగా నిలుస్తోంది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు తమ దేశాల కరెన్సీనీ, నాణేలనూ హుండీలో వేస్తుంటారు. ప్రపంచంలో 197 దేశాలుంటే, రికార్డు స్థాయిలో ఏకంగా 157 దేశాల కరెన్సీ శ్రీవారి హుండీలో లభిస్తోంది. హుండీలో సమర్పించే కానుకలు, విరాళాలు వెంకన్నకు కొండంత ఆస్తిగా మారుతున్నాయి...
దేవదేవుడు కొలువైన ఇల వైకుంఠం తిరుమల క్షేత్రం. నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. దేశ విదేశాల నుండి వేలాదిగా తరలివస్తారు. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు
తిరుమల వెంకన్నకు ఖరీదైన కానుకలు సమర్పిస్తుంటారు.. హుండీ ఆదాయంతో పాటు రోజూ వస్తున్న విరాళాలు, కానుకలు కొండంతగా పెరుగుతున్నాయి. వడ్డీ కాసుల వాడి ఆస్తులను అంతకంతకు పెంచుతున్నాయి. ఇప్పటికే వేల టన్నుల బంగారు, వేలాది కోట్ల డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నాయి. శ్రీవారికి వెలకట్టలేని కోట్ల విలువైన ఆభరణాలు, ఆస్తులు సొంతమవుతున్నాయి.
ఆపదమొక్కుల వాడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే ఆదాయము పెరుగుతోంది. తిరుమల శ్రీ వారికి మొక్కులు చెల్లించే భక్తులు సమర్పించే కానుకలు వెలకట్టలేనివిగా ఉంటున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడు దాకా ముడుపులు కట్టి వెంకన్న హుండీలో సమర్పిస్తున్న కానుకలలో, రికార్డు స్థాయిలో విదేశీ కరెన్సీ వస్తోంది.
2015 నుంచి 2025 మార్చి వరకు ఉన్న రికార్డుల ఆధారంగా పరిశీలిస్తే.. రూ.201,65,97,829 విదేశీ కాయిన్స్, నోట్లు అందినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. గత పదేళ్లనుంచి .. ఏడాదికి రూ.20 కోట్ల మేర విదేశీ కరెన్సీ స్వామి ఖజానాలో జమ అందుతోంది. విదేశీ కరెన్సీని వేలం ద్వారా మనీ చేంజర్స్‌కి అందజేసి, స్వదేశీ కరెన్సీగా టీటీడీ మార్చుకుంటుంది. 2003 వరకు బరువు ప్రాదిపదికన నాణేల విక్రయం జరిగేది. ఆ తర్వాత వాటి విలువ ఆధారంగా మార్పిడి జరుగుతోంది. ఎఫ్‌సీఆర్‌ఏ మార్గదర్శకాల ప్రకారం తిరుమల ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి న్యూఢిల్లీలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో విదేశీ కరెన్సీని, నాణేలనూ జమ చేస్తున్నారు. రెండేళ్ల కిందట టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ (ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) నిబంధనలను ఉల్లంఘించిందనే వివాదం కూడా నడిచింది. విరాళాలు ఇచ్చే దాతల వివరాలు తెలియజేయడం లేదనే రిపోర్టు ఆధారంగా టీటీడీకి జరిమానా కూడా విధించారు. అయితే హుండీలో సమర్పించే కానుకలు కావడంతో ఈ విరాళాలను శ్రీవారికి సమర్పించే కానుకలుగా పరిగణిస్తూ దాతల వివరాలను తెలియజేయాల్సిన అవసరం లేదంటూ యాక్ట్ నుంచి మినహాయింపు లభించింది.
2007 వరకు కేవలం 15 నుంచి 30 దేశాలకు సంబంధించిన కరెన్సీ మాత్రమే పరకామణి లెక్కింపులో కనిపించేది. ఆ తర్వాతే ఇతర దేశాలకు సంబందించి కాయిన్స్‌తో పాటు నోట్లు అధికంగా రావడం మొదలయ్యాయి. 2010 వరకు ఉన్న లెక్కలను పరిశీలిస్తే సింగపూర్, అమెరికా డాలర్లు, యూరో సెంట్లు, బ్రిటిష్ పౌండ్లు, మలేషియా, ఆస్ర్టేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల నగదు అధికంగా ఉండేవి. ఆ తర్వాత అనేక దేశాలకు సంబంధించిన కరెన్సీ కానుకలుగా రావడం పెరిగిపోయింది.
అమెరికా, మలేషియా, సింగపూర్‌తో పాటు యూఏఈ దేశాల కరెన్సీ అధికంగా ఉంటోంది. స్వామి హుండీలో అప్పుడప్పుడు పాకిస్తాన్ కరెన్సీ కూడా కనిపిస్తుండడం విశేషం. 2004లో 10 టన్నుల విదేశీ నాణేలను టీటీడీ విక్రయించి దాదాపు రూ.కోటి ఆదాయాన్ని కూడ బెట్టింది. అందులో 80 వేల సింగపూర్ డాలర్లు, 1.6 లక్షల అమెరికన్ డాలర్లు, 3 వేల యూరో సెంట్లు, 35 వేల బ్రిటిష్ పౌండ్లు, 8 లక్షల మలేషియన్ రింగెట్లు, 4 వేల ఆస్ర్టేలియన్ డాలర్లు, వెయ్యి దక్షిణాఫ్రికా రాండ్లు, 15వేల కెనిడియన్ సెంట్లు, 10 వేల లంకన్ రూపాయలు ఉన్నాయి.
2007 డిసెంబరు నెల చివరి వారంలో ఆరు రోజుల్లో దాదాపు 14 దేశాలకు చెందిన కరెన్సీ హుండీలో చేరింది. 2016లో హుండీ ద్వారా విదేశీ కరెన్సీ 50.63 కోట్లు లభించింది. 2015లో రూ.44.81 కోట్లు ఇతర దేశాల కరెన్సీ లభించింది. ఇక 2020-21 కరోనా సమయంలోనూ స్వామి హుండీలో రూ.1.92 కోట్లు ఇతర దేశాల నగదు చేరడం విశేషం...