
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో లడ్డూల విక్రయాల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది జులై 12వ తేదీన ఒక్కరోజు 4 లక్షల 86 వేల134 లడ్డూలను విక్రయించినట్లు టిటిడి అధికారులు తెలిపారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది జూన్ నుంచి సగటున రోజుకు నాలుగు లక్షల లడ్డూల విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల టిటిడి తీసుకువచ్చిన సంస్కరణలతో లడ్డుల డిమాండ్ పెరిగింది. లడ్డు నాణ్యత పెంచడం, ఉత్పత్తి పెంచడం, ఉత్పత్తి పెరిగేందుకు అవసరమయిన సిబ్బందిని నియామకాలు జరపడం వంటి చర్యలు తీసుకోవడంతో డిమాండ్ పెరిగిందని టిటిడి అధికారులు చెబుతున్నారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాశస్త్యం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తిరుమలకు వెళ్లే భక్తులు మొదట స్వామి వారి దర్శనం కోసం ఎంతలా తపిస్తారో దర్శనమయ్యాక శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అంతలా తపిస్తారు. కుదిరినన్ని లడ్డూలు పట్టుకొని ఇంటికి బయలుదేరుతుంటారు. ఈ క్రమంలో గత నెల (జులై)లో లడ్డూ అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. రికార్డు స్థాయిలో నెలసరి అమ్మకాలు ఒక ఎత్తు అయితే.. ఒకే రోజులో భారీ ఎత్తున లడ్డూ ప్రసాదాల విక్రయాలు సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు.
గత ఏడాది ఇదే రోజున 3.24 లక్షల లడ్డూలను విక్రయించామని, ఈఏడాది అదే రోజున 35 శాతం విక్రయాలు పెరిగాయని టిటిడి అధికారులు చెబుతున్నారు. ఒక్కరోజులోనే దేవస్థానానికి లడ్డూల విక్రయం ద్వారా 2.43 కోట్ల రూపాయల ఆదాయంవచ్చిందని అధికారులు తెలిపారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూల తయారీ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
గత ఏడాది జులై నెలలో లడ్డూల ఉత్పత్తి కోటి 4 లక్షల 57 వేల 550 ఉండగా.. ఈ ఏడాది జులైలో కోటి 25 లక్షల 10 వేల 300 కు పెరిగిందని తెలిపారు అధికారులు. గత జులైలో కోటి 4 లక్షల 3 వేల 719 లడ్డూలు అమ్ముడుపోగా.. ఈ ఏడాది జులైలో కోటి 24 లక్షల 40 వేల 82 అమ్ముడుపోయినట్లు తెలిపారు. ఫలితంగా టిటిడికి రు. 62.2 కోట్ల ఆదాయం లభించినట్లు తెలుస్తోంది.
Also Read : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కేవలం ఐదు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు..
తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతకు ప్రాథాన్యం ఇవ్వడం వల్లే రికార్డు స్థాయిలో లడ్డూల తయారీ పెరిగిందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తుల రద్దీతోపాటు విక్రయాలు పెరిగాయని టిటిడి అధికారులు చెబుతున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలోనే ఇంత పెద్ద ఎత్తున లడ్డుల విక్రయం జరుగుతుంది... కానీ జూలై లో ఎలాంటి ఉత్సవాలు లేకపోయినా లడ్డు డిమాండ్ పెరిగింది. విక్రయాలు పెరిగాయి.
లడ్డూల కల్తీ నెయ్యి వివాదం తర్వాత క్వాలిటీ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు టిటిడి అధికారులు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పోటు సిబ్బంది, లడ్డుల తయారీ విధానం, వాడే సరుకుల మీద, వాటి మిశ్రమాల మీద ఎక్కువ దృష్టి సారించారు.