ఈనెల 27 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

ఈనెల 27 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

తిరుమలలో రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వ హించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఆలయ మాడ వీధుల్లో వాహన సేవలు జరుగనున్నాయి. కరోనా ఎఫెక్ట్ తో రెండేళ్ల పాటు ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించింది టీటీడీ. ఈసారి మాడ వీధుల్లో వాహన సేవలు జరుగనుండటంతో.. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో భక్తుల కోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. 

బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతోపాటు.. వాహన సేవలు చూసే అవకాశం కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య  ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సెప్టెంబర్ 26న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. సెప్టెంబర్ 27 ఉత్సవాల్లో మొదటి రోజు సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహన సేవ జరగనుంది. రెండో రోజు ఉదయం చిన్న శేష వాహనం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, రాత్రి హంస వాహన సేవ నిర్వహించనున్నారు. మూడో రోజు ఉదయం సింహ వాహన సేవ, రాత్రికి ముత్యపు పందిరి సేవ జరగనుంది. 

నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. ఐదోరోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రికి స్వామివారికి అత్యంత ఇష్టమైన గరుడ వాహన సేవ జరగనుంది. ఆరో రోజు ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం డోలోత్సవం, రాత్రికి గజ వాహనంపై మాడ వీధుల్లో స్వామివారు ఊరేగనున్నారు. 

ఏడో రోజు ఉదయం సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, రాత్రికి శ్రీవారు చంద్రప్రభ వాహనంపై కనువిందు చేయనున్నారు. ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవ జరగనుంది. తొమ్మిదోరోజు ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సెప్టెంబర్ 27న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్  రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందన్నారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేశామన్నారు.