
భారీ సంఖ్యలో పాల్గొనాలని ప్రజలకు పిలుపు
శాంతియుతంగా నిర్వహిస్తం: రైతు సంఘాలు
ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపు
మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలు,
బ్యాంకు సంఘాలు, ట్రాన్స్పోర్ట్ యూనియన్లు
మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీలు, ట్రాన్స్పోర్ట్ యూనియన్లు
సెక్యూరిటీ పెంచాలని రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం అడ్వైజరీ
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం భారత్ బంద్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చేపట్టే బంద్‌లో భాగంగా రైతులు నేషనల్ హై వేలను బ్లాక్ చేయనున్నారు. టోల్ ప్లాజాలను ముట్టడించనున్నారు. పలు బ్యాంకు సంఘాలు నల్ల రిబ్బన్ కట్టుకుని రైతులకు మద్దతుగా నిరసన తెలపనున్నాయి. భారత్ బంద్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ప్రకటించింది. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలపై బుధవారం ఆరో రౌండ్ చర్చలు జరగనున్నాయి.
మద్దతిస్తున్న పార్టీలు
కాంగ్రెస్, టీఆర్ఎస్, డీఎంకే, ఆప్, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, వైఎస్సార్ సీపీ.
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనల్లో భాగంగా మంగళవారం భారత్ బంద్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చేపట్టే బంద్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని రైతులు పిలుపునిచ్చారు. నిరసనల్లో భాగంగా రైతులు నేషనల్ హైవేలను బ్లాక్ చేయనున్నారు. టోల్ ప్లాజాలను ముట్టడించనున్నారు. తమ డిమాండ్లు సాధించుకోవడానికి నిరసనలు చేస్తున్నాం తప్ప సామాన్యులను ఇబ్బంది పెట్టేందుకు కాదని రైతులు వివరణ ఇచ్చారు.
ఆఫీసులకు, పెండ్లిళ్లకు పోవచ్చు..
తమ నిరసనలు శాంతియుతంగా జరుగుతాయని బీకేయూ స్పోక్స్ పర్సన్ రాకేశ్ టికైట్ స్పష్టం చేశారు. కొన్ని ప్రభుత్వ పాలసీలను తాము సపోర్ట్ చేయబోమని చెప్పేందుకే ఆందోళనలు చేస్తున్నామని ప్రకటించారు. ‘‘బంద్.. ఒక సింబాలిక్ ప్రొటెస్ట్. మేము 11 గంటలకు నిరసనలు ప్రారంభిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ టైంకు ఆఫీసులకు చేరుకోవచ్చు. అంబులెన్స్ సేవలను అడ్డుకోం. పెండ్లిళ్లకు వెళ్లేవాళ్లను ఆపం. కార్డులు చూపించి వెళ్లిపోవచ్చు’’ అని చెప్పారు. పొలిటికల్ పార్టీలు మద్దతు ఇవ్వడాన్ని స్వాగతించారు. బంద్ నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన చార్టర్డ్ అకౌంటెంట్ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ పేపర్ 1ను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రైతుల బంద్‌కు మద్దతుగా మంగళవారం బ్లాక్ బ్యాండ్ కట్టుకుని విధులకు హాజరవుతామని బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
ప్రతిపక్షాలవి డబుల్ స్టాండర్డ్స్: బీజేపీ
రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న ప్రతిపక్షాలవి డబుల్ స్టాండర్డ్స్ అని బీజేపీ మండిపడింది. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బిగించిన ఉచ్చులో ఓ వర్గం రైతులు పడిపోయారని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. కొత్త చట్టాల విషయంలో రైతుల్లో నెలకొన్న ఆపోహలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రైతుల నిరసనలు తెలపడాన్ని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో ప్రజలు కొందరిని పదేపదే తిరస్కరించారని, దీంతో వాళ్లు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రొటెస్టుల్లోకి దిగారని ఆరోపించారు. 2019 జనరల్ ఎలక్షన్లలో ఏపీఎంసీ యాక్ట్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పారు.
బంద్‌పై కేంద్రం అడ్వైజరీ
భారత్ బంద్ సందర్భంగా సెక్యూరిటీ పెంచాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని, శాంతి భద్రతలను కాపాడాలని సూచించింది. కరోనాను దృష్టిలో ఉంచుకుని హెల్త్, సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ కచ్చితంగా ఫాలో కావాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరోవైపు ఢిల్లీ పోలీసులు హర్యానా, యూపీ బార్డర్లలో సెక్యూరిటీ పెంచారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాలను మోహరించారు. సింఘు, ఔచాందీ, పియావో మణియారి, మాంగేశ్, టిక్రి, ఝారోడా బార్డర్లను క్లోజ్ చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు.
అన్ని సర్వీసులు రద్దు చేస్తున్నం: ఏఐఎంటీసీ
భారత్ బంద్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ప్రకటించింది. ట్రక్ టెర్మినల్స్ దగ్గర శాంతియుత ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. రైతుల ఆందోళనలకు తొలిరోజు నుంచే మద్దతు ఇస్తున్న ఏఐఎంటీసీ.. ఇప్పుడు దాన్ని కూడా కొనసాగించింది. ట్రాన్స్‌పోర్టర్లకు అపెక్స్ బాడీ లాంటి ఏఐఎంటీసీలో 95 లక్షల మంది సభ్యులు ఉన్నారు.
పెద్దమనసు చాటుకోండి: శివసేన
ముంబై: దేశరాజధానిలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయని, మోడీ సర్కారు సాగు చట్టాలను రద్దు చేసి పెద్ద మనసును చాటుకోవాలని శివసేన సూచిం చింది. ఢిల్లీలో పరిస్థితి విషమించడానికి కేంద్రమే కారణమని ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా నిందించింది. చట్టాలను వెనక్కి తీసుకుంటే లోకువ అవుతామని భయపడక్కర్లేదని, ఆ పని చేస్తే మంచి పేరే వస్తుందని సామ్నా ఎడిటోరియల్ కామెంట్ చేసింది.
త్వరగా నిర్ణయం తీసుకోండి: గోపాల్ రాయ్
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలను ఆపడానికి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిజంగా రైతుల ఆదాయాలను పెంచాలని మోడీ సర్కారు కోరుకుంటే, మద్దతు ధరల విధానాన్ని కొనసాగించాలని సూచించారు. ‘‘గడ్డకట్టించే చలిలో రైతులు 11 రోజులుగా ఉద్యమిస్తున్నారు. స్వామినాథన్ కమిటీ కూడా మద్దతు ధరల విధానాన్ని కొనసాగించాలని రికమెండ్ చేసింది. ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి”అని ఆయన కోరారు.
రేపు మళ్లీ చర్చలు
అగ్రి చట్టాలపై చర్చించేందుకు రైతులు, మంత్రులు మరోసారి భేటీ కానున్నారు. ఇప్పటిదాకా ఐదు రౌండ్ల చర్చలు జరిగినా.. కొలిక్కి రాలేదు. దీంతో బుధవారం ఆరో రౌండ్ చర్చలు జరగనున్నాయి.