అపర సాహితీ భగీరథుడు దాశరథి రంగాచార్య : అంకం నరేష్

అపర సాహితీ భగీరథుడు దాశరథి రంగాచార్య : అంకం నరేష్

తెలుగు సాహితీ లోకంలో అక్షర వాచస్పతి, మార్క్స్ ను ఆరాధిస్తూనే శ్రీరాముని పూజించగలిగిన మహా పండితుడు. వేదాలను అనువదించి భారతీయ తాత్విక మూలాలను తెలుగు ప్రజలకు పరిచయం చేసిన బహు బాషాకోవిదుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో పెన్ను అనే గన్నుతో ఎదిరించిన సాహసి, సాహితీ నింగిలో ధ్రువతారగా నిలిచిన అక్షర బ్రహ్మ దాశరథి రంగాచార్య. నిజాం నిరంకుశత్వాన్ని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తన రచనలతో ఎదిరించిన అభ్యుదయ వాది. నూతన సమాజం నిర్మాణం కోసం తాపత్రయపడిన ఉద్యమశీలి. తెలంగాణ జనజీవనం, నిజాం పాలన నాటి సామాజిక, సాంస్కృతిక ఆర్థిక అంశాలు,  తమ సాంస్కృతిక స్వేచ్ఛ కోసం, అస్తిత్వం కోసం, భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి అంతం కోసం నిజాం పాలనను తుదముట్టించడం కోసం ఆనాటి అభ్యుదయ సమాజం ఎలా సంఘటితమై పోరాడిందో ఆ పోరాటపటిమ  ఈయన రచనల్లో కనిపిస్తుంది. 

అభ్యుదయ సారస్వత గోపురం 

రంగాచార్య 40 ఏళ్ల జీవితంలో అక్షర ప్రస్థానం ప్రారంభించి ఎన్నో నవలలు, గ్రంథాలు, కవితలు,వ్యాస సంకలనాలు రాసిన దాశరథి రంగాచార్యులు మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు  గ్రామంలో సాంప్రదాయ బ్రాహ్మణ వైదిక కులంలో ఆగస్టు 24 1928 లో జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే పోరాట బావుట పట్టి భారత స్వాతంత్ర ఉద్యమం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు. దేశ్ ముఖులు, మక్తాదారులు, పటేళ్లు, పట్వారిలు, మాల్ పటేళ్లు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలపై జరిపిన అరాచకాలను కళ్లకు కట్టినట్లు  చెప్పేందుకే ఆయన రచనలు చేశారు. మహా రచయిత వట్టి కోట అల్వార్ స్వామి రచనలు దాశరథి రంగాచార్యులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. రంగాచార్యుల రచనలది విశిష్ట పంథా. కవిత్వం కన్నా కథలు ప్రజల హృదయాలను నేరుగా తాకుతాయని ఆయన అభిప్రాయపడేవారు.

అన్యాయాలను, ఆకృత్యాలను ఎదిరించడమే ఆయన రచనల యొక్క ముఖ్య ఉద్దేశం. నిజాం పరిపాలనలోని అఘాయిత్యాల గురించి రంగాచార్య రాసిన సాహిత్యం ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంది. గ్రామీణ ప్రజల మట్టి బతుకులు ఆయన హృదయాన్ని కదిలించేవి. గడుల్లోని దొరలు, మాల్ పటేళ్లు తనకు రాబందులుగా కనిపించేవారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందున్న  స్థితిగతులు, నిజాం కాలం నాటి ప్రజల దుర్భర పరిస్థితులను దారుణమైన బానిస బతుకుల గురించి తన 'చిల్లర దేవుళ్ళు' నవలలో అక్షికరించారు. వేదం జీవననాదం అంటూ మెప్పించారు. అమృతంగమయ మాధుర్యం చూపించాడు. మాయ జలతారుతో మైమరిపించారు. రానున్నది ఏది నిజం అని ప్రశ్నించాడు. అప్పటి సమాజంలో ప్రజల బానిస బతుకుల స్థితిగతులను మోదుగ పూలు నవలలో కళ్ళకు కట్టినట్లు చిత్రించాడు.

వామపక్ష తీవ్రవాదిగా ప్రజల పక్షాన నిలిచిన దాశరథి తర్వాతి కాలంలో ఆధ్యాత్మిక భావాలు అలవర్చుకొని శ్రీ మద్రామాయణం, శ్రీ మహాభారతంతో పాటు నాలుగు వేదాలను అనువదించారు. శ్రీ మాద్రా మానుజార్యులు, బుద్ధుని కథ, మహాత్ముడు వంటి జీవిత చరిత్రలు రాశారు. అక్షర మందాకిని, వేదం జీవన నాదం వంటి వ్యాస సంకలనాలు, నల్ల నాగు, పావని వంటి రచనలు, తెలుగులో తర్జుమా చేసిన వేదాలు అతనిని పరిపూర్ణ ఆధ్యాత్మికవేత్తగా దర్శింపజేస్తాయి. 

దాశరథి రచనలు నేటి తరానికి మార్గదర్శకాలు 

తెలంగాణ సమాజం తమ అస్తిత్వం కోసం, సాంస్కృతిక స్వేచ్ఛ కోసం, నీళ్లు, నిధుల కోసం, భూమికోసం, భుక్తి కోసం  చేసిన తెలంగాణ మలి దశ పోరాటంపై ఆయన రచనలు ప్రభావితం చేశాయి. జనం భాషలో గుండెలను పలకరిస్తూ మెదళ్లను పదును పెడుతూ వీరు చేసిన రచనలు నేటి తరానికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. నాలుగు వేదాలు 10 ఉపనిషత్తులు, రామాయణ, మహాభారత, భాగవతాలను సరళమైన తెలుగు వచనంలో రాసి తెలుగుజాతి  శ్రేయస్సు కోసం పనిచేశారు. 20వ శతాబ్దం సాహిత్యవనంలో మోదుగ పువ్వు గా నిలిచిన దాశరథి 2015 జూన్ 8న అస్తమించారు. మానవత్వమే లక్ష్యంగా అక్షరమే సాధనంగా జనం కోసం పని చేసిన, తెలంగాణ అస్తిత్వం  కోసం రచనలు చేసిన దాశరథి తెలుగు సాహితీ నింగిలో ధ్రువతారగా నిలిచిపోతారు.

– అంకం నరేష్, సోషల్​ ఎనలిస్ట్​