దసరా ధమాకా ఎవరిదో!: నేడే ఐపీఎల్‌‌14 మెగా ఫైనల్‌‌

దసరా ధమాకా ఎవరిదో!: నేడే ఐపీఎల్‌‌14 మెగా ఫైనల్‌‌
  • నాలుగో టైటిల్‌‌ వేటలో చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌
  • మూడోసారి విజేతగా నిలవాలని కోల్‌‌కతా ఆరాటం
  • రా. 7.30 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో లైవ్​

దుబాయ్‌‌:  ఐపీఎల్‌‌ చరిత్రలోనే తొలిసారి రెండు దశల్లో జరుగుతున్న పద్నాలుగో సీజన్‌‌ క్లైమాక్స్‌‌కు వచ్చేసింది. దసరా రోజు క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌కు ఫుల్‌‌ కిక్‌‌ ఇచ్చే ఫైనల్‌‌ ధమాకాకు  తెరలేచింది. ఇప్పటికే మూడుసార్లు (2010, 2011,2018) విజేతగా నిలిచి.. రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఫైనల్‌‌కు వచ్చిన చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌..   రెండుసార్లు (2012, 2014)టైటిల్‌‌ నెగ్గి  ఈ సీజన్‌‌లో  అసలు అంచనాలే లేకపోయినా సంచలన ఆటతో మూడోసారి తుదిపోరుకు చేరుకున్న కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ శుక్రవారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లాస్ట్‌‌ ఇయర్‌‌ చెత్తాటతో ఏడో ప్లేస్‌‌లో నిలిచిన ధోనీసేన ఈసారి స్టార్టింగ్‌‌ నుంచే పంజా విసురుతూ వస్తోంది.అదే ఊపుతో  నాలుగో టైటిల్‌‌ నెగ్గి తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోవాలని సీఎస్​కే పట్టుదలగా ఉండగా... ఫైన ల్‌‌కు వచ్చిన రెండుసార్లూ టైటిల్‌‌ నెగ్గిన కోల్‌‌కతా మూడోసారి కూడా మెప్పించి తీన్మార్​ కొట్టాలనుకుంటోంది. వచ్చే ఏడాది రెండు కొత్త  జట్లు చేరనున్న నేపథ్యంలో మెగా ఆక్షన్‌‌ జరగనుంది. వేలంలో ఎవరు ఏ టీమ్‌‌లోకి వెళ్తారో తెలియదు. 2022లో ఆడుతానని ధోనీ చెప్పినప్పటికీ... ప్లేయర్‌‌ రిటెన్షన్‌‌ పాలసీ వచ్చి.. ఏ జట్టు ఎంత మందిని రిటైన్‌‌ చేసుకుంటుందో తెలిస్తే గానీ తను సీఎస్‌‌కేతోనే కొనసాగుతాడన్న గ్యారంటీ లేదు. కాబట్టి తనను ఎంతగానో ఆరాధించే సీఎస్‌‌కే ఫ్యాన్స్‌‌ కోసం కెప్టెన్‌‌ ధోనీ మరొక్కసారి ట్రోఫీ అందుకోవాలని క్రికెట్ వరల్డ్‌‌ వెయిట్‌‌ చేస్తోంది. గత చరిత్ర చూసినా... ప్రస్తుత  బలాబలాలను చూసినా   సీఎస్‌‌కేతో సరితూగనప్పటికీ  కోల్‌‌కతాను తక్కువ చేయడానికి లేదు.  గత రెండు సీజన్లే కాదు.. ఫస్ట్‌‌ ఫేజ్‌‌లోని కేకేఆర్ వేరు.. సెకండ్‌‌ ఫేజ్‌‌లో చూస్తున్న కేకేఆర్‌‌ వేరు. ఆ టీమ్‌‌ ఆట, ఆలోచన పూర్తిగా మారింది.  యంగ్‌‌స్టర్స్‌‌, స్పిన్నర్లపై నమ్మకం ఉంచిన కోల్‌‌కతా కత్తిలా ఆడుతోంది. కాబట్టి టైటిల్‌‌ ఫైట్‌‌లో  హోరాహోరీ ఆశించొచ్చు.  మరి, విజయ దశమి రోజు ఎవరి దశ తిరుగుతుందో చూడాలి. 
ఓపెనర్లు, స్పిన్నర్ల సపోర్ట్​తో..
గంభీర్‌‌ కెప్టెన్సీలో రెండు సార్లు విజేతగా నిలిచిన కోల్‌‌కతా మూడో టైటిల్‌‌తో మళ్లీ పుర్వవైభవం అందుకోవాలని చూస్తోంది. గత రెండు సీజన్లలో లీగ్‌‌ దశకే పరిమితమైన కోల్‌‌కతా.. ఈ సారి ఇండియా లెగ్‌‌లో నిరాశ పరిచినా యూఏఈ రాగానే వరుస విజయాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. బ్రెండన్‌‌ మెకల్లమ్‌‌ కోచింగ్‌‌, మోర్గాన్‌‌ కెప్టెన్సీలో  కేకేఆర్‌‌ రాత మారింది. ఓ బ్యాటర్‌‌గా నిరాశ పరుస్తున్నప్పటికీ కెప్టెన్‌‌గా ఇయాన్‌‌ సక్సెస్‌‌ అయ్యాడు. ఓపెనర్‌‌గా గిల్‌‌ను కొనసాగించడం, సెకండ్‌‌ ఫేజ్‌‌లో వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ను అతని ఓపెనింగ్‌‌ జోడీగా దించడం, బౌలింగ్‌‌ యాక్షన్‌‌ను మార్చుకున్న నరైన్‌‌పై భరోసా ఉంచడంతో కోల్‌‌కతా కథ మారింది. ఈ ముగ్గురూ ఇప్పుడు  కేకేఆర్‌‌ మ్యాచ్‌‌ విన్నర్లు అయ్యారు. పవర్‌‌ప్లేలో దంచికొడుతున్న అయ్యర్‌‌, నిలకడగా ఆడుతున్న గిల్‌‌ ఫామ్‌‌ కొనసాగిస్తే  రైడర్స్‌‌కు మంచి స్టార్ట్‌‌ దొరుకుతుంది. రాణా, త్రిపాఠి కూడా టచ్‌‌లో ఉన్నారు. అయితే, చిన్న టార్గెట్ల ఛేజింగ్​లో చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి డీలా పడటం సమస్యగా మారింది. దీన్ని అధిగమించాలంటే మిడిలార్డర్‌‌లో దినేశ్‌‌ తో పాటు మోర్గాన్‌‌ కూడా బ్యాట్‌‌కు పని చెప్పాల్సిందే. బౌలింగ్‌‌లో మాత్రం కేకేఆర్‌‌ చాలా బలంగా ఉంది.  షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో ముగ్గురు స్పిన్నర్లతో బౌలింగ్‌‌ దాడి చేయించడం మోర్గాన్‌‌సేన సక్సెస్‌‌లో కీలక పాత్ర అనొచ్చు. వరుణ్‌‌ చక్రవర్తి, షకీబ్, నరైన్‌‌ మొత్తంగా 12 ఓవర్లలో పొదుపుగా బౌలింగ్‌‌ చేస్తూ ప్రత్యర్థులను అడ్డుకుంటున్నారు. ఫైనల్లో వీళ్లే కీలకం కానున్నారు. పేసర్లు మావి, ఫెర్గూసన్‌‌ అద్భుతంగా బౌలింగ్‌‌ చేస్తున్నారు. పైగా, నరైన్‌‌, షకీబ్‌‌ బ్యాట్‌‌తోనూ రాణించే సత్తా ఉన్నవాళ్లు కావడం కోల్‌‌కతాకు ప్లస్‌‌ పాయింట్‌‌.   కానీ, ఈ సీజన్‌‌లో చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్‌‌ల్లోనూ మోర్గాన్‌‌సేన ఓడిపోయింది. ఈ సారి ఏం చేస్తుందో మరి.

ధోనీసేనను ఆపతరమా?
క్రికెట్‌‌ మాస్టర్‌‌ మైండ్‌‌, మిస్టర్‌‌ కూల్‌‌ ధోనీ కెప్టెన్సీనే సీఎస్‌‌కే ప్రధాన ఆయుధం. సీనియర్లను నమ్మడం, యంగ్‌‌స్టర్లపై భరోసా ఉంచడమే ధోనీ విజయ రహస్యం. 40 ఏళ్ల ధోనీతో పాటు  డుప్లెసిస్‌‌ (37), రైనా (34),  రాయుడు (36),ఊతప్ప (35), డ్వేన్ బ్రావో (38), మెయిన్‌‌ అలీ (34) అనుభవం సీఎస్‌‌కేకు పనికొస్తోంది. అలాగే,  దీపక్‌‌ చహర్‌‌, శార్దూల్‌, హేజిల్‌‌వుడ్‌‌ వంటి యాక్టివ్‌‌ ఇంటర్నేషనల్‌‌ ప్లేయర్లనూ ధోనీ చక్కగా వినియోగించుకుంటున్నాడు. అదే టైమ్‌‌లో  యంగ్‌‌స్టర్స్‌‌ను తీర్చిదిద్ది వాళ్లకు బాధ్యత అప్పగించడం మహీ స్టయిల్‌‌.  లాస్ట్‌‌ ఇయర్‌‌ నుంచి తను రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ తీర్చిదిద్దాడు. మహీ అండతో  గైక్వాడ్‌‌ నిర్భయమైన ఆటతో సీఎస్‌‌కే  ట్రంప్​ కార్డుగా మారాడు. ఈ సీజన్‌‌లో ఓ సెంచరీ, నాలుగు ఫిఫ్టీలు సహా 603 రన్స్‌‌తో  సెకండ్‌‌ బెస్ట్‌‌ టాప్‌‌ స్కోరర్‌‌గా ఉన్నాడు. క్వాలిఫయర్‌‌1లో చెలరేగిన గైక్వాడ్‌‌ ఫైనల్లోనూ కీలకం కానున్నాడు.  లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఫెయిలైనప్పటికీ  సౌతాఫ్రికా వెటరన్‌‌ డుప్లెసిస్‌‌ ఈ సీజన్‌‌లో బాగానే ఆడుతున్నాడు.  తను మళ్లీ టచ్‌‌లోకి వచ్చి రుతురాజ్‌‌తో కలిసి మంచి ఆరంభం ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక, రైనా ప్లేస్‌‌లో ఫైనల్‌‌ ఎలెవన్‌‌లోకి వచ్చిన రాబిన్‌‌ ఊతప్ప ఢిల్లీపై సత్తా చాటాడు. ఫైనల్లోనూ అతను కొనసాగడం గ్యారంటీ అనొచ్చు. అప్పుడు రైనా బెంచ్‌‌కే పరిమితం అవుతాడు. రాయుడు, మెయిన్‌‌ కూడా రాణిస్తే బ్యాటింగ్‌‌లో సీఎస్‌‌కేకు తిరుగుండదు. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో తనలోని ఫినిషర్‌‌ను నిద్రలేపిన మహీ టచ్‌‌లోకి రావడంతో చెన్నై ఫుల్‌‌ఖుషీగా ఉంది. ఆల్‌‌రౌండర్లు జడేజా, బ్రావోతో పాటు శార్దూల్‌‌ కూడా హిట్టింగ్‌‌ చేయగల సమర్థుడే. అయితే, కోల్‌‌కతా స్పిన్‌‌ త్రయం వరుణ్‌‌, నరైన్‌‌, షకీబ్‌‌ను  ఎలా ఎదుర్కొంటారన్నదానిపైనే చెన్నై భవితవ్యం ఉంటుంది. బౌలింగ్‌‌లోనూ చెన్నైకి పెద్దగా సమస్యల్లేవు. పేసర్లు దీపక్‌‌, హేజిల్‌‌వుడ్‌‌, శార్దూల్‌‌, బ్రావో, స్పిన్నర్లు జడేజా, అలీ సత్తా చాటుతున్నారు. ఓవరాల్‌‌గా అన్ని డిపార్ట్‌‌మెంట్లలోనూ సీఎస్‌‌కే బలంగా ఉంది. ఎప్పుడేం  చేయాలో,  ఏ ప్లేయర్‌‌ను ఎలా వాడాలో తెలిసిన  మాస్టర్‌‌మైండ్‌‌ ధోనీ సీఎస్‌‌కేకు మరో టైటిల్‌‌ అందిస్తాడా లేదా అన్నది కొన్ని గంటల్లో తేలనుంది.