పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా: ఇయ్యాల అబ్దుల్ ​కలాం జయంతి

పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా: ఇయ్యాల అబ్దుల్ ​కలాం జయంతి

బహుముఖ ప్రజ్ఞాశీలి, రచయిత, మిసైల్ మ్యాన్, గొప్ప శాస్త్రవేత్త, దేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. పిల్లలకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా కలాం పేరు తెచ్చుకున్నారు. ‘కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి’ అంటూ యువతకు ఇచ్చిన సందేశం ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్. భారతరత్న కలాంకు పిల్లల మీద ఉన్న ప్రేమను, ఆ ప్రోత్సాహన్ని గుర్తించి ప్రపంచ దేశాలు కలాం పుట్టిన రోజు అక్టోబర్15ను ‘ప్రపంచ విద్యార్థుల దినోత్సవం’గా నిర్వహిస్తున్నాయి. ఇది కలాం కే కాదు! భారతదేశ ప్రతి పౌరుడికి గర్వకారణం.

ఇస్రోలో చేరి..

పేపర్ బాయ్ నుంచి శాస్త్రవేత్త, రాష్ట్రపతి వరకు ఎదిగిన కలాం.. తమిళనాడులోని రామేశ్వరంలో 1931 అక్టోబరు15న జన్మించారు. నిరుపేద ముస్లిం కుటుంబంలో పుట్టి బాల్యంలోనే అనేక కష్టాలను చవి చూశాడు. ఒకసారి బడిలో టీచర్​పిల్లలను సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్లి పక్షి ఎలా ఎగురుతుందో చూపించాడు. అప్పటి నుంచి ఆయనలో ఆకాశంలో విహరించాలనే తపన కలిగింది. మద్రాస్​లోని ఏరోనాటికల్​ఇంజనీరింగ్​పూర్తి చేశాడు. తర్వాత1960లో డీఆర్​డీవోలో ఏరోనాటికల్ డెవలప్​మెంట్ ఎస్టాబ్లిష్​మెంట్ లో కలాం శాస్త్రవేత్తగా చేరారు. తర్వాత ఇస్రోలో చేరి విక్రం సారాభాయ్ తో కలిసి పనిచేశారు. కలాం మరికొంత మంది సైంటిస్టుల కృషితో అంతరిక్షంలోకి శాటిలైట్ ను పంపగలిగే సామర్థ్యం ఉన్న దేశాల లిస్టులో ఇండియా కూడా చేరింది. అగ్ని, పృథ్వి లాంటి క్షిపణులు తయారు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే అబ్దుల్ కలాంను మిసైల్ మ్యాన్‌గా పిలుస్తారు.

రాష్ట్రపతిగా ఎన్నికై..

1998లో వాజ్​పెయ్​ ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికన్ శాటిలైట్ కు దొరకకుండా పోక్రాన్ అనే ప్రదేశంలో ఆపరేషన్ శక్తి పేరుతో విజయవంతంగా న్యూక్లియర్ టెస్ట్ చేయడంలో కలాం పాత్ర ఎంతగానో ఉంది. 2002లో ఏ రాజకీయ అనుభవం లేకుండానే ఆయన రాష్ట్రపతి అయ్యారు. 2015 జులై 27న ఐఐఎం షిల్లాంగ్ లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కలాం గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో ఒక శకం ముగిసినట్లయింది.  అబ్దుల్ కలాం రాసిన ఆటోబయోగ్రఫీ13 భాషల్లో అనువాదమైంది. రాష్ట్రపతి అయిన మొదటి సైంటిస్టు కలాం మాత్రమే. రామేశ్వరంలో అబ్దుల్ కలాం స్మారకంగా అబ్దుల్ కలాం నేషనల్ మెమోరియల్ ఏర్పాటు చేశారు. మిసైల్‌ మ్యాన్‌గా, భారత రాష్ట్రపతిగా అంతకు మించి ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు.
- పీలి క్రిష్ణ, జర్నలిస్ట్