టార్గెట్‌..సిరీస్‌ విక్టరీ: నేడు ఇండియా, ఇంగ్లండ్‌ సెకండ్‌ వన్డే

టార్గెట్‌..సిరీస్‌ విక్టరీ: నేడు ఇండియా, ఇంగ్లండ్‌ సెకండ్‌ వన్డే

ఫుల్‌‌ జోష్‌‌లో కోహ్లీసేన
ఒత్తిడిలో ఇంగ్లిష్‌‌ జట్టు
మ. 1: 30 గంటల నుంచి  స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో

పుణె: ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌లతో అదరగొడుతున్న టీమిండియా మరో పోరాటానికి సిద్ధమైంది.  మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగే రెండో వన్డేలో ఇంగ్లండ్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి వన్డేలో గెలిచిన ఇండియా 1–0తో సిరీస్‌‌లో ప్రస్తుతం లీడ్‌‌లో ఉంది. దీంతో నేడు జరిగే మ్యాచ్‌‌లో గెలిస్తే సిరీస్‌‌ కోహ్లీ సేన సొంతమవుతుంది. అదే జరిగితే ఈ టూర్‌‌లో ఒక్క సిరీస్‌‌ కూడా సాధించలేక ఇంగ్లండ్‌‌ తెల్లమొహం వేసుకుని ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌‌ చాంపియన్‌‌ ఇంగ్లండ్‌‌ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. మరోవైపు గాయం వల్ల శ్రేయస్‌‌ అయ్యర్‌‌ టీమ్‌‌కు దూరమవ్వడంతో ఇండియా లైనప్‌‌లో మార్పు తప్పనిసరైంది. అయ్యర్‌‌ ప్లేస్‌‌ కోసం  రిషబ్‌‌ పంత్‌‌, సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ రేసులో ఉండగా కోహ్లీ ఎవరికి ఓటేస్తాడో చూడాలి. 
చాన్స్‌‌ ఎవరికి?
ఈ మ్యాచ్‌‌ కోసం టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే చాన్స్‌‌ కనిపిస్తోంది. ఇందులో శ్రేయస్‌‌ అయ్యర్‌‌కు రీప్లేస్‌‌మెంట్‌‌ను ఎంచుకోవడం ప్రధానమైనది కాగా కుల్దీప్‌‌ యాదవ్‌‌ను కొనసాగిస్తారో లేదో చూడాలి. షోల్డర్‌‌ డిస్‌‌లొకేట్‌‌ అవ్వడం వల్ల అయ్యర్‌‌ ఈ సిరీస్‌‌కు పూర్తిగా దూరమవ్వడంతో ఇండియా మిడిలార్డర్‌‌లో ఖాళీ ఏర్పడింది. సూర్యకుమార్‌‌ యాదవ్‌‌, రిషబ్‌‌ పంత్‌‌ ఈ ప్లేస్‌‌ కోసం పోటీలో ఉన్నారు.  టీ20 సిరీస్‌‌లో ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌తో సత్తా చాటిన సూర్యకు చాన్స్‌‌ ఇస్తే వన్డేల్లో డెబ్యూ చేస్తాడు. మరోపక్క వికెట్‌‌ కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ రిషబ్‌‌ పంత్‌‌ కూడా మంచి ఫామ్‌‌లో ఉన్నాడు. వీరిలో కెప్టెన్‌‌ కోహ్లీ, హెడ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రి ఎవరికి ఓటేస్తారో చూడాలి.  మిగిలిన టీమ్‌‌ విషయానికొస్తే ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ ఫామ్‌‌లోకి రావడం జట్టుకు సానుకూలాంశం. మరో ఓపెనర్‌‌ రోహిత్‌‌ శర్మతో కలిసి ధవన్‌‌ చెలరేగితే జట్టుకు తిరుగుండదు.  అయితే మోచేతి గాయం వల్ల గత మ్యాచ్‌‌లో ఫీల్డింగ్‌‌కు దూరంగా ఉన్న స్టార్‌‌ ఓపెనర్‌‌ రోహిత్‌‌ ఈ మ్యాచ్‌‌లో ఆడటంపై కొద్దిగా అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ రోహిత్‌‌ దూరమైతే శుభ్‌‌మన్‌‌ గిల్‌‌కు చాన్స్‌‌ దొరకవచ్చు.  కెప్టెన్‌‌ కోహ్లీ సూపర్‌‌ ఫామ్‌‌లో ఉండగా..  కేఎల్‌‌ రాహుల్‌‌ కూడా టచ్‌‌లోకి వచ్చాడు.  పాండ్యా సోదరులతో లోయర్‌‌ మిడిలార్డర్‌‌ కూడా బలంగా మారింది. ఫస్ట్‌‌ వన్డేలో అదరగొట్టిన క్రునాల్‌‌.. ఇటు బ్యాటింగ్‌‌తోపాటు బౌలింగ్‌‌లోనూ రాణించి రవీంద్ర జడేజా లేని లోటును భర్తీ చేశాడు.  లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఎక్కువ రన్స్‌‌ ఇచ్చుకున్న కుల్దీప్‌‌ యాదవ్‌‌కు బదులుగా చహల్‌‌ బరిలోకి దిగే చాన్స్‌‌ కనిపిస్తోంది. సీనియర్‌‌ భువనేశ్వర్‌‌తో కలిసి శార్ధూల్‌‌ ఠాకూర్‌‌, ప్రసీధ్‌‌ కృష్ణ మరోసారి పేస్‌‌ విభాగాన్ని నడిపించనున్నారు. శార్ధూల్‌‌కు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తే నటరాజన్‌‌, సిరాజ్‌‌లో ఒకరికి తుది జట్టులో చాన్స్‌‌ దొరుకుతుంది.
ఇంగ్లండ్‌‌కు గాయాల బెడద..
సిరీస్‌‌ సమం చేయడాన్ని టార్గెట్‌‌గా పెట్టుకున్న ఇంగ్లండ్‌‌ను గాయాలు వేధిస్తున్నాయి. ఓపెనర్లు జేసన్‌‌ రాయ్‌‌, బెయిర్‌‌ స్టో  టచ్‌‌లో ఉండటం ఇంగ్లండ్‌‌కు ప్లస్‌‌ పాయింట్. కానీ స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ బ్యాటింగ్‌‌ ఫెయిల్యూర్‌‌ టీమ్‌‌ను బాగా దెబ్బతీస్తోంది.  బట్లర్‌‌, అలీ, సామ్‌‌ కరన్‌‌తో మిడిలార్డర్‌‌ చూడటానికి బలంగానే కనిపిస్తున్నా.. సమష్టిగా  రాణించలేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇంగ్లండ్‌‌ భారీ స్కోరు చేయాలన్నా, పెద్ద టార్గెట్‌‌ను ఛేజ్‌‌ చెయ్యాలన్నా వీళ్లంతా రాణిస్తేనే సాధ్యమవుతుంది. ఇక బౌలింగ్‌‌లోనూ ఇంగ్లిష్‌‌ టీమ్‌‌కు పలు సమస్యలున్నాయి. స్పిన్నర్లు రషీద్‌‌, మొయిన్‌‌ అలీ ఫస్ట్‌‌ వన్డేలో అట్టర్‌‌ఫ్లాప్‌‌ అయ్యారు. పేసర్లు టామ్‌‌ కరన్‌‌, మార్క్‌‌ వుడ్‌‌, సామ్‌‌ కరన్‌‌ కూడా అంచనాలు అందుకోలేకపోయారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటేనే ఇంగ్లండ్‌‌.. ఈ మ్యాచ్‌‌లో ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వగలదు.
ఒకదాని తర్వాత మరొకటి ఇంగ్లండ్‌‌పై టెస్ట్‌‌, టీ20 సిరీస్‌‌లను గెలిచిన టీమిండియా మరో భారీ విక్టరీపై కన్నేసింది..! మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌ను సొంతం చేసుకునేందుకు ఒక్క విజయం దూరంలో నిలిచింది..! టాప్‌‌ క్లాస్‌‌ పెర్ఫామెన్స్‌‌తో చెలరేగుతున్న కోహ్లీసేన..  సిరీస్‌‌ విక్టరీ టార్గెట్‌‌గా సెకండ్‌‌ వన్డేకు సిద్ధమైంది..! ఓవరాల్‌‌గా టూర్‌‌ మొత్తంలో వైట్‌‌వాష్‌‌కు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో.. ఈ మ్యాచ్‌‌ గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ భావిస్తోంది..! స్టార్‌‌ ప్లేయర్లు అందుబాటులో ఉన్నా.. సమయోచితంగా రాణించడంలో విఫలమవు తున్న ఇంగ్లండ్‌‌ బృందం..  లెక్క సరిచేసి సిరీస్‌‌లో నిలు స్తుందా..! లేక టీమిండియాకు మూడో సిరీస్‌‌ కూడా అప్పగిస్తుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది..!!  


మోర్గాన్‌ ఔట్‌.. బట్లర్‌కు కెప్టెన్సీ
ఇండియాతో కీలక రెండో వన్డే ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయాల పాలైన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, సామ్‌ బిల్లింగ్స్‌ జట్టుకు దూరమయ్యారు. మోర్గాన్‌ ఈ  సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమవ్వగా సామ్‌ బిల్లింగ్స్‌ రెండో వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. మోర్గాన్‌ లేకపోవడంతో జాస్‌ బట్లర్‌కు కెప్టెన్సీ అప్పగించారు. ఈ మేరకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాక శుక్రవారం మ్యాచ్‌లో లివింగ్‌ స్టోన్‌ వన్డేల్లో డెబ్యూ చేయనున్నాడు. బ్యాకప్‌ ప్లేయర్‌గా ఉన్న డేవిడ్‌ మలన్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు. ఇండియాతో జరిగిన ఫస్ట్‌ వన్డేలో ఇయాన్‌ మోర్గాన్‌ చేతి బొటన వేలు, చూపుడు వేలు మధ్య గాయమైంది. ఆ ప్రాంతంలో నాలుగు కుట్లు పడ్డాయి. దీంతో ఇయాన్‌ ఈ  సిరీస్‌కు దూరమయ్యాడని ఈసీబీ తన ప్రకటనలో పేర్కొంది.

జట్లు (అంచనా)
ఇండియా : రోహిత్‌‌ శర్మ, శిఖర్‌‌ ధవన్‌‌, విరాట్‌‌ కోహ్లీ (కెప్టెన్‌‌), రిషబ్‌‌ పంత్‌‌/ సూర్యకుమార్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌, హార్దిక్‌‌ పాండ్యా, క్రునాల్‌‌ పాండ్యా, భువనేశ్వర్‌‌, శార్దూల్‌‌ ఠాకూర్‌‌, యుజ్వేంద్ర చహల్‌‌, ప్రసీధ్‌‌ కృష్ణ
ఇంగ్లండ్‌‌: జేసన్‌‌ రాయ్‌‌, బెయిర్‌‌ స్టో, బెన్‌‌ స్టోక్స్‌‌, డేవిడ్‌‌ మలన్‌‌, లివింగ్‌‌ స్టోన్‌‌ , బట్లర్‌‌ (కెప్టెన్‌‌), మొయిన్ అలీ, సామ్‌‌ కరన్‌‌, టామ్‌‌ కరన్‌‌, ఆదిల్‌‌ రషీద్‌‌, మార్క్‌‌ వుడ్‌‌.
పిచ్‌‌, వాతావరణం 
టాస్‌‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌‌ ఎంచుకునే చాన్స్‌‌ ఎక్కువగా ఉంది. మ్యాచ్‌‌ ప్రారంభంలో పిచ్‌‌ను అంచనా వేయడం కాస్త కష్టం. నెమ్మదిగా వికెట్ ఫ్లాట్‌‌గా మారుతుంది. ఫ్లడ్‌‌ లైట్స్‌‌ వెలుతురులో మంచు ప్రభావం బాగా ఉంటుంది. వర్షం ముప్పు లేదు.