93 అసెంబ్లీ సీట్లలో పోలింగ్​

93 అసెంబ్లీ సీట్లలో పోలింగ్​

అహ్మదాబాద్: గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల రెండో, చివరి దశ పోలింగ్​కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 14 జిల్లాల పరిధిలోని 93 అసెంబ్లీ సీట్ల లో సోమవారం పోలింగ్​ జరగనుంది. 833 మంది బరిలో ఉండగా.. 2.51 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో దశలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్​ పోటాపోటీగా ప్రచారం చేశాయి. శనివారంతో ఎన్నికల ప్రచారం పూర్తయ్యింది. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

మూడు పార్టీల మధ్యే పోరు

గుజరాత్​అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 182. డిసెంబర్​ 1న జరిగిన తొలి దశ ఎన్నికల్లో సౌరాష్ట్ర, కుచ్, సౌత్​ గుజరాత్​ రీజియన్లలోని 89 సీట్లకు పోలింగ్​ పూర్తయ్యింది. 63.31 శాతం పోలింగ్ రికార్డయ్యింది. ఇక మిగిలిన 93 సీట్లకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్​తదితర జిల్లాల్లో పోలింగ్​ జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్​ సహా 61 పార్టీల నుంచి 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 285 మంది ఇండిపెండెంట్లు. బీజేపీ, ఆప్​ మొత్తం 93 సీట్లలో పోటీపడుతుంటే.. కాంగ్రెస్ 90 చోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ రెండు సీట్లలో పోటీ పడుతోంది. బీఎస్పీ 44 సీట్లలో, భారతీయ ట్రైబరల్​ పార్టీ 12 చోట్ల పోటీ చేస్తున్నాయి. 

పోటాపోటీ ప్రచారం..

రెండో దశలో కీలక నియోజకవర్గాల విషయానికి వస్తే గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. ఘట్లోడియా నుంచి పోటీ చేస్తున్నారు. పాటిదార్​ లీడర్ హార్దిక్​ పటేల్ విరాంగమ్​ నుంచి, గాంధీనగర్​ సౌత్​ నుంచి అల్పేష్​ ఠాకూర్ బీజేపీ టికెట్​పై బరిలో నిలిచారు. దళిత్​ లీడర్​ జిగ్నేశ్​ మేవానీ కాంగ్రెస్ టికెట్​పై వాద్గామ్​ నుంచి పోటీ చేస్తున్నారు. గుజరాత్​ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సుఖ్​రామ్​ రాత్వా జెత్ పూర్​ నుంచి బరిలో దిగారు. బీజేపీ తరఫున ప్రధాని మోడీ సుడిగాలి ప్రచారం చేశారు. ఈ నెల 1, 2 తేదీల్లో అహ్మదాబాద్​లో వరుస రోడ్​షోల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ప్రచారం చేశారు. ఆప్​ తరఫున పంజాబ్​ సీఎం భగవంత్ ​మాన్​ ప్రచారంలో పాల్గొన్నారు. 

14,975 పోలింగ్​ స్టేషన్లు

రెండో దశలో 2.51 కోట్ల మంది ఓటు వేయనున్నారు. ఇందులో 1.29 కోట్ల మంది మగాళ్లు కాగా, 1.22 కోట్ల మంది మహిళలు. మొత్తం 14,975 పోలింగ్​ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది. 1.13 లక్షల మంది ఎన్నికల సిబ్బంది బాధ్యతలు నిర్వహించనున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 93 సీట్లలో బీజేపీ 51 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 39 సీట్లు దక్కించుకుంది. మూడు చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. అప్పట్లో సెంట్రల్​ గుజరాత్​లో సత్తా చాటిన బీజేపీ 37 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 22 సీట్లకే పరిమితమైంది. కానీ, నార్త్ గుజరాత్​లో మాత్రం కాంగ్రెస్​ హవా కనిపించింది. హస్తం పార్టీకి ఇక్కడ 17 సీట్లు వస్తే.. బీజేపీ 14 సీట్లకే పరిమితమైంది.

అహ్మదాబాద్​లో ఓటేయనున్న మోడీ, అమిత్​షా

ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్​షా అహ్మదాబాద్​లో ఓటు వేయనున్నారు. మోడీ ఆదివారం సాయంత్రమే అహ్మదాబాద్​ చేరుకున్నారు. నేరుగా తల్లి హీరాబెన్​ ఇంటికి వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. రానిప్ ​ఏరియాలోని ఓ హైస్కూల్​లోని పోలింగ్​ స్టేషన్​లో మోడీ ఓటు వేస్తారని అధికారులు వెల్లడించారు. నారాన్​పురా ఏరియాలోని మున్సిపల్​ సబ్​ జోనల్​ ఆఫీస్​ అమిత్​షా ఓటు వేయనున్నారు.