నేడు ఫిఫా వరల్డ్​ కప్​ రెండో సెమీ ఫైనల్

నేడు ఫిఫా వరల్డ్​ కప్​ రెండో సెమీ ఫైనల్

దోహా: ఓవైపు తొలి కప్‌‌ కోసం మొరాకో వేట.. మరోవైపు డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ హోదాను నిలబెట్టుకోవాలని ఫ్రాన్స్‌‌.. ఈ నేపథ్యంలో బుధవారం ఇరుజట్ల మధ్య ఫిఫా వరల్డ్‌‌కప్‌‌ సెమీస్‌‌కు రంగం సిద్ధమైంది. ఆట కంటే ఈ మ్యాచ్‌‌లో ఎక్కువగా సాంస్కృతిక, రాజకీయ ఉద్వేగాలు ముడిపడి ఉండటంతో ఇరుజట్లు గెలుపుపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. 1912 నుంచి 1956 వరకు మొరాకో.. ఫ్రెంచ్‌‌ పాలనలో ఉండటంతో ఈ విజయాన్ని తమ దేశ ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయే కానుకగా ఇవ్వాలని భావిస్తోంది. గ్రూప్‌‌ దశలో బెల్జియంపై, నాకౌట్స్‌‌లో స్పెయిన్‌‌, పోర్చుగల్‌‌ను ఓడించి సెమీస్‌‌కు రావడంతోనే మొరాకో పేరు మార్మోగిపోయింది.

92 ఏళ్ల ఫిఫా చరిత్రలో ఏ ఆఫ్రికా టీమ్‌‌ కూడా ఈ ఘనత అందుకోలేదు. అయితే ఇప్పుడు కప్‌‌ను గెలిచి మరో చరిత్ర సృష్టిస్తామని మొరాకో కోచ్‌‌ వాలిద్‌‌ రెగ్రాగుయ్‌‌ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. పోర్చుగల్‌‌ మ్యాచ్‌‌లో గాయపడిన రొమైన్‌‌ సైస్‌‌ ఈ మ్యాచ్‌‌కు అందుబాటులో ఉండే చాన్స్‌‌ ఉంది. మరోవైపు ఈ వరల్డ్‌‌కప్‌‌లో రొనాల్డో, మెస్సీలాంటి స్టార్లను పక్కనబెట్టేలా తన ఆటతీరుతో ఆకట్టుకున్న కైలియన్‌‌ ఎంబాపె (ఫ్రాన్స్‌‌) ఈ మ్యాచ్‌‌లో హాట్‌‌ ఫేవరెట్‌‌గా దిగుతున్నాడు. ఇప్పటికే ఐదు గోల్స్‌‌ చేసిన ఎంబాపె ఈ సంఖ్యను మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. క్వార్టర్స్‌‌లో ఇంగ్లండ్‌‌ను ఓడించడంతో ఫ్రాన్స్‌‌ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. దీంతో ఇదే జోరును సెమీస్‌‌లోనూ కొనసాగించాలని ఫ్రాన్స్‌‌ లక్ష్యంగా పెట్టుకుంది.