నేడే జనతా కర్ఫ్యూ

నేడే జనతా కర్ఫ్యూ

కరోనా కట్టడికి ఏకమైన దేశం

ప్రధాని పిలుపునకు అన్ని రాష్ట్రాల మద్దతు

ఎక్కడికక్కడ ఇండ్లకే జనం పరిమితం

రైళ్లు, బస్సులు, విమాన సర్వీసులు అన్నీ బంద్​

‘వలస వచ్చిన వాళ్లు సొంతూళ్లకు ప్రయాణం కాకుండా ఇప్పుడున్న చోటే ఉండండి. దీని వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. దయచేసి రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లులలో కలుసుకుని దోస్తులతో బాతాఖానీ కొట్టడం మానుకోండి. మీ కుటుంబం గురించి ఆలోచించండి. మరీ అవసరమైతే తప్పా ఇంట్లోంచి బయటికి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: బస్సులు బంద్​.. రైళ్లు బంద్​.. విమానాలు బంద్​.. గల్లీల్లో షాపులు కూడా బంద్​.. అంతా బంద్. జనం మొత్తం ఇండ్లకే పరిమితం. కరోనా కట్టడి కోసం దేశం మొత్తం ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు జనతా కర్ఫ్యూ పాటించనుంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. రాజకీయాలను పక్కనబెట్టి నాయకులు కూడా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్యాసింజర్​ ట్రైన్లు అన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ఇండియన్​ రైల్వే ప్రకటించింది. ఎయిర్​లైన్స్ కంపెనీలు గో ఎయిర్, ఇండిగో, ఎయిర్​ విస్తారాలు ఆదివారం తమ సర్వీసులను నిలిపేస్తామని ప్రకటించాయి. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు (14 గంటల పాటు) బంద్​ పాటించాలని ప్రధాని కోరగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు బంద్​ పాటించి, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తమిళనాడు సర్కారు తొమ్మిది పాయింట్ల ఎజెండాతో కర్ఫ్యూకు సిద్ధమైంది. రాష్ట్రంలో వైరస్ ను అడ్డుకోవడానికి తాము తీసుకున్న చర్యలు బాగున్నాయంటూ ప్రధాని ఫోన్​ చేసి మెచ్చుకున్నరని సీఎం పళనిస్వామి చెప్పారు.

ప్రభుత్వ ఆఫీసులను కేరళ సర్కారు మూసివేసింది. దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకే తెరచి ఉంచాలని సీఎం పినరయి విజయన్  నిర్దేశించారు. బస్సులు, మెట్రో రైళ్లను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ వాహనాలతో పాటు పాలు, కూరగాయలు, మందులు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్​ ట్యాంకర్లకు రోడ్లపై తిరిగేందుకు అనుమతిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మెట్రో సర్వీసులు, బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు యూపీ సీఎం ​ ప్రకటించారు. తమిళనాడు, గుజరాత్, కర్నాటకలో కూడా సర్వీసులు క్యాన్సిల్​ చేశారు.