క్లాస్..మాస్ బీట్లకు కేరాఫ్ అడ్రస్ డీఎస్పీ

క్లాస్..మాస్ బీట్లకు కేరాఫ్ అడ్రస్ డీఎస్పీ

మెలోడీకి మాస్టర్ అతడు. ఫోక్ సాంగ్స్ స్పెషలిస్ట్ అతడు. క్లాస్, మాస్ బీట్ లకు అతడే  కేరాఫ్ అడ్రస్. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ... అభిమానులచేత రాక్ స్టార్ డీఎస్పీ అని పిలిపించుకుంటున్న దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే ఈ రోజు. 

‘దేవి’ సినిమాతో మొదలైన ప్రస్థానం

‘దేవి’ సినిమా ద్వారా దక్కిన తొలి అవ‌కాశాన్ని  ఆయన సద్వినియోగం చేసుకొని.. త‌న‌దైన శైలిలో బాణీలు ప‌లికించాడు. అలా మొదలైన దేవిశ్రీ ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. 23 ఏళ్ల సంగీత యాత్రలో.. ఇప్పటివరకు ఆయన దాదాపు 100కు పైగా సినిమాలకు సంగీతాన్ని అందించాడు. 60కి పైగా పాటలు పాడాడు. అంతే కాకుండా 20కు పైగా పాటలకు సాహిత్యాన్ని సమకూర్చాడు.

టాప్ హీరోలందరితో...

టాలీవుడ్ టాప్ హీరోస్ అంద‌రి చిత్రాల‌కూ త‌న సంగీతాన్ని అందించిన రికార్డ్ దేవిశ్రీ ఖాతాలో ఉంది‌. చిరంజీవి ‘శంక‌ర్ దాదా జిందాబాద్’, ‘ఖైదీ నంబ‌ర్ 150’ మూవీస్ తో పాటు బాల‌కృష్ణ ‘లెజెండ్’ సినిమాలకు సంగీతాన్ని ఇచ్చింది ఆయనే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన జ‌ల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాల‌లో దేవిశ్రీ ప్రసాద్ పలికించిన బాణీలు భళా అనిపిస్తాయి. మ‌హేశ్ బాబు ‘శ్రీ‌మంతుడు’ మూవీకి  దేవి స్వర కల్పనలో రూపొందిన పాట‌లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ నాన్నకు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ లోని పాట‌లు ఈతరం ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఈ బర్త్ డే తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మ‌రింత తియ్యటి సంగీతాన్ని జనావళికి అందిస్తారని ఆశిద్దాం.