నేడే ఎమ్మెల్సీ పోలింగ్

నేడే ఎమ్మెల్సీ పోలింగ్

ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌‌
ఐదు జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు: సీఈవో 
క్యాంపుల నుంచి హైదరాబాద్​ రిసార్టులకు చేరిన టీఆర్​ఎస్​ ఓటర్లు
అక్కడి నుంచి నేరుగా పోలింగ్​ సెంటర్లకు వచ్చేలా పార్టీ ఏర్పాట్లు

రిసార్టుల నుంచి పోలింగ్‌‌ కేంద్రాలకు
ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నా.. ప్రధానంగా కరీంనగర్‌‌లోని రెండు  సీట్లతో పాటు ఖమ్మం స్థానంలో ఎక్కువ పోటీ ఉందని టీఆర్‌‌ఎస్‌‌ అంచనా వేస్తున్నది. మెదక్‌‌లో కాంగ్రెస్‌‌, ఆదిలాబాద్‌‌లో ఇండిపెండెంట్‌‌ నుంచి పోటీ తప్పదని లెక్కలు వేసుకుంటున్నది. ఈ క్రమంలోనే తమ పార్టీకి చెందిన ఓటర్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్యాంపులకు తరలించింది. వారిని బుధ, గురువారాల్లో హైదరాబాద్‌‌కు తీసుకువచ్చి శివారుల్లోని రిసార్టుల్లో ఉంచి పోలింగ్‌‌పై ట్రైనింగ్​ ఇచ్చింది. ఓటర్లను శుక్రవారం ఉదయమే క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్‌‌ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులు, ఇతర వెహికల్స్​ అందుబాటులో ఉంచింది. ఓటర్లంతా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు పోలింగ్‌‌ కేంద్రాలకు వెళ్లేలా సిద్ధం చేసింది.

క్యాంపుల్లో పెట్టి రాజభోగాలు కల్పించినా చివరికి ఓట్లేస్తారో లేదోనని టీఆర్​ఎస్​ లీడర్లు సతమతమవుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఏకంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ​గర్భగుడిలోకి తీసుకెళ్లి ఒట్లు పెట్టించినట్టు సమాచారం.

హైదరాబాద్‌‌, వెలుగు: స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌‌ జరుగనుంది. ఎన్నికలు జరిగే ఐదు జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని సీఈవో శశాంక్‌‌ గోయల్‌‌  చెప్పారు. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌‌  జారీ కాగా.. రంగారెడ్డి, మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాల్లో రెండు చొప్పున, నిజామాబాద్‌‌, వరంగల్‌‌లో ఒక్కో సీటు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. కరీంనగర్‌‌ జిల్లాలో రెండు, ఆదిలాబాద్‌‌, మెదక్‌‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో సీటుకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం ఆరు స్థానాలకు 26 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నెల 14న ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు. కరీంనగర్‌‌ రెండు సీట్లకు పది మంది, నల్గొండ స్థానానికి ఏడుగురు, ఆదిలాబాద్‌‌లో ఇద్దరు, ఖమ్మంలో నలుగురు, మెదక్‌‌లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్‌‌ పేపర్‌‌లు ప్రింట్‌‌ చేశారు. అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో ప్రిసైడింగ్‌‌ ఆఫీసర్‌‌ ఇచ్చే పెన్‌‌తో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయొచ్చు. పోటీలో ఉన్న అందరు అభ్యర్థులకు ఒక్కో ఓటరు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల సిబ్బంది, బ్యాలెట్‌‌ పేపర్లు, బ్యాలెట్‌‌ బాక్స్‌‌లను ఆయా పోలింగ్‌‌ కేంద్రాలకు తరలించారు. ఎన్నికలు జరిగే ఉమ్మడి ఐదు జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సీఈవో శశాంక్‌‌ గోయల్‌‌ వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. 
జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు
రెండు ఎమ్మెల్సీ స్థానాలున్న కరీంనగర్‌ జిల్లాలో 1,324 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ఎనిమిది పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నల్గొండలో 1,271 మంది ఓటర్లున్నారు. ఈ జిల్లాలో ఎనిమిది పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్‌ జిల్లాలో 1,026 మంది ఓటర్లకు గాను తొమ్మిది పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 937 మంది ఓటర్లకు 8, ఖమ్మంలో 768 మంది ఓటర్లకు 4 పోలింగ్‌ స్టేషన్లు  ఏర్పాటు చేశారు. మొత్తంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో 5,326 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మగవారు 2,329 మంది, మహిళలు 2,997 మంది ఉన్నారు. ఆదిలాబాద్‌లో ఇద్దరు ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు.

ఓటర్లకు ప్రలోభాలు
    కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీలో నిలవడం, ఆయనకు మద్దతు తెలుపాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బహిరంగంగానే అప్పీల్‌ చేయడంతో ఇక్కడ క్రాస్‌ ఓటింగ్‌ జరగొచ్చని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తున్నది. మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగి క్యాంపులో ఉన్న ఓటర్లతో మాట్లాడారు. ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏటా నిధులు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్‌లో క్రాస్‌ ఓటింగ్‌ను నివారించేందుకు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు కూడా పెద్ద ఎత్తున్నే చేస్తున్నారు. సొంత పార్టీలో క్రాస్‌ ఓటింగ్‌ తప్పదనే అంచనాతో ఇతర పార్టీలకు చెందిన ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 
కరీంనగర్‌లో 1,324 ఓటర్లకు గాను టీఆర్‌ఎస్‌ చెందిన ఓటర్లు 996 మంది ఉన్నారు. వీరితో పాటు ఇతర పార్టీలకు చెందిన ఇంకో 50 మంది ఓటర్లు టీఆర్‌ఎస్‌ క్యాంపులో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.  పార్టీ అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్‌. రమణకు చెరి 500 మంది ఓటర్ల చొప్పున కేటాయించారు. వీరిలో ఒకరికి ఫస్ట్‌ ప్రయారిటీ ఓటు వేసిన వాళ్లు రెండో అభ్యర్థికి సెకండ్‌ ప్రయారిటీ ఓటు వేయాలని సూచించారు. పార్టీ అభ్యర్థులకు తప్ప మరొకరికి ఓటు వేయొద్దని గట్టిగా చెప్పారు. 
ఆదిలాబాద్‌లో 937 ఓట్లకు గాను 717 మంది టీఆర్‌ఎస్‌ ఓటర్లే. ఇక్కడ ఇండిపెండెంట్‌ అభ్యర్థికి తుడుందెబ్బ మద్దతు పలకడంతో క్రాస్‌ ఓటింగ్‌ ఉండొచ్చని టీఆర్​ఎస్​ అంచనా వేస్తున్నది. ఖమ్మంలో 768 ఓటర్లుండగా.. టీఆర్‌ఎస్‌కు 490, కాంగ్రెస్‌కు 116 మంది ఓటర్లున్నారు. సీపీఐ, సీపీఎం ఓటర్ల మద్దతును కూడగట్టిన టీఆర్‌ఎస్‌ ఇక్కడ గెలిచి తీరుతామని చెప్తున్నది. పార్టీ కీలకనేత వర్గీయులు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడవచ్చని అనుమానిస్తున్నారు. మెదక్‌లో 1,026 మంది ఓటర్లుండగా.. టీఆర్‌ఎస్‌కు 777, కాంగ్రెస్‌కు 230 మంది ఓటర్లున్నారు. నల్గొండలో 1,271 మంది ఓటర్లుండగా టీఆర్‌ఎస్‌కు 991 మంది బలముంది. ఈ రెండు సీట్లపై ఆందోళన లేదని నేతలు చెప్తున్నారు.