కరోనా కాటు: కలిసే పుట్టి.. కలిసే చనిపోయిన ట్విన్ బ్రదర్స్

కరోనా కాటు: కలిసే పుట్టి.. కలిసే చనిపోయిన ట్విన్ బ్రదర్స్

ప్రతిరోజూ కరోనాకు ఎందరో బలవుతున్నారు. నిత్యం లక్షల్లో పాజిటివ్ కేసులు.. వేలల్లో మరణాలు. దేశవ్యాప్తంగా ఎక్కడచూసనా కరోనా కాష్టాలే కంటపడుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎందరినో ఈ మహమ్మారి బలితీసుకుంటుంది. తాజాగా కరోనా బారినపడి ఇద్దరు కవల సోదరులు మృతిచెందారు. ఈ విషాద ఘటన మీరట్‌లో చోటుచేసుకుంది. 

మీరట్‌కు చెందిన జోఫ్రెడ్ వర్గీస్ గ్రెగొరీ మరియు రాల్ఫ్రెడ్ జార్జ్ గ్రెగొరీ ఇద్దరూ కవల సోదరులు. వీరిద్దరూ గత నెల ఏప్రిల్ 23న 24వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇద్దరూ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కరోనాతో కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో.. ఇద్దరూ ఇంట్లోంచే పనిచేస్తున్నారు. వీరి తల్లిదండ్రులిద్దరూ సెయింట్ థామస్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అందరూ చదువుకున్నవాళ్లే కావడంతో.. మంచిగా స్థిరపడ్డారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ. ఈ అన్యోన్య కుటుంబాన్ని చూసి.. కరోనాకు కన్ను కుట్టింది.

ఇంట్లోంచే వర్క్ చేస్తున్న అన్నదమ్ములకు కరోనా సోకింది. దాంతో మే 1న కవలలిద్దరూ ఆనంద్ ఆసుపత్రిలో చేరారు. పది రోజుల చికిత్స తర్వాత మే 10న టెస్టులు చేస్తే ఇద్దరికీ కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే... మే 13న అన్నదమ్ముల్లో ఒకరికి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. దాంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ.. అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో ఒకరు చనిపోయారు. మరుసటి రోజు ఉదయం మరోకరికి ఇదే సమస్య వచ్చి అతను కూడా మే 14న చనిపోయాడు. ఇద్దరూ కొడుకులూ ఒకేసారి చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. 

‘మా కొడుకులిద్దరూ ఇంజనీర్లు. వాళ్లు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కరోనా బారినపడి కోలుకున్నా.. ఆ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు వ్యాపించి వారి పరిస్థితిని మరింత దిగజార్చింది. అందువల్లే నా కొడుకులిద్దరూ చనిపోయారు. కవలలుగా కలిసే పుట్టారు.. కలిసే చనిపోయారు’ అని ట్విన్ బ్రదర్స్ తండ్రి గ్రెగొరీ రాఫెల్ విలపించారు. కాగా.. ప్రస్తుతం ఈ తల్లిదండ్రుల మూడో కొడుకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.