ఫస్ట్ డే.. ఫస్ట్ మెడల్.. థ్యాంక్యూ మీరా

ఫస్ట్ డే.. ఫస్ట్ మెడల్.. థ్యాంక్యూ మీరా

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ మొదలైన తొలి రోజే అద్భుతమైన ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చానుకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ థ్యాంక్ చెప్పారు. మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 49 కిలోల కేటగిరీలో పతకం సాధించిన ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ, యావత్ దేశం గర్వించేలా చేసిందని ప్రశంసించారు. ‘‘ఫస్ట్ డే.. ఫస్ట్ మెడల్.. సిల్వర్ మెడల్.. మీరాబాయ్ చానుకు నా అభినందనలు. బిగ్ థ్యాంక్యూ! దేశంలోని 135 కోట్ల మంది సంతోషానికి కారణమైనందుకు ప్రధాని నరేంద్ర మోడీ, యావత్ దేశం తరఫున థ్యాంక్స్ చెబుతున్నా” అని అన్నారు. దేశం మొత్తాన్ని, ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్స్ అందరినీ మీరాబాయ్‌ ఇన్‌స్పైర్‌‌ చేసిందని, అందుకు ఆమెకు థ్యాంక్స్ అని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఒలింపిక్స్‌లో మొదటి రోజున మీరా స్టార్ట్ చేసిన తీరులోనే మిగిలిన అథ్లెట్స్‌ కూడా అద్భుత విజయాలను సాధిస్తారని తనకు నమ్మకం ఉందని అన్నారు. వాళ్లంతా కూడా తమ గెలుపుతో భారత్‌కు గర్వకారణంగా నిలుస్తారని కేంద్ర మంత్రి అనురాగ్ అన్నారు.

టోక్యో ఒలింపిక్స్‌లో ఈవెంట్స్ మొదలైన తొలి రోజే భారత్ బోణీ కొట్టింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో తొలి మెడల్ సాధించింది. 49 కిలోల కేటగిరీలో మీరాబాయ్ చానూ సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకుంది. భారత్‌కు 21 ఏండ్ల తర్వాత మళ్లీ వెయిట్ లిఫ్టింగ్‌లో మెడల్ సాధించి పెట్టిందామె. 2020 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో కరణం మల్లేశ్వరి తొలిసారి వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మీరాబాయ్ మెడల్ గెలుచుకుంది. ఈ సారి ఏకంగా వెండి పతకాన్ని సొంతం చేసుకోవడం విశేషం. వెయిట్ లిఫ్టింగ్‌లో ఈ మెడల్ రావడం తొలిసారి.