
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ హామీ ఇచ్చారు. టోక్యో ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చాక ఆమెతో కలిసి ఐస్‌క్రీమ్ తింటానని మాట ఇచ్చారు. జులై 23 నుంచి జపాన్‌లోని టోక్యోలో జరగబోతున్న ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న ఇండియన్ అథ్లెట్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా సింధుతో ఈ సరదా సంభాషణ జరిగింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన వచ్చిన తర్వాత ఓ జాతీయ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీవీ సింధు మాట్లాడుతూ ‘ట్రైనింగ్ టైమ్‌లో కోచ్ పుల్లెల గోపీ చంద్ నా ఫోన్ తీసేసుకున్నారు. డైట్ విషయంలోనూ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. కనీసం ఐస్‌క్రీమ్ కూడా తిననిచ్చే వారు కాదు’ అని చెప్పింది. ఈ ఇంటర్వ్యూను గతంలో చూసిన ప్రధాని మోడీ సింధు తన డైట్ గురించి చెప్పిన విషయాన్ని గుర్తు పెట్టుకుని, ఈ రోజు ఇంటరాక్షన్‌లో ఆ విషయాన్ని ప్రస్తావించి, టోక్యో నుంచి తిరిగొచ్చాక కలిసి ఐస్‌క్రీమ్ తిందామని చెప్పారు. ‘‘సింధూజీ, మీరు ఈ స్థాయి చేరుకోవడం కోసం మీ తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేశారు. వాళ్లు తమ వంతు చేయగలిగిందంతా చేశారు. ఇప్పుడు దాని ప్రతిఫలం ఏంటన్నది మీ చేతుల్లోనే ఉంది. మీరు కచ్చితంగా మరోసారి విజయం సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. మీరంతా ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చాక, మనం కలిసి ఐస్‌క్రీం తిందాం” అంటూ మోడీ నవ్వేస్తూ చెప్పారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్న ప్లేయర్స్ అంతా ఒక్కసారిగా నవ్వారు. అంతకు ముందు ప్రధాని మోడీ ప్రాక్టీస్ ఎలా జరిగిందని అడగ్గా, హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో బాగా ప్రాక్టీస్ చేశానని, కరోనా పరిస్థితుల్లోనూ ప్రభుత్వం బాగా సహకరించిందని చెప్పారు. ఆమె ఐస్‌క్రీమ్ గురించి మాట్లాడుతూ అథ్లెట్‌గా డైట్ కంట్రోల్ చేసుకోకతప్పదని చెప్పింది.