హైదరాబాద్లో అర్ధరాత్రి దాకా హోటల్ నడపాలంటే.. ఈ సీఐకి నెలకు రూ.50 వేలు ఇయ్యాలె !

హైదరాబాద్లో అర్ధరాత్రి దాకా హోటల్ నడపాలంటే.. ఈ సీఐకి నెలకు రూ.50 వేలు ఇయ్యాలె !
  • హోటళ్ల నుంచి టోలీచౌకి సీఐ నెలవారీ మామూళ్లు 
  • రూ. 50 వేలకు ఒప్పందం
  • ఫస్ట్​నెల రూ.10 వేలు డిస్కౌంట్​
  • రెండో విడత రూ.20 వేలు తీసుకుంటూ దొరికిండు 
  • లెక్కల్లో చూపని నగదు రూ.1.80 లక్షలు 

మెహిదీపట్నం, వెలుగు: ఏసీబీకి చిక్కిన టౌలీచౌకీ సీఐ రమేశ్​నాయక్​ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. పీఎస్​ పరిధిలోని ఓ హోటల్‌‌ టైమింగ్స్​ విషయంలో సహకరించేందుకు నెలకు రూ.50 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఆన్‌‌లైన్ ఫుడ్ ఆర్డర్లు పూర్తి చేసుకోవడానికి అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత అదనంగా మరో గంట పాటు హోటల్ క్యాఫెటీరియా నడుపుకోవడానికి అనుమతి ఇచ్చేందుకు నెలకు రూ.50 వేలు డిమాండ్ చేశాడు. దీనికి నెలకు రూ.50 వేలకు డీల్​కుదుర్చుకుని..మొదటి నెల రూ.10 వేలు డిస్కౌంట్​ఇచ్చినట్టు తెలిసింది. 

అందులో భాగంగా అక్టోబర్​31న రూ.20 వేలు తీసుకోగా..మిగిలిన రూ.20 వేలను గురువారం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. పట్టుబడినప్పుడు ఏసీబీ జరిపిన సోదాల్లో నాలుగు వేర్వేరు కవర్లు కనిపించగా..అందులో రూ.1.80 లక్షల నగదు దొరికింది. లెక్కల్లో చూపని ఈ నగదును గుర్తించి సీఐని విచారిస్తున్నట్టు సమాచారం. నిందితుడిని అరెస్ట్‌‌ చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు అదనపు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్‌‌ రిమాండ్‌‌కు తరలించారు.