కాబూల్ పేలుళ్లలో 110కి చేరిన మృతులు

V6 Velugu Posted on Aug 27, 2021

కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట నిన్న జరిగిన వరుస పేలుళ్లలో చనిపోయినవారి సంఖ్య 110కి  చేరింది. అందులో 13 మంది అమెరికా సైనికులున్నారు. మొత్తంగా మృతుల్లో 28 మంది తాలిబాన్ సభ్యులు కూడా ఉన్నట్టు సమాచారం. తాలిబాన్లకు శతృవు అయిన ISIS-ఖొరోసన్ సంస్థ ఈ పేలుళ్లకు బాధ్యత ప్రకటించుకుంది. తమ ఆత్మాహుతి దళ సభ్యులే ఈ దాడికి పాల్పడినట్టు తెలిపింది. అమెరికా ఆర్మీతో కొలాబరేట్ అయినవారు, ట్రాన్స్ లేటర్లను తాము టార్గెట్ చేసినట్టు ప్రకటించింది. మరోవైపు అఫ్గన్ లో మరిన్ని దాడులు జరగొచ్చని అమెరికా అనుమానిస్తోంది. దీనిపై అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం. 

కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట హింసకు కారణమైన వారిని వదిలిపెట్టబోమన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వారిని క్షమించబోమని... వారిని వేటాడి హతం చేస్తామని ప్రకటించారు. చేసిన తప్పుకు శిక్ష అనుభించాల్సిందేనన్నారు. అయితే ఈ దాడికి తాలిబాన్, ఇస్లామిక్ స్టేట్ కలసి కుట్ర చేశాయనడానికి ఎలాంటి ఆధారం లేదన్నారు బైడెన్. ఈనెల 30వరకు సంతాప దినాలు ప్రకటించింది అమెరికా. అప్పటివరకు అమెరికా జాతీయ జెండాను సగం వరకు దించనున్నారు. 

అయితే కాబూల్ దాడితో తాలిబాన్లకు కూడా సంబంధం ఉందంటున్నారు స్వయం ప్రకటిత అప్గనిస్తాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్. ISIS-ఖొరోసన్, తాలిబాన్లు, హక్కానీ నెట్ వర్క్ లకు సంబంధాలున్నాయని చెప్పారు. ఉగ్ర సంస్థలకు మాస్టర్ అయిన పాకిస్తాన్ మాదిరిగానే ఈ సంస్థలు అద్ధాలు చెప్పడం నేర్చుకున్నాయని సెటైర్లేశారు. 

అఫ్గనిస్తాన్ నుంచి పౌరుల తరలింపును మరికొన్ని గంటల్లో పూర్తి చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ వెయ్యిమందిని ఎయిర్ లిఫ్ట్ చేసినట్ట వివరించింది. మరికొన్ని గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని స్పష్టం చేసింది. ఆశ్రయం కోసం దరఖాస్తులను కూడా క్లోజ్ చేసింది. మిడ్ ఆగస్ట్ నుంచి నిన్నటివరకు దాదాపు 14వేల మంది బ్రిటీష్ పౌరులు, ఆప్గన్ వాసులను తరలించింది బ్రిటన్. ఇక స్పెయిన్ కూడా ఇవాళ్టితోనే ఎవాక్యుయేషన్ ప్రక్రియను ఆపేస్తున్నట్టు ప్రకటించింది. 

Tagged 110dead, Kabul Airport, Afghanistan Crisis, attacks

Latest Videos

Subscribe Now

More News