హ్యాట్రిక్ హిట్స్ తో తిరుగులేని స్టార్ డమ్ అతని సొంతం

హ్యాట్రిక్ హిట్స్ తో  తిరుగులేని స్టార్ డమ్ అతని సొంతం

ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా స్వయం కృషి, పట్టుదలతో సిల్వర్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలిగాడు. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు. చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్.. మనసంతా నువ్వే అంటూ అభిమానుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. హ్యాట్రిక్ హిట్స్ తో  ఇండస్ట్రీని తన వైపు తిప్పుకుని... తిరుగులేని స్టార్ డమ్ తో యూత్ లో  క్రేజ్ పెంచుకున్నాడు.   తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను  ఆకట్టుకున్న ఆ నట కిరణం పుట్టిన రోజు (జూన్ 26)  సందర్బంగా అతని జ్ఞాపకాలు మరోసారి..

ఉదయ్ కిరణ్ వాజపేయాజుల.. ఇదీ తన పూర్తి పేరు. హైదరాబాద్‌లో జన్మించాడు. బీకాం పూర్తిచేశాడు. కాలేజ్‌లో ఉన్నప్పుడే మోడలింగ్  స్టార్ట్ చేశాడు. ‘మిస్టీరియస్‌ గాళ్’ అనే హింగ్లిష్ సినిమాలో కూడా నటించాడు. అయితే దాని రిలీజ్ విషయంలో సమస్యలు తలెత్తాయి. అంతలో తేజ రూపంలో అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. ‘చిత్రం’ సినిమాలో చాన్స్ వచ్చింది. మొదటి సినిమానే హిట్. బాగా నటించాడనే పేరు రావడంతో ఇక అవకాశాలు క్యూ కట్టాయి. నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు అంటూ ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేసుకుంటూ పోయాడు. అంతేకాదు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకున్నాడు.

తిరుగులేని ఇమేజ్

చక్కని నవ్వు.. లోతైన భావాల్ని పలికించే కళ్లు.. తనదైన డైలాగ్ డెలివరీ.. అన్నీ కలిసి ఉదయ్ కిరణ్‌ని బెస్ట్ ఆర్టిస్టుని చేశాయి. ‘నువ్వు నేను’ సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. వరుస ప్రేమకథల్లో నటించడంతో ఉదయ్ కిరణ్‌ అంటే యూత్‌లో చెప్పలేనంత క్రేజ్ ఏర్పడింది. అమ్మాయిలు అతనిలో తమ కలల రాకుమారుణ్ని చూసుకునేవారు. అబ్బాయిలు తనలా అవ్వాలని కోరుకునేవారు. తన ఇమేజ్ ఎంత పెరిగిపోయిందంటే.. కె.బాలచందర్‌‌ పిలిచి మరీ తనతో సినిమా తీశారు. ‘పాయ్’ టైటిల్ తో తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాతో తమిళనాట కూడా నోటెడ్ అయ్యాడు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత అక్కడ ‘వంబు సందయ్’, ‘పెన్ సింగం’ అనే మరో రెండు చిత్రాల్లో నటించాడు. 

ఊహించని మలుపు

హ్యాట్రిక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ లు కొట్టి లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్..  జై శ్రీరామ్, కలుసుకోవాలని, హోలీ వంటి సినిమాలు వరుస ఫ్లాప్  లు పలకరించినా కెరీర్ ను నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే అతను విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.  కెరీర్‌‌లో దెబ్బ తిన్నా.. వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకున్నాడులే అనుకున్నారంతా. కానీ  ఊహించని ఈ మలుపులు ఉదయ్ కిరణ్‌ని రేసులో వెనుకబడేలా చేశాయి.వ్యక్తిగత కారణాలు అతడిని బాగా కుంగదీశాయి. దీంతో ఏటా మూడు, నాలుగు సినిమాలు చేసే ఉదయ్ కిరణ్ సంవత్సరానికి ఒక్క సినిమా చేసే స్థాయికి వచ్చేశాడు.  రెండేళ్లు తిరక్కుండానే తనకి నూరేళ్లు నిండిపోతాయని ఎవరూ ఊహించలేదు. 33ఏళ్ల  వయస్సులో 2014  జనవరి 5 న శ్రీనగర్ కాలనీలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్ కిరణ్.

అతను ఆత్మహత్య చేసుకోవడంతో   తెలుగు సినీ పరిశ్రమే కాదు.. యావత్ తెలుగు ప్రజానీకం షాకైపోయింది. ఉదయ్ కిరణ్‌ చనిపోవడమేంటి.. అందరిలోనూ ఇదే ప్రశ్న. అతని మరణం చాలామందిని కంటతడి పెట్టించింది.  ఒక అభిమాని అయితే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అంతటి అభిమానాన్ని సంపాదించుకున్న ఒక టాలెంటెడ్ యాక్టర్‌ జీవితం ‌ అర్ధంతరంగా ఆగిపోయింది.