సీఎం జగన్ తో టాలీవుడ్ పెద్దల భేటీ

సీఎం జగన్ తో టాలీవుడ్ పెద్దల భేటీ
  • భేటీలో పాల్గొననున్న చిరంజీవి, అల్లు అరవింద్, మహేశ్ బాబు, రాజమౌళి, ప్రభాస్

ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు. చిరంజీవి, అల్లు అరవింద్, మహేశ్ బాబు, ప్రభాస్, అలీ,  రాజమౌళి, కొరటాల శివ, గిరిధర్, బాబీ, నిరంజన్, పోసాని, నారాయణ మూర్తి సహా మొత్తం 13 మంది సినీ  పెద్దలు జగన్ తో భేటీ అయ్యారు. సినిమా టికెట్ల రేట్లు, ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధిపై సీఎం  జగన్ తో చర్చిస్తున్నారు. 17 అంశాలను సీని పెద్దలు జగన్ ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు చేరుకున్న టాలీవుడ్ బృందం...తర్వాత రోడ్డు మార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. 


భేటీ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తాం..
 సీఎం జగన్ భేటీ తర్వాత అన్ని విషయాలు  వెల్లడిస్తామన్నారు చిరంజీవి. ఇండస్ట్రీ సమస్యలకు ఎండ్ కార్డు పడుతుందన్నారు అల్లు అరవింద్. 

ఫిలిం ఛాంబర్ లేకుండ భేటీ ఏంటి?
జగన్ తో సినీ పెద్దల భేటీపై మంచు విష్ణు, తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు లేకుండా భేటీ ఏంటని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో అన్ని అంశాలపైనా చర్చ జరగపోవచ్చన్న అభిప్రాయాలను వారు వ్యక్తం చేశారు.

భేటీ ఎందుకంటే..
ఏపీలో కొంతకాలంగా సినిమా టికెట్స్ వివాదం కొనసాగుతోంది. సామాన్య ప్రేక్షకుడికి సినిమాను అందుబాటులో ఉంచాలన్నదే లక్ష్యమంటూ... టిక్కెట్ ధరలను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరిస్తూ జీవో నెంబర్ 35 జారీ చేసింది సర్కార్. నిబంధనలు ఉల్లంఘించారంటూ కొన్ని థియేటర్స్ ను సీజ్ చేశారు అధికారులు. దీన్ని సినీ ఇండస్ట్రీ  తీవ్రంగా వ్యతిరేకంచింది. టికెట్ ధరలను తగ్గించటం వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని కొంతమంది సినీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. హీరో నాని, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తోపాటు కొంతమంది బహిరంగగానే తమ అభిప్రాయాల్ని చెప్పారు. సర్కార్ తెచ్చిన జీవోతో సినిమా ఆడించటం కష్టమని తెలిపారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల కిందట చిరంజీవి అమరావతి వెళ్లి సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను జగన్ కు వివరించారు. అంతేకాదు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఆ తర్వాత నటుడు ఆర్. నారాయణ మూర్తి  కూడా సీఎం జగన్ ను కలిశారు. పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. టిక్కెట్స్ ఇష్యూ కంటిన్యూ అవుతున్న వేళా ఏపీ మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ భేటీ అయ్యారు. ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ పై ఇద్దరు చర్చించారు. టికెట్ల రేట్లు తగ్గించటాన్ని రాంగోపాల్ వర్మ పూర్తిగా వ్యతిరేకించారు. టికెట్ల వివాదంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దీన్ని విచారించినా కోర్టు..వివాదంపై కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు సూచనలతో సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది. టికెట్ల ధరలపై సలహా,సూచలనలు ఇచ్చింది కమిటీ. వీటన్నింటిని పరిణామల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీతో ఎండ్ కార్డు పడుతుందా ?లేదా?  అనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

అవమానించిన మోడీ.. క్షమాపణలు చెప్పాల్సిందే

ఐపీఎల్ లో కొత్త జట్టు పేరు గుజరాత్ టైటాన్స్