సినిమా అవకాశాల కోసం వచ్చి ఎంతో మంది అమ్మాయిలు.. నటులు, ప్రొడ్యూసర్ల చేతిలో మోసపోతుంటారు.. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కాని, ప్రొడ్యూసర్ గా చెలామణి అవుతున్న ఓ కిలాడీ లేడీ వలలో పడి ఓ వ్యక్తి మోసపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
పెళ్లి చేసుకుంటానని చెప్పి కెమెరా అసిస్టెంట్‌ను ఓ మహిళా నిర్మాత మోసం చేసిన ఘటన ఫిలిం నగర్ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ నగరంలోని వెంకటగిరికి చెందిన పి నాగార్జున బాబు(35) అనే వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో సదరు మహిళా ప్రడ్యూసర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం.. స్నేహంగా మారింది. దీంతో నాగార్జున బాబు తన వ్యక్తిగత విషయాలతోపాటు బ్యాంకు ఆధారాలను ఆమెతో పంచుకున్నాడు. సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో అతనని డిన్నర్ కు తన ఇంటికి ఆహ్వానించింది. దీంతో అతను ఆమె ఇంటికి వెళ్లగా.. పెళ్లి ప్రపోజల్ చేసింది. తనకు పెళ్లి అయ్యిందని.. కాని, తన భర్తకు విడాకులు ఇచ్చానని.. మనం పెళ్లి చేసుకుందామని చెప్పింది. దీంతో ఇద్దరు చిలుకూరు టెంపుల్ లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత పలు సాకులు చెబుతూ క్రమంగా అతని నుంచి రూ.18.7 లక్షల వరకు డబ్బులు వసూల్ చేసింది. ఈ క్రమంలో నాగార్జునకు ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి.. ఆమె గురించి విచారణ చేయగా.. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుందని.. పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో తాను మోస పోయానని గ్రహించిన నాగార్జున.. ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. గతంలో మహిళా నిర్మాతపై నార్సింగి, కూకట్ పల్లి, ఆంధ్రప్రదేశ్ లోనూ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.