Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు మృతి.. సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

నటుడు కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నింపింది. ఈ క్రమంలో కోటని తలుచుకుంటూ సినీ, రాజకీయ  ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కొందరు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తుండగా, మరికొందరు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రస్థానంలో ఆయన సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు.

కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చలన చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. భౌతికంగా కోట గారు మన మధ్య లేకపోయినా.. ఆయన పోషించిన విభిన్న పాత్రలతో.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’అని రేవంత్‌రెడ్డి Xలో ట్వీట్ చేశారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘ఆయన తన విలక్షణమైన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. సినీ అభిమానుల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారని చెప్పారు. కోట మరణంతో సినీరంగం ఒక గొప్ప నటుడుని కోల్పోయిందన్నారు. కోట ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులకు  తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు కేసీఆర్‌’.  

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నటుడు కోటకు సంతాపం ప్రకటించారు. ‘వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళా సేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం.

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’అని సీఎం చంద్రబాబు Xలో ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. ‘విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యా. తెలుగు తెరపై విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు భాష... యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్‌గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా.. ప్రతి పాత్రలో ఒదిగిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను..’అని పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.

కోట మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ‘ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మృతి విచారకరం. విల‌క్ష‌ణ‌మైన‌ పాత్ర‌ల్లో న‌టించి, మెప్పించిన ఆయ‌న‌ను ప‌ద్మ‌శ్రీతో పాటు ఎన్నో అవార్డులు వ‌రించాయి. కోటా గారి మృతి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ నివాళులు’ అని X లో పోస్ట్ పెట్టారు.

కోట శ్రీనివాస రావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాస రావు ఇక లేరనే వార్త ఎంతో కలచివేసిందన్నారు. ప్రాణం ఖరీదు' చిత్రంతో ఆయన తాను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించామని గుర్తు చేశారు. 

‘‘లెజెండరీ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ఆయన నేను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి  పాత్రని తన  విలక్షణ, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట . 

కామెడీ విలన్, అయినా  సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్ గా ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో  కుంగదీసింది. 

శ్రీ కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని  ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి, నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నానని’’చిరంజీవి సంతాపం వ్యక్తం చేసారు. 

‘కోట శ్రీనివాసరావును చూస్తూ, ఆరాధిస్తూ.. ఆయన్నుంచి ఎంతో నేర్చుకుంటూ పెరిగాను. కోట బాబాయ్ నాకు కుటుంబం లాంటివాడు. ఆయనతో కలిసి పని చేసిన మధురమైన జ్ఞాపకాలను గుర్తుంచుకుంటాను. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’హీరో రవితేజ Xలో పోస్ట్ చేశారు.