లోక్సభ బరిలో సినీ నిర్మాతలు!

లోక్సభ బరిలో సినీ నిర్మాతలు!
  • మల్కాజ్ గిరి నుంచి బండ్ల గణేశ్ దరఖాస్తు
  • నిజామాబాద్ బరిలో నిర్మాత దిల్ రాజు?
  • హస్తం పార్టీ తరఫున పోటీ కోసం క్యూ
  • భువనగిరి బరిలో తీన్మార్ మల్లన్న!
  • మెదక్ పార్లమెంటుకు మైనంపల్లి షిఫ్ట్!
  • పాలమూరులో వంశీచందర్ రెడ్డి వర్క్ స్టార్ట్

హైదరాబాద్: కాంగ్రెస్లో లోక్సభ టికెట్లకు భారీ క్యూ ఏర్పడింది. ఇద్దరు సినీ నిర్మాతలు కూడా రాజకీయ భవిష్యత్ ను పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.  నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మరో సినీ నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.

 నిర్మాతల మండలి ఎన్నికల సమయంలో తాను ఎంపీగా పోటీ చేస్తానని హింట్ ఇచ్చిన దిల్ రాజు ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది. ఆయన సొంత జిల్లా నిజామాబాద్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే మాపల్లె  చారిటబుల్ ట్రస్ట్ పేరిట తన స్వగ్రామం నర్సింగ్ పల్లితో పాటు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తోంది దిల్ రాజు ఫ్యామిలీ. అయితే నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎమ్మల్సీ జీవన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్  నుంచి తనకు అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత దరఖాస్తు చేసుకున్నారు. 

అయితే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మైనంపల్లి హన్మంతరావు మల్కాజ్ గిరి రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నా.. మైనంపల్లి మెదక్ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. నిన్న సిద్దిపేట వెళ్లిన మైనంపల్లి.. స్థానికంగా ఓ సమావేశం ఏర్పాటు చేసి తాను పోటీలో ఉంటానని చెప్పినట్టు తెలిసింది.

అయితే ఇదే స్థానం  నుంచి తనకూ టికెట్ కావాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అడుగుతున్నారు.  సినీ నిర్మాత బండ్ల గణేశ్ మాత్రం తనకు మల్కాజ్ గిరి టికెట్ వస్తుందనే ధీమాలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న భువనగిరి నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు.  ఈ సెగ్మెంట్  నుంచి చామల కిరణ్​ కుమార్ రెడ్డి, కైలాస్ నేత, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. 

షరతులు వర్తిస్తాయా?

లోక్  సభ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న వారిలో చాలా మంది ఇటీవల ఎమ్మెల్యేలుగా ఓటమి పాలైన వారే ఉండటంతో కొత్త చర్చ తెరమీదకు వచ్చింది.  ఏఐసీసీ కండిషన్ ప్రకారం ఒక ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఏడాది వరకు మళ్లీ కంటెస్ట్ చేసే అవకాశం ఉండదు.

అలా టికెట్ ఆశిస్తున్న వారిలో మైనంపల్లి హన్మంతరావు(మల్కాజ్ గిరి), జగ్గారెడ్డి( సంగారెడ్డి), కొమ్మూరి ప్రతాప్ రెడ్డి (జనగామ), సంపత్ కుమార్( అలంపూర్),  జీవన్ రెడ్డి( జగిత్యాల), ఇందిర( స్టేషన్ ఘన్ పూర్), కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (మహేశ్వరం), ఫిరోజ్ ఖాన్ (నాంపల్లి), అజారుద్దీన్( జూబ్లీ హిల్స్) ఉన్నారు. వీళ్లకు కాంగ్రెస్ అధినాయకత్వం టికెట్ ఇస్తుందా..? లేదా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. 

ఖమ్మం స్థానానికి తీవ్ర పోటీ!

ఖమ్మం టికెట్ కోసం అగ్రనేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ రేణుకాచౌదరి తోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, రాజ్యసభ మాజీ ఎంపీ వీ హనుమంతరావు, పీసీసీ నేత రాజేంద్ర ప్రసాద్ ఖమ్మం టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఈ సీటు ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

  • సెగ్మెంట్                    ఆశావహులు
  • ఆదిలాబాద్               నరేశ్​ జాదవ్
  • నిజామాబాద్             దిల్ రాజు/జీవన్ రెడ్డి/ ఈరవత్రి అనిల్/ ఆకుల లలిత
  • కరీంనగర్                  ప్రవీణ్​ రెడ్డి, జీవన్ రెడ్డి, నేరెళ్ల  శారద
  • పెద్దపల్లి                     గడ్డం వంశీకృష్ణ
  • మెదక్                         మైనంపల్లి హన్మంతరావు/ జగ్గారెడ్డి, త్రిష (మంత్రి దామోదర కుమార్తె )
  • జహీరాబాద్                సురేష్ షెట్కార్, త్రిష (మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె )
  • మల్కాజ్ గిరి              బండ్ల గణేశ్/ మైనంపల్లి హన్మంతరావు/ హరివర్ధన్ రెడ్డి
  • సికింద్రాబాద్             విద్యాస్రవంతి, అనిల్ కుమార్ యాదవ్, వేణుగోపాల స్వామి(సీఏ)
  • హైదరాబాద్              ఫిరోజ్ ఖాన్, అజహరుద్దీన్, (ఎంబిటి కి పొత్తులో ఇచ్చే ఛాన్స్)
  • చేవెళ్ల                         చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి, కేల్ఆర్, గౌరీ సతీశ్
  • నల్గొండ                      జానారెడ్డి ,రఘువీర్ రెడ్డి (జానారెడ్డి కుమారుడు), పటేల్ రమేశ్​రెడ్డి
  • భువనగిరి                   తీన్మార్ మల్లన్న/చామల కిరణ్​ కుమార్ రెడ్డి/కైలాస్ నేత/ కొమ్మూరి ప్రతాప్   రెడ్డి
  • వరంగల్                     అద్దంకి దయాకర్/ సర్వే సత్యనారాయణ/ సిరిసిల్ల రాజయ్య/దొమ్మటి సాంబయ్య/ పులి అనిల్ కుమార్/ ఇందిర
  • మహబూబాబాద్        బల్ రాంనాయక్/ బెల్లయ్య నాయక్, కాశీరాం నాయక్(పోలీసు ఉన్నతాధికారి)
  • ఖమ్మం                        రేణుకాచౌదరి, రాజేంద్ర ప్రసాద్, నందిని మల్లు భట్టి విక్రమార్క/ పొంగులేటి ప్రసాదరెడ్డి, వీహెచ్
  • మహబూబ్ నగర్       జీవన్ రెడ్డి (ఎంఎస్ఎన్ ఫార్మా), వంశీచంద్ రెడ్డి, జిల్లెల ఆదిత్య రెడ్డి, సీతాదయాకర్ రెడ్డి, శివసేనారెడ్డి
  • నాగర్ కర్నూల్          సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేశ్​