షూటింగ్లో కళ్లు తిరిగి పడి పోయిన హీరో నాగశౌర్య

షూటింగ్లో కళ్లు తిరిగి పడి పోయిన హీరో నాగశౌర్య

హైదరాబాద్: ​యువ హీరో నాగశౌర్య షూటింగ్ సమయంలో  కళ్లు తిరిగిపడిపోయారు. దీంతో యూనిట్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగశౌర్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేవలం వైరల్ ఫీవర్ వల్ల అడ్మిట్ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

నాలుగు రోజుల నుంచి ఉపవాసంలో ఉన్నప్పటికీ హీరో నాగశౌర్య ఫైటింగ్ సీన్స్ చేస్తున్నారని.. అందుకే కళ్లు తిరిగిపడిపోయారని వార్తలు వస్తున్నాయి. నాగశౌర్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. 

హీరో నాగశౌర్య పెళ్లి ఫిక్స్ అయింది.  ఈనెల 20న బెంగుళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషని నాగశౌర్య పెళ్లిచేసుకోబోతున్నారు. తన పెళ్లి వల్ల సినిమా మధ్యలో ఆగిపోకూడదని.. నాగశౌర్య యధావిధిగా షూటింగులో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. పవన్ బసంత్ దర్శకత్వంలో ఎస్ఎల్వీ బ్యానర్ పై తెరకెక్కుతున్న మూవీలో హీరో నాగశౌర్య నటిస్తున్నారు. వారం రోజుల్లో పెళ్లి ఉన్నప్పటికీ తన వల్ల మూవీ ఆగిపోకూడదని నాగశౌర్య జ్వరంతో ఉన్నప్పటికీ షూటింగులో పాల్గొంటున్నట్లు సమాచారం. 

కొత్త సినిమాలకు అనుగుణంగా తన శరీరాకృతిని మార్చుకునేందుకు నాగశౌర్య తీవ్రంగా శ్రమించడం వల్లే కళ్లు తిరిగిపడిపోయినట్లు చెబుతున్నారు. నాగశౌర్య ప్రస్తుతం ‘నారీ నారీ నడుమ మురారి, ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి, పోలీసు వారి హెచ్చరిక తోపాటు.. మరో సినిమాలో నటిస్తున్నారు. కమిట్ అయిన సినిమాలను వేగంగా పూర్తి చేసేందుకు నాగశౌర్య తీవ్రంగా ప్రయత్నిస్తూ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.