టొమాటో అనేది నిజానికి పండు. పండే అయినప్పటికీ టొమాటో కలపకపోతే చాలా రకాల కూరలు తయారవ్వవు. వంటలకి అంత ఫేవరెట్ అయిన టొమాటో... అందానికి మెరుగులు దిద్దడంలో కూడా అంతే ఫేవరెట్.
టొమాటో రెమెడీస్
*టొమాటోను ముఖానికి రుద్ది, పావుగంట తరువాత మామూలు నీళ్లతో కడిగేయాలి.
*మొటిమల మీద టొమాటో గుజ్జు రాస్తుంటుంటే మొటిమలు తగ్గిపోతాయి.
*టొమాటో జ్యూస్లో బేకింగ్ పౌడర్ కలిపి పేస్ట్ చేయాలి. ముఖం మీద జిడ్డు ఉన్న, బ్లాక్ హెడ్స్ వచ్చే ప్రాంతాల్లో ఈ పేస్ట్ పూయాలి. ఐదు నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ కి బ్రేక్ వేయవచ్చు.
*టొమాటో, కీరదోస జ్యూస్ లు ఒక్కో టీ స్పూన్ చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మీద జిడ్డు తగ్గిపోతుంది.
*నార్మల్, ఆయిలీ, కాంబినేషన్ స్కిన్ వాళ్లు... టీ స్పూన్ల ఓట్స్ లో కొంచెం గుడ్డు తెల్లసొన కలపాలి. అందులో రెండు టీస్పూన్ల టొమాటో జ్యూస్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ జారుగా ఉండొద్దు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాలు లేదా అరగంట ఉంచుకోవాలి. అదీకాదంటే ముఖానికి రాసుకున్న మిశ్రమం ఆరేవరకు ఉంచి కడిగేయాలి.
*ఎండ వల్ల చర్మం దెబ్బ తింటే కూడా టొమాటో రెమెడీ ఉంది. టొమాటో జ్యూస్ లో మిల్క్ పౌడర్ వేసి పేస్ట్ కలపాలి. ఈ పేస్టు ముఖానికి రాసుకుంటే చర్మం మీద ట్యాన్ పోగొడుతుంది.
*డ్రై స్కిన్ ఉన్న వాళ్లయితే టొమాటో జ్యూస్ లో ఆల్మండ్ ఆయిల్ కలిపి రాసుకోవాలి. ఇది కూడా ట్యాన్ ను తీసేస్తుంది. చర్మం రంగును మెరుగుపరుస్తుంది.
*టొమాటో రసం లేదా గుజ్జు వేరే పండ్లతో కలిపి వాడితే అది ఫ్రూట్ మాస్క్ అవుతుంది. టొమాటో రసంలో మిగలపండిన అరటిపండు, బొప్పాయి గుజ్జు వేయాలి. ఇందులోనే యాపిల్ తురుము కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ఇది ఏ రకమైన చర్మం ఉన్న వాళ్లయినా వాడొచ్చు.

