కేజీ టమాటా రూ.300 అయ్యి తీరుతుంది.. తగ్గేది అప్పుడే

కేజీ టమాటా రూ.300 అయ్యి తీరుతుంది.. తగ్గేది అప్పుడే

టమాటా.. మరింత రెచ్చిపోనుంది. కేజీ టమాటా 300 రూపాయలు కానుంది. ఎప్పుడో కాదు.. జులై నెలాఖరుకు.. అంటే మరో 10 రోజుల్లోనే.. కచ్చితంగా కిలో టమాటా 300 రూపాయలకు చేరటం వెనక కారణాలు చాలానే ఉన్నాయంటున్నారు వ్యాపారులు. 

టమాటా పంట మార్కెట్ కు రావటానికి 60 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం నెల రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో అంటే ఆగస్ట్ నాటికి తగ్గుతాయని అంచనా వేశారు వ్యాపారులు. అయితే ఉత్తర భారతదేశంలో అనూహ్యంగా వరదలు రావటం.. పంటలు అన్నీ పూర్తి నాశనం కావటంతో.. ఇప్పుడు ఉత్తరాదికి టమాటా పంట కేవలం సౌత్ ఇండియా నుంచే వెళ్లాలి. 

ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోనే ప్రస్తుతం టమాటా అందుబాటులో ఉంది. దేశం మొత్తం ఈ మూడు రాష్ట్రాల నుంచే టమాటా కొనుగోలు చేయాల్సి రావటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని.. జులై నెలాఖరు నాటికి కిలో 300 రూపాయలకు చేరుకుంటుందని నేషనల్ కమోడటీస్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గుప్తా ప్రకటించారు. 

ప్రస్తుతం టమాటా ధర కిలో 150 నుంచి 250 రూపాయల మధ్య నడుస్తుంది. ఆయా రాష్ట్రాల్లో భారీ తేడా ఉంది. ఉత్తర భారతదేశంలో వరదలతో మరింత డిమాండ్ పెరిగి.. ధర మరింత పెరగనున్నట్లు చెప్పేశారాయన. 

మరి టమాటా ధర ఎప్పుడు తగ్గుతుంది అంటే.. సెప్టెంబర్ నెలాఖరు నాటికి సాధారణ ధరకు వస్తుందని.. అప్పటి వరకు వినియోగదారులు ఈ ధర భరించాల్సిందే అంటున్నారు. సో.. కిలో టమాటా 300 రూపాయలకు కొని తినటమా లేక టమాటా లేకుండా తినటమా అనేది మీ ఛాయిస్..