టమాట ధరలు పతనం..రైతు నుంచి రూ.5కే కొంటున్న దళారులు

టమాట ధరలు పతనం..రైతు నుంచి రూ.5కే కొంటున్న దళారులు
  • బహిరంగ మార్కెట్​లో కిలో రూ.15 నుంచి రూ.20 వరకు అమ్మకాలు
  • కర్నాటక, ఏపీ నుంచి పంట దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులు

మహబూబ్​నగర్​, వెలుగు : టమాట రేట్లు పడిపోయాయి. రెండు వారాలుగా మార్కెట్​లో వీటి ధరలు   తగ్గుతూ వస్తున్నాయి. నిన్న, మొన్నటి వరకు కిలో రూ.20 వరకు పలుకగా, ప్రస్తుతం కిలో రూ.5క పడిపోయింది. ఈ ధర రైతులకు గిట్టుబాటు కాక, తెచ్చిన పంటను తిరిగి వెంట తీసుకెళ్లలేక వచ్చిన ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 

ఏపీ, కర్నాటక నుంచి దిగుమతి..

ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఏపీలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, మదనపల్లె, కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు, బెంగళూరు ప్రాంతాల్లో ఈ సీజన్​లో టమాట సాగు ఎక్కువగా జరిగింది. ఈ ఏడాది వర్షాలు, వాతావరణం అనుకూలించడంతో అక్కడ టమాట దిగుబడులు ఆశించిన దానికన్నా రెట్టింపుగా వస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు పెద్ద మొత్తంలో పంటను మార్కెట్లకు తెస్తుండడంతో  రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి.

దీంతో ఈ ప్రభావం తెలంగాణపై పడింది. అక్కడి హోల్​ సేల్ మార్కెట్​లో హైబ్రిడ్​ రకానికి చెందిన కిలో టమాట రూ.5 నుంచి రూ.6 వరకు, లోకల్​ టమాట రూ.2 నుంచి రూ.3 వరకు దొరుకుతుండడంతో తెలంగాణ వ్యాపారులు అక్కడి పంటను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానికంగా సాగైన టమాటకు డిమాండ్​ పడిపోయింది. దీనికితోడు వ్యాపారులు ఏపీ, కర్నాటక నుంచి హైబ్రీడ్​ రకం టమాటనే దిగుమతి చేసుకుంటుండడంతో లోకల్​ టమాట ఎవరూ కొనడం లేదు.

రూ.70కే 25 కిలోల బాక్స్..​

మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లోని బాలానగర్​, నవాబుపేట, జడ్చర్ల, హన్వాడ, గండీడ్​, మహమ్మదాబాద్​, నర్వ, మక్తల్, దామరగిద్ద మండలాల్లో టమాట తోటలు ఎక్కువగా ఉన్నాయి. నవంబరులో టమాట నార్లు పెట్టుకోగా, అదే నెల చివరిలో నాట్లు వేశారు. దీని పంట కాలం 70 రోజులు కాగా,  ప్రస్తుతం క్రాప్​ ప్రారంభం అయ్యాయి. గ్రౌండ్​ వాటర్​ బాగా ఉండడంతో ఇక్కడా ఆశించిన స్థాయికంటే దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. కానీ, రైతులకు లాభం కలగడం లేదు.

నారాయణపేట మార్కెట్​లో శనివారం ఉదయం ఒక టమాట బాక్స్​ (25కిలోలు)ను రైతుల నుంచి వ్యాపారులు రూ.70కే కొన్నారు. మహబూబ్​నగర్​లో  బాక్స్​కు రూ.70 నుంచి రూ.80 వరకు చెల్లిస్తున్నారు. ఈ ధరలు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కనీసం రవాణా చార్జీలకు సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు కనీసంగా రూ.15నుంచి రూ.20 వరకు చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. 

ఓపెన్​ మార్కెట్​లో అధిక ధరలు..

హోల్​ సేల్​గా రైతుల నుంచి పంటను తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు.. అదే పంటను రిటైల్​ వ్యాపారులకు డబుల్​ రేట్​కు అమ్ముతున్నారు. క్వింటాళ్ల లెక్కన రిటైల్​ వ్యాపారులు కొంటుండడంతో వారికి కిలో టమాట ధర రూ.10 వరకు పడుతోంది. దీంతో వారు బహిరంగ మార్కెట్లలో కిలో టమాటను రూ.15 నుంచి రూ.20 వరకు అమ్ముతున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే సంతల్లో రూ.18 వరకు కిలో చొప్పున అమ్ముతున్నారు. ఇతర మార్కెట్లు, కిరాణా షాపుల వద్ద రూ.25కు రెండు కిలోల చొప్పున అమ్ముతున్నారు. కానీ రైతులకు మాత్రం కిలోకు అతి తక్కువ ధర చెల్లిస్తున్నారు. 

టమాట కొనట్లే.. 

కష్టపడి టమాటను పండించినం.. కానీ, కొనేటోళ్లు లేరు. పొలంలోనే పంట ఉంచలేక.. లాభం లేనిదే మార్కెట్​ కు తెచ్చి అమ్ముకోలేక.. మస్తు ఇబ్బంది పడుతున్నం. చేసేదిలేక బుట్టలకొద్దీ టమాటాలను రోడ్లపైనే పారబోసే కాలమొచ్చింది. ఏంజేయాలో దిక్కుతోస్తలేదు.. - రాములమ్మ, టమాట రైతు, టంకర, హన్వాడ

దిగుబడి బాగుంది.. ధర లేదు.. 

నాకున్న రెండు ఎకరాల్లో అర ఎకరంలో టమాట వేసిన. మిగతా పొలంలో బెండకాయ పెట్టిన. టమాట దిగుబడి బాగానే వస్తున్నది.. కానీ, ధరే లేదు..  వ్యాపారులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చే టమాటాను కొంటున్రు. అదే ధరను మాకు ఇస్తున్రు. కానీ, మాకు గిట్టుబాటు అయితలేదు.. మస్తు నష్టపోతున్నం. - కావలి మాసన్న, టమాట రైతు, అమ్మాపూర్​