
దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. ఇందులోభాగంగా ఇప్పటికే మూడు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. నాలుగో దశ పోలింగ్ రేపు( సోమవారం) జరగనుంది. ఎన్నికల ప్రచారం నిన్నటితో (శనివారం) ముగిసింది.
తొమ్మిది రాష్ట్రాల్లోని మొత్తం 72 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరుగనుంది. ఈ దశల్లో 943 మంది అభ్యర్థులు సోమవారం జరిగే ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. మహారాష్ట్రలో 17, రాజస్థాన్ 13, ఉత్తర ప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 8, మధ్యప్రదేశ్ 6, ఒడిశా 6, బీహార్ 5, జార్ఖండ్ 3, జమ్ముకశ్మీర్‌లో ఒక నియోజకవర్గానికి నాలుగో విడుతలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడ, సీధీ, జబల్‌పూర్, మహారాష్ట్రలోని ఉత్తర ముంబై, దక్షిణ ముంబై, ఉత్తర మధ్య ముంబై, ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్, కన్నౌజ్, పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్, రాజస్థాన్‌లోని జలావర్ బరన్, జోధ్‌పూర్, బాడ్‌మేర్ ఈ విడుతలో కీలక నియోజకవర్గాలుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజలు ఈ విడుతలోనే తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటుండగా.. మహారాష్ట్రలో నాలుగో విడుతతో ఎన్నికలు ముగుస్తాయి.