పొగాకు నుంచి క‌రోనా వ్యాక్సిన్ త‌యారు చేసిన సిగ‌రెట్ కంపెనీ

పొగాకు నుంచి క‌రోనా వ్యాక్సిన్ త‌యారు చేసిన సిగ‌రెట్ కంపెనీ

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికే 46 ల‌క్ష‌ల మందికి పైగా వైర‌స్ సోకింది. మూడు ల‌క్ష‌ల మందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లితీసుకుంది. దీనికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి వ్యాక్సిన్ గానీ, మందు గానీ లేదు. సింప్ట‌మేటిక్ ట్రీట్మెంట్ ద్వారా క‌రోనా బారిన‌ప‌డిన వారిని కాపాడుతున్నారు వైద్యులు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 17 ల‌క్ష‌ల మందికి పైగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ మ‌హమ్మారిని పూర్తిగా నివారించేందుకు వ్యాక్సిన్ త‌యారీపై ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు రీసెర్చ్ సంస్థ‌లు ప్ర‌యోగాలు చేస్తున్నాయి.

లండ‌న్ లోని ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్ అభివృద్ధి చేసి.. ఇప్ప‌టికే మ‌నుషుల‌పై ప్ర‌యోగాలు కూడా మొద‌లుపెట్టారు. ఇప్పుడు తాజాగా లండ‌న్ కు చెందిన సిగ‌రెట్ త‌యారీ కంపెనీ బ్రిటిష్ అమెరిక‌న్ టొబాకో క‌రోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. ల్యాబ్ లో చేసిన ప్రీ క్లినిక‌ల్ ప్ర‌యోగాలు స‌క్సెస్ అయ్యాయ‌ని శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. త్వ‌ర‌లోనే మ‌నుషులపై క్లినిక‌ల్ ప్ర‌యోగాలు చేయ‌బోతున్న‌ట్లు తెలిపింది.

జూన్ చివ‌రిలో మ‌నుషుల‌పై ప్ర‌యోగాలు

క‌రోనా వైర‌స్ ను కృత్రిమంగా ల్యాబ్ లో త‌యారు చేసి దాని యాంటిజెన్స్ ను అభివృద్ధి చేశామ‌ని బ్రిటిష్ అమెరిక‌న్ టొబాకో కంపెనీ వెల్ల‌డించింది. ఈ యాంటీజెన్స్ ను పొగాకు మొక్క‌ల్లోకి చొప్పించి.. అవి పెరిగిన తర్వాత వాటి నుంచి ప్యూరిఫైడ్ యాంటీజెన్స్ త‌యారైన‌ట్లు తెలిపింది. దీని ద్వారా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క‌రోనా వైర‌స్ ను ఎదుర్కొనే ఇమ్యూనిటీని ఇవ్వ‌గ‌లుగుతోంద‌ని ప్ర‌క‌టించింది. బ్రిటిష్ అమెరిక‌న్ టొబాకో కంపెనీకి చెందిన కెంట‌కీ బ‌యో ప్రాసెసింగ్ సంస్థ ఈ ప్ర‌యోగాల‌ను చేప‌ట్టింది. ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్డీఏ) సంస్థ ఆమోదం పొందిన త‌ర్వాత జూన్ చివ‌రిలో అమెరికాలో మ‌నుషుల‌పై క్లినిక‌ల్ ప్ర‌యోగాల‌ను ప్రారంభిస్తామ‌ని బ్రిటిష్ అమెరిక‌న్ టొబాకో తెలిపింది. అయితే పొగాకు ఉత్ప‌త్తుల వ‌ల్ల ఏటా 80 ల‌క్ష‌ల మంది కేన్స‌ర్ వంటి జ‌బ్బుల‌తో చ‌నిపోతుండ‌గా.. ఇప్పుడు అదే పొగాకు నుంచి క‌రోనా వ్యాక్సిన్ అభివృద్ధికి ప్ర‌యోగాలు జ‌ర‌గ‌డం విశేషం. మ‌రోవైపు సిగ‌రెట్లు తాగే వారి లంగ్స్ బ‌ల‌హీన‌మై.. క‌రోనా వైర‌స్ సోకి తీవ్రంగా ఇబ్బందిప‌డే ప్ర‌మాదం ఎక్కువ‌ని కూడా డ‌బ్ల్యూహెచ్ఓ చెప్పింది.