ఢిల్లీలో వాయు కాలుష్యంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం

ఢిల్లీలో వాయు కాలుష్యంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం

ఢిల్లీలో వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు వైఫల్యం అయ్యాయని తెలిపింది. ఈ నెల 10న ఢిల్లీ, పంజాబ్ , హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తన ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై మానవ హక్కుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 47 ప్రకారం ప్రజారోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాల్సిన బాధ్యత  ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.

దీంతో పాటు ఈ మధ్య కాలంలో తమ ప్రాంతాల్లో పొగను నివారించడానికి చేపట్టిన చర్యల గురించి తెలియజేయాలని ఆదేశించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపట్నుంచి ప్రైమరీ స్కూళ్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాలుష్యం తగ్గే వరకు స్కూళ్లు మూసేవేస్తామని చెప్పారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం వెలువరించారు. ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం 5 నుంచి 8వ తరగతి విద్యార్థుల ఔట్ డోర్ యాక్టివిటీస్పై నిషేధం విధించారు.