
- మోహన్‌రెడ్డి స్వస్థలం నిర్మల్ జిల్లా కూచనపల్లి
- సరోజది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి
- నాలుగు దశాబ్దాల అజ్ఞాతవాసానికి తెర
నిర్మల్/బెల్లంపల్లి, వెలుగు : మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయుధాలు, టెక్నికల్ విభాగం చీఫ్ నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండలం కూచనపల్లికి చెందిన ఇర్వి మోహన్‌రెడ్డి ఆయన భార్య దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ బెల్లంపల్లి కన్నాల బస్తీకి చెందిన సలాకుల సరోజతో కలిసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ జనజీవన స్రవంతిలో కలవడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
40 ఏండ్లుగా అజ్ఞాతవాసం
కూచనపల్లికి చెందిన మోహన్‌రెడ్డి 40 ఏండ్ల కింద ఐటీఐ చదువుతున్న టైంలో ఆర్‌ఎస్‌యూలో పనిచేస్తూనే అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇంటివైపు కన్నెత్తి చూడలేదు. 2007లో జార్ఖండ్‌లో ఆయుధాల డెన్‌తో సహా పోలీసులకు దొరికి జైలుకు వెళ్లాడు.
2011లో జైలు నుంచి విడుదల అయ్యాక మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల కింద ఎస్పీ జానకి షర్మిల కూచనపల్లి వెళ్లి మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చాలా ఏండ్ల నుంచి కుటుంబ సభ్యులతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ కాంటాక్ట్‌లో లేకపోవడంతో ఏదో ఓ ఎన్‌కౌంటర్‌లో చనిపోయి ఉంటాడని భావించారు.
అయితే అనూహ్యంగా మావోయిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లోజుల వేణుగోపాలరావుతో కలిసి మహారాష్ట్రలో లొంగిపోయారు. మరో వైపు బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తీకి చెందిన సలాకుల రాజమ్మ, సాయిలుకు ఆరుగురు సంతానం. అందరికంటే చిన్న అయిన సరోజ బెల్లంపల్లిలోని జడ్పీ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది.
చదువుకుంటున్న టైంలోనే కరీంనగర్ జిల్లా పొత్కపల్లి సమీపంలోని జీలకుంటకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో సరోజ పుట్టింట్లోనే ఉంటూ పీపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితురాలైంది. ఎక్కడ స్టేజీ కనిపించినా అక్కడికి వెళ్లి పాటలు పాడేది. అలా కొన్నిరోజుల తర్వాత అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది.
కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకి తెలియలేదు. అప్పటికే పీపుల్స్‌వార్ ఉద్యమంలో ఉన్న కన్నాలబస్తీకి చెందిన పలువురు నాయకులు సరోజ నక్సలైట్లతో కలిసి పనిచేస్తోందని సమాచారం ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఆమె ఇంటివైపు కన్నెత్తి చూడలేదు.
మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తూనే కీలకమైన పదవులు పొందుతూ వచ్చింది. 2009లో రూర్కెలాలో అరెస్ట్ అయిన సరోజను వరంగల్ జైలులో ఉంచారు. కొన్ని నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన సరోజ మళ్లీ మావోయిస్ట్ పార్టీలోకి వెళ్లిపోయింది. పార్టీలోనే సహచరుడైన మోహన్‌రెడ్డిని వివాహం చేసుకుంది.
జిల్లా ఖాళీ..
నిర్మల్ జిల్లాకు చెందిన మావోయిస్ట్ పార్టీ సీనియర్ నేత ఇర్వి మోహన్‌రెడ్డి ఆయన భార్య సరోజ లొంగిపోవడంతో జిల్లాలో మావోయిస్ట్ పార్టీ ఖాళీ కొన్ని రోజుల కింద నిర్మల్ జిల్లాకు చెందిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, ఝార్ఖండ్ రాష్ట్ర ఇన్‌చార్జి సట్వాజీ అలియాస్ సుధాకర్‌తో పాటు ఆయన భార్య, అలాగే రాష్ట్ర కమిటీ మెంబర్ నాయనగారి మురళి అలియాస్ రవి, అజయ్ తదితరులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇప్పుడు మోహన్‌రెడ్డి, సరోజ కూడా ఆజ్ఞాత జీవితం వీడడంతో జిల్లాలో పార్టీ పూర్తిగా కనుమరుగైనట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
టీవీలోనే చూశాం
సరోజ లొంగిపోయినట్లు టీవీల్లోనే చూశాం. వరంగల్ జైలులో ఉన్నప్పుడే కలిశాం ఆ తర్వాత మళ్లీ కలవలేదు. మా చెల్లెలు లొంగిపోవడం సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ చూసుకునే అవకాశం కలిగింది.
- సలాకుల మల్లయ్య, రామస్వామి... సరోజ అన్నలు-