
తహశీల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఏసీటీఓ వంటి క్రేజీ పోస్ట్‌లు ఉండే గ్రూప్2 సర్వీస్‌కు లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు ఫైనల్ రివిజన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యమైన టాపిక్స్ మీద ఎలా ఫోకస్ చేయాలో తెలుసుకుందాం..
మొత్తం 783 పోస్ట్‌లకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఒక్కో పోస్ట్‌కు 705 మంది పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ స్థాయి పోటీలో నెగ్గాలంటే.. అభ్యర్థులు పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ఇప్పటివరకు చదివిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కామన్ టాపిక్స్ : అభ్యర్థులు కామన్ టాపిక్స్‌ను ఒకే సమయంలో చదివేలా ప్లాన్ చేసుకోవాలి. పరీక్ష సిలబస్‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లలోని ఉమ్మడి అంశాలను గుర్తించి.. వాటిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్; భారత రాజ్యాంగం, పరిపాలన, ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్.. ఇలా అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది. ప్రతి రోజు సగటున 8 నుంచి 10 గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించేలా టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి.
రివిజన్‌తో సబ్జెక్టుపై పట్టు : గ్రూప్–2 అభ్యర్థులు రివిజన్ ఎంతో ప్రాధాన్యం ఉంటుందని గ్రహించాలి. పరీక్ష తేదీలకు కనీసం 15 రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌కు సమయం కేటాయించుకోవాలి. రివిజన్ సమయంలో షార్ట్ నోట్స్, సొంత నోట్స్‌లను అనుసరించాలి. దీంతోపాటు ప్రీవియస్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ సాధన కూడా గ్రూప్2 పరీక్షలో విజయానికి దోహదం చేస్తుంది. సబ్జెక్టు ఇంతకుముందు ఎంత చదివినా ఫైనల్‌గా ఒకసారి పునశ్చరణ చేసుకుంటే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
పేపర్స్ వారీగా ప్రిపరేషన్
జనరల్ స్టడీస్ : వాస్తవంగా గ్రూప్-2 ప్రిపరేషన్‌లో అత్యంత క్లిష్టమైన పేపర్ ఇది. పదకొండు అంశాలతో కూడిన ఈ పేపర్‌లో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, పర్యావరణం, భూగోళం, చరిత్ర- సంస్కృతి, రాష్ట్ర-, కేంద్ర ప్రభుత్వ విధానాలు, సామాజిక రక్షణ, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్ కీలకాంశాలు. అభ్యర్థులు దీనిని చివరికి వాయిదా వేయడం మంచిది. ప్రధానంగా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో లేటెస్ట్ సమాచారానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా అక్టోబరు మొదటివారం వరకు సంఘటనలు నమోదు చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించడం అవసరం. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, బేసిక్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ కోసం గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం అవసరం. ప్రధానంగా అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా గుర్తెరగాలి. మిగిలిన అంశాలు పేపర్-2, పేపర్-3, పేపర్-4లో భాగంగా అధ్యయనం చేయాలి.
చరిత్ర, పాలిటీ, సమాజం : ఈ పేపర్‌లో భారత చరిత్ర- సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తూ 30 మార్కులు కేటాయించారు. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతచరిత్రలో ఆధునిక చరిత్ర ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సమయం తక్కువగా ఉండటం వల్ల విద్యార్థులు బీఏ మొదటి, రెండో సంవత్సరం అకడమిక్ పుస్తకాలు చదవడం మంచిది. తెలంగాణ చరిత్ర- సంస్కృతిపై అవగాహనకు ఇంటర్ రెండో సంవత్సరం లేదా బీఏ ఫైనల్ ఇయర్ చరిత్ర పుస్తకాలు చదవడం అవసరం. 50 మార్కులు కేటాయించిన పాలిటీ ప్రిపరేషన్ చాలా ముఖ్యమైంది. సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగ సవరణలు, పరిపాలనా సంస్కరణలు, సుపరిపాలన దిశగా చర్యలు, స్థానిక ప్రభుత్వాల అంశాలు అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. ఇటీవలికాలంలో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల పేపర్లు, వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పేపర్లు పరిశీలించడం అవసరం. సమాజశాస్త్రం కోసం 50 మార్కులు కేటాయించారు. అయితే గత ప్రశ్నపత్రాల్లో ఈ శాస్త్రంపై ప్రశ్నల సంఖ్య తక్కువ. అవగాహన కోసం తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు ఉపయోగపడతాయి.
ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి : అభ్యర్థులను ఎక్కువగా ఆందోళనకు గురిచేసే పేపర్ ఆర్థికవ్యవస్థ. మారిన సిలబస్‌కు అనుగుణంగా ఉన్న ఇంటర్ రెండో సంవత్సరం అర్థశాస్త్రం, బీఏ ఫైనల్ ఇయర్ డెవలప్‌మెంట్ ఎకానమీ చదవడం అవసరం. వీటితోపాటుగా ఇండియన్ ఎకనమిక్ సర్వే రిపోర్టులు, తెలంగాణ ఎకనమిక్ సర్వే రిపోర్టులను అవగతం చేసుకోవడం అవసరం. డేటాను గుర్తుపెట్టుకోవడం కన్నా విశ్లేషణ ఫలితాలను అవగతం చేసుకోవడం అవసరం.
స్టేట్ పై ‘స్పెషల్’ ఫోకస్
తెలంగాణ ప్రత్యేక అంశాలను చదివేటప్పుడు.. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ పేరుతో ప్రత్యేకంగా ఉన్న టాపిక్స్‌ను మరింత లోతుగా అధ్యయనం చేయాలి. చరిత్రలో తెలంగాణలో రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు-రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు-వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగా హన ఏర్పరచుకోవాలి.
తెలంగాణలోని ముఖ్యమైన నదులు-పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యమున్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం-విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపైనా అవగాహన అవసరం. ఎకాన మీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్య మైన పరిశ్రమలు-ఉత్పాదకతతోపాటు, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన పెంచుకోవాలి. తాజా బడ్జెట్ గణాంకాలు, ఆయా శాఖలు, పథకాలకు కేటాయింపులపై పట్టు సాధించాలి.
తెలంగాణ ఉద్యమం : గ్రూప్-2 అభ్యర్థులు పేపర్-4పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ఇందులో ‘తెలంగాణ ఆలోచన (1948-1970), ఉద్యమ దశ(1971-1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం(1991-2014).. అని మూడు దశలను పేర్కొన్నారు. ముఖ్యంగా సిలబస్‌లో నిర్దేశించిన ప్రకారం -1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకూ జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు - వాటి సిఫార్సులపై పట్టు సాధించాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తెలంగాణకు కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి.
- వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్