- 10 ఎకరాల్లో పంట నష్టం
- వాటర్ స్పౌట్‌లో చిక్కుకున్న రైతులు..
- చెట్లను పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నరు
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల అడవుల్లో ఘటన
జయశంకర్భూపాలపల్లి/పలిమెల,వెలుగు:
గోదావరి పరివాహక ప్రాంతంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా గాలులు సుడులు తిరిగాయి. చూస్తుండగానే వాటర్ స్పౌట్ ఏర్పడగా.. అక్కడున్నవారు చిక్కుకుపోయారు. క్షణాల్లోనే పచ్చని పంటలు, చెట్లు నేలకొరిగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ సమీపంలో మంగళవారం (నవంబర్ 04) జరిగిన ఈ ఘటన అలస్యంగా తెలిసింది.
సాయంత్రం వర్షం పడడంతో పొలం పనులు ముగించుకొని రైతులు ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో గోదావరిలో ఏర్పడిన సుడిగుండం 60 మీటర్ల వెడల్పుతో ఆకాశాన్ని తాకుతూ 5 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసింది. బండారి భాస్కర్, మధుసూదన్, శ్రీనివాస్, సమ్మక్క, ఇస్మాయిల్.. వాటర్ స్పౌట్ (నీటి సుడిగుండం) లో చిక్కుకున్నారు. వారిని ఆ నీటి సుడిగుండం కొంతదూరం వరకు లాక్కెళ్లింది. దొరికిన చెట్లను పట్టుకొని వారు ప్రాణాలు కాపాడుకున్నారు.
రాత్రి ఇంటికి చేరుకున్న రైతులు.. బుధవారం ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. అందరూ కలిసి పొలాల దగ్గరకెళ్లి పరిశీలించారు. మోటార్లను తరలిస్తున్న ఎడ్ల బండి సుడిగుండంలో కొట్టుకుపోయిందని, ఎడ్లు తప్పించుకోగా బండిలో ఉన్న పనిముట్లు గాల్లో కొట్టుకుపోయాయని రైతులు తెలిపారు. వాటర్ డ్రమ్ములు, పైపులు గాల్లోకి ఎగిరాయని, 10 ఎకరాల్లో పత్తి , మిరప తోటలు నేలకొరిగాయని వివరించారు.
200 చెట్లు నేలమట్టం
వాటర్ స్పౌట్ ప్రభావంతో రాళ్లవాగు వెంబడి అటవీ ప్రాంతంలో చెట్లు నేలకొరిగాయి. అడవిలో సాయిల్ లూజ్‌గా ఉన్న చోట చెట్లు వేళ్లతో సహా కూలిపోగా.. గట్టిగా ఉన్న చోట కొమ్మలు వాలిపోయాయి. 60 మీటర్ల వెడల్పుతో కిలోమీటర్ పొడవునా 200 చెట్లు నేలమట్టం అయినట్లు పలమెల రేంజర్ నాగరాజు తెలిపారు. గోదావరిలో ఏర్పడిన వాటర్ స్పౌట్.. లెంకలగడ్డ అటవీప్రాంతం నుంచి మహాముత్తారం అడవుల వైపు వెళ్లిందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇదే ఊర్ల వైపు వచ్చి ఉంటే భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగేదని అంటున్నారు.
ఆమడ దూరంలపడ్డ..
‘మదన్నా ఏందో మీదికొస్తాందే.. ఉరుకు.. ఉరుకు..’ అని మా కాక అన్నడు. ఒక్కసారి చీకటి కమ్మింది. నీటి సుడిగుండం మమ్మల్ని పైకి లేపి కిందపడేసింది. ఆ అదునుకు ఆమడ దూరం పడ్డ. మాకు ఏమైతున్నదో అర్థంకాలే. చేతికి దొరికిన చెట్టును పట్టుకొని పాణాలు కాపాడుకున్నం.
- బండారి మధుసూదన్ , రైతు, లెంకలగడ్డ
చెట్టును పట్టుకొని పాణాలు కాపాడుకున్నం..
రోజటి లెక్క పనులు చేసుకొని ఇంటికి పోతుంటే.. సల్లగాలితో తుంపర స్టార్ట్ అయ్యింది. వర్షం పడుతుందేమో అనుకున్నాం.. మీదికి చూస్తే ఆకాశానికి అంటుకొని ఓ పెద్ద మేఘం కనపడ్డది. ఆ తర్వాత ఏమైందో తెల్వది. గాలిలోకి పైకి లేసి కింద పడ్డ.. నా పక్కన ఎడ్ల బండి పైకి లేసుడు కనవడ్డది. ఒకలెనుక ఒకలం చేనుల ఉన్న టేకుచేట్టును గట్టిగ పట్టుకొని బతికి బయట పడ్డం.
- బండారి శ్రీనివాస్, రైతు. లెంకలగడ్డ
