
- మెయిన్ రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు
- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోనూ వానలు
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోనూ 3 గంటల పాటు కుండపోత
- అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
మెదక్/ ఎల్బీనగర్/ వికారాబాద్/ హైదరాబాద్, వెలుగు: మెదక్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో గురువారం (సెప్టెంబర్ 11) కుండపోత వర్షం కురిసింది. మెదక్ టౌన్‌లో 3 గంటల వ్యవధిలోనే 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రాజ్‌పల్లిలో 13.4, కొల్చారంలో 8.8, పాతూరులో 8.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.
గురువారం ఉదయం 9 గంటల వరకు వాతావరణం సాధారణంగానే ఉండగా, అప్పటికప్పుడు ఆకాశం మేఘావృతమై దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని ఎంజీ రోడ్డు, మున్సిపల్ కాంప్లెక్స్, రాందాస్ చౌరస్తా, ఫతేనగర్ రోడ్డు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. షాప్‌ల ముందు నిలిపిన బైక్‌లు, కార్లు వరద నీటిలో మునిగిపోయాయి.
పలు దుకాణాల్లోకి వరద చేరింది. పట్టణం మధ్యలో నుంచి వెళ్లే మహబూబ్ నహర్ కాలువ ఉప్పొంగడంతో సాయినగర్ కాలనీ, ఆటో నగర్ మెయిన్ రోడ్డు జలమయమయ్యాయి. సాయినగర్ కాలనీలో కార్లు, బైక్‌లు నీట మునగగా.. ఆటోనగర్ మెయిన్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నర్సిఖేడ్ రోడ్డులోని గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలోకి పెద్ద ఎత్తున వరద రావడంతో స్టూడెంట్లు, లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణ శివారులోని గాంధీనగర్ కాలనీ కూడా నీట మునిగింది. పిల్లికోట్టాలల్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలోని రోడ్లపై భారీ వరద చేరింది.
విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్..
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వాన దంచికొట్టింది. మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. షాపుల్లోకి వరద చేరడంతో ఫైరింజన్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. అలాగే హైదరాబాద్‌తో పాటు మేడ్చల్మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. హైదరాబాద్ శివారులోని ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, నాగోల్, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్ద అంబర్‌పేట్, మీర్‌పేట్ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. అత్యధికంగా హయత్‌నగర్‌లో 11 సెంటీమీటర్లు, ఉప్పల్‌లో 4.58, వనస్థలిపురంలో 4.48, సరూర్‌నగర్‌లో 4.15, నాగోల్‌లో 3.10, కేపీహెచ్‌బీలో 2.60, మాదాపూర్‌లో 2.53 సెంటమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరద చేరింది. హయత్ నగర్‌లోని రాఘవేందర్ కాలనీ, శాంతినగర్, వనస్థలిపురం, గాంధీనగర్, చైతన్య నగర్, విజయపురి కాలనీల్లోకి పెద్ద ఎత్తున వరద వచ్చింది. విజయవాడ నేషనల్హైవేపై నీళ్లు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్జామ్ఏర్పడింది. వనస్థలిపురం నుంచి హయత్ నగర్ వార్డ్ అండ్ డీడ్ వరకు 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మన్సూరాబాద్నుంచి బండ్లగూడ వెళ్లే దారిలో భారీ వరద రావడంతో 3 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది.
వికారాబాద్‌లో వ్యక్తి గల్లంతు..
వికారాబాద్ జిల్లాలో వాగు ప్రవాహంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. భారీ వర్షాలకు తాండూరు మండలం సంగెం కలాన్ సమీపంలోని దిడ్డి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన మొగులప్ప పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా వాగు ప్రవాహంలో గల్లంతయ్యడు. అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, పోయినేడాది ఇదే వాగులో మొగులప్ప సోదరుడు పెంటప్ప గల్లంతై చనిపోయాడు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి: సీఎం
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ‘‘పురాతన, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించండి.
హైదరాబాద్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీసు సిబ్బంది సమన్వయంతో పని చేయాలి. కాజ్‌వేలు, కల్వర్టుల పైనుంచి వరద ప్రవాహం ఉంటే.. అటువైపు ఎవరూ వెళ్లకుండా చూడాలి. చెరువులు, కుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి” అని అధికారులకు సీఎం సూచించారు.