
- యాదాద్రి జిల్లాలో 1259.1 మి. మీ. వర్షం
- అడ్డగూడూరులో అత్యధికంగా 164 ఎం.ఎం వర్షపాతం నమోదు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో వాన దంచికొట్టింది. ఆదివారం రాత్రి మొదలైన వాన సోమవారం రాత్రి వరకు అక్కడక్కడా భారీగా కురిసింది. దీంతో జిల్లాలోని పలు వాగుల్లో వరద కొనసాగింది. చెరువులు కొన్ని అలుగుపోశాయి. కొన్ని చోట్ల పొలాల్లోకి నీరు చేరింది. జిల్లాలో అత్యధికంగా అడ్డగూడురు మండలంలో 164.1 ఎంఎం వాన నమోదైంది. ఆ తర్వాత ఆత్మకూరు(ఎం), గుండాల, బొమ్మల రామారం, తుర్కపల్లి మండలాల్లో 124 ఎంఎం నుంచి 148 ఎంఎం వరకు కురిసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిసి 1259.1 మిల్లీ మీటర్ల వాన కురిసింది.
ఉధృతంగా బిక్కేరు వాగు..
జిల్లాలోని బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆత్మకూరు (ఎం) మండలంలో కొరటికల్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. బీబీనగర్‌లో చిన్నెరు నది వాగులో వరద నీరు ప్రవహిస్తోంది. యాదగిరిగుట్ట మండలం చొల్లేరు- మర్రి గూడెం మధ్య రోడ్డుపై వరద చేరింది. ధర్మారం చెరువులోకి వాన నీరు చేయడంతో అలుగు పారుతోంది. దీంతో సమీపంలోని పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. సంగెంలో మూసీ ప్రవాహం కొనసాగుతోంది. జిల్లాలో సోమవారం రాత్రి 7 గంటల సమయంలో మళ్లీ వాన మొదలైంది.
పరిశీలించిన కలెక్టర్..
బీబీనగర్‌లో ఉధృతంగా ప్రవహిస్తున్న చిన్నేరు వాగును కలెక్టర్హనుమంతరావు పరిశీలించారు. యాదగిరి గుట్ట మండలం చొల్లేరులో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. వరదనీరు ప్రవహిస్తున్నప్పుడు ప్రజలు దాటే సాహసం చేయొద్దని ఆయన సూచించారు.
పులిచింతలకు వరద కంటిన్యూ..
మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద సోమవారం కూడా కంటిన్యూ అయింది. ఎగువ నుంచి 2,31,641 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో 9 గేట్లను 4 మీటర్లు ఎత్తి 2,81,807 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 42.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది.