IPL 2024: MI vs RCB మ్యాచ్‌ను చుట్టుముడుతున్న వివాదాలు.. ఏంటి ఈ టాస్ ట్యాంపరింగ్..?

IPL 2024: MI vs RCB మ్యాచ్‌ను చుట్టుముడుతున్న వివాదాలు.. ఏంటి ఈ టాస్ ట్యాంపరింగ్..?

ఏప్రిల్ 11న వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో అంపైర్లు.. ముంబైకి అనుకూలంగా నిర్ణయాలిచ్చారని నెటిజన్లు ఆరోపిస్తుండగా.. తాజాగా ఈ మ్యాచ్‌కు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మ్యాచ్ రిఫరీ టాస్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారన్నది వస్తున్న ఆరోపణలు. అసలు టాస్ వేసే సమయంలో ఆరోజు ఏం జరిగింది..? ఈ టాస్ ట్యాంపరింగ్ అంటే ఏంటి..? అనేది తెలుసుకుందాం..

ఈ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్.. టాస్ వేసే సమయంలో ముంబై ఇండియన్స్ గెలిచినట్లు తెలిపాడు. దాంతో పాండ్యా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడే టాస్ ట్యాంపరింగ్ జరిగిందని ఆర్‌సీబీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. భారత మాజీ పేసర్ టాస్ ఫలితాన్ని మార్చారని, తద్వారా ముంబై ఇండియన్స్‌కు అనుకూలంగా వ్యవహరించారని చెప్తున్నారు. శ్రీనాథ్ నాణేన్ని పక్కకు తిప్పి తారుమారు చేశాడని కామెంట్లు చేస్తున్నారు. అందుకు సాక్ష్యంగా టాస్ వేసే వీడియోను పోస్ట్ చేశారు. 

అభిమానులు పోస్ట్ చేసిన ఆ వీడియోలో మాజీ పేసర్ నాణేన్ని తారుమారు చేసినట్లు ఎలాంటి రుజువు కనిపించడం లేదు.. అంతా అస్పష్టంగా ఉంది. అయితే, ఓటమిని జీర్ణించుకోలేక ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ముంబై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ చర్చ వల్ల మున్ముందు జరగబోయే మ్యాచ్ ల టాస్ దృశ్యాలను లైవ్ లో చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇక, ఈ మ్యాచ్ విషయానికొస్తే.. ఏకపక్షంగా ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 196 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ముంబై బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని 27 బంతులు ముగిలివుండగానే చేధించారు.