సమ్మర్ వెకేషన్​కి సూపర్ ప్లేస్ ‘కేలటగన్’

సమ్మర్ వెకేషన్​కి సూపర్ ప్లేస్  ‘కేలటగన్’

అది ఫిలిప్పీన్స్​లోని బటంగస్​ ప్రావిన్స్​లో ఉన్న కేలటగన్ అనే తీర ప్రాంతం. అక్కడ దాదాపు అరవై వేల మందికిపైగా ప్రజలు ఉన్నారు. సముద్రపు ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం టూరిస్ట్​లకు ఎంతో ఇష్టమైన ప్లేస్​. తెల్లటి ఇసుకతో మెరిసే బీచ్​లు, రిసార్ట్​లు టూరిస్ట్​లతో కళకళలాడుతుంటాయి. పిల్లల కోసం స్పెషల్​గా పార్క్ కూడా ఉంది. దాంతో పాటు శాండ్ బార్, లైట్ హౌస్​, స్టార్​ ఫిష్​ ఐల్యాండ్... వంటి బోలెడు ఎగ్జైట్​మెంట్ ప్లేస్​లు ఉన్నాయి అక్కడ. 

కేలటగన్’ అనేది తగలోగ్ పదం ‘‘లటాగ్” నుండి వచ్చింది. ఇది‘‘కెపటగన్”పదానికి దగ్గరగా ఉంటుంది. దానర్థం కొండలు, పర్వతాల మధ్య ఉన్న చదునైన ఖాళీ ప్రదేశం అని. కేలటగన్ అంటే విశాలమైన, చదునైన భూమి అని అర్థం. ఇక్కడి కరెన్సీని ‘పెసో’ అంటారు. 

కేలటగన్​ ప్రాంతం ఇప్పుడు​ మున్సిపాలిటీ. కానీ ఒకప్పుడు హిస్టారికల్ ప్లేస్​. ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ చేసిన తవ్వకాల్లో పురాతన కాలం నాటి కుండలు బయటపడ్డాయి. వాటి మీద రీసెర్చ్​ చేసి, గతంలో అక్కడ నివసించిన ప్రజలు, వాళ్ల కల్చర్​ గురించి తెలుసుకున్నారు. అక్కడ ఫిలిపినోల​ కంటే ముందు, స్పానిష్​ ప్రజలు ఉండేవాళ్లు. వాళ్లతోపాటే చైనావాళ్లు కూడా ఉండి ఉంటారని అంచనా. ఎందుకంటే తవ్వకాల్లో దొరికిన కుండల్లో వాళ్లకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఒకరకంగా చూస్తే ఆ ఊళ్లో స్పానిష్​ ప్రజలే ఎక్కువ అని తేల్చారు ఆర్కియాలజిస్ట్​లు. అయితే చైనా వ్యాపారవేత్తలు... ఓడల్లో ఇక్కడికి వచ్చేవారని, వాళ్లకు ప్రధాన వ్యాపార కేంద్రం బలాంగ్ బటో అని ఆ స్టడీలోనే తేలింది. ఇదంతా ఒకప్పటి విషయం అయితే... ఇప్పుడు కేలటగన్ చేరుకోవాలంటే మిన్​డోరో, మనీలాల నుంచి నౌకల్లో వెళ్ళల్సి ఉంటుంది. 

చరిత్ర చెప్పే విశేషాలు..

కేలటగన్ ప్రాంతాన్ని 1829లో స్పానిష్​​ నుంచి డాన్ డొమింగొ రొక్సాస్​ ఆక్రమించుకున్నాడు. అందుకని అప్పటి నుంచి దాన్ని ‘హసిండా డి కేలటగన్’ అని పిలిచేవారు. ఆ తర్వాత ఆయన వారసులు పెడ్రో పి. రొక్సాస్​, ఆంటోనియో ఆర్. రొక్సాస్​లు ఆ ప్రాంతాన్ని డెవలప్​ చేశారు.1912లో గవర్నర్​ జనరల్ విలియం కామెరన్ ఫోర్బ్స్​, కేలటగన్​ని ఇండిపెండెంట్ మున్సిపాలిటీగా చేశాడు.1931లో రొక్సాస్​ చివరి వారసుడు కార్మెన్ రొక్సాస్​, హసిండా జోబెల్ బ్రదర్స్, జాకబ్, అల్ఫాన్సోలకు అప్పగించాడు. అయితే1934లో మరో రెండు ప్రాంతాలు హసిండా కేలటగన్​లో భాగమని సర్వేల్లో తేలింది. కేలటగన్​ని మున్సిపాలిటీ చేయడం ఈజీ అయింది.1957 వరకు అమెరికా స్వాధీనంలో ఉన్న ఫిలిప్పీన్స్​కు అదే ఏడాది అక్టోబర్​లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత పదేండ్లకు కేలటగన్ ప్రజల కోరిక మేరకు, జోబెల్ బ్రదర్స్​ నుంచి హసిండా భూముల్ని గవర్నమెంట్ కొని, ప్రజలకు ఇచ్చింది. మరి ఇప్పుడు కేలటగన్​ ఎలా ఉంది? టూరిస్ట్​లు ఎందుకు అక్కడికి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అక్కడ ఏమేం స్పెషాలిటీస్​ ఉన్నాయి? అంటే చాలానే ఉన్నాయని చెప్పొచ్చు.

కేప్ శాంటియానో లైట్ హౌస్​

కేలటగన్​లో చూడదగ్గ వాటిలో లైట్ హౌస్ ఒకటి. దీన్ని ఫిలిపినోలు​1890లో కట్టారు. ఇప్పటికీ వాడుకలోనే ఉంది. దీన్ని ‘కేలగటన్ లైట్ హౌస్’​ అని పిలుస్తారు. దాంతో పాటు ఫరో డి కాబో శాంటియాగొ, పుంటా డి శాంటియాగొ లైట్ హౌస్​ అనే పేర్లతో కూడా పిలుస్తారు. దీన్ని కట్టడానికి డాన్ శాంటియాగొ జొబెల్ స్థలాన్ని డొనేట్ చేశాడు.  తెలుపు, ఎరుపు ఇటుకలతో కట్టిన ఈ లైట్ హౌస్ పొడవు 51 అడుగులు. మధ్యలో గ్రీన్ ప్యారడైజ్​ కూడా ఉంది. దీని ఆర్కిటెక్చర్ చూస్తే ఏ కాలం నాటిదో గుర్తుపట్టడం చాలా ఈజీ. 

ఈజెడ్‌‌ మ్యూజియం

ఈజెడ్ మ్యాజియం పేరు మ్యూజియో డి ఎన్రిక్యు జోబెల్. దీన్ని ఎన్రిక్యు జోబెల్​కి... వాళ్ల ఫ్యామిలీకి, కేలటగన్​ ఊరికి అంకితం చేశాడు. అందులో ఎన్రిక్యు కుటుంబం తాలూకు జ్ఞాపకాలు​, చరిత్రకు సంబంధించిన వస్తువులు, ఆ మున్సిపాలిటీ కల్చర్​కి సంబంధించిన విషయాల్ని భద్రపరిచారు. ఈ మ్యూజియం నడిపేవాళ్లు, టూర్స్​, ఆర్ట్, క్రాప్ట్స్​కి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్​ చేస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ షాపులు, కెఫెలు కూడా ఉన్నాయి.

బురోట్ బీచ్

ఇది లైట్ హౌస్​కి దగ్గర్లో, వెర్డె ఐలాండ్ కాలువకు ఎదురుగా ఉంది. ఆ దేశంలో ఎక్కువ బిజీగా ఉండే కాలువల్లో ఇది ఒకటి. ఇప్పుడు దీన్ని మూసేశారు. అలాగెందుకంటే... ‘పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల టూరిస్ట్​లు ఇబ్బంది పడకూడదని క్లోజ్ చేశాం’ అంటున్నారు దాని నిర్వాహకులు. కాకపోతే ఇక్కడికి దగ్గర్లో బస చేయడానికి కుకూన్స్ కెసోబె, క్రుసొయ్ క్యాబిన్స్ కెసోబె, యాన్షియానొ బీచ్ హౌస్​లు వంటివి ఉన్నాయి. 

స్టార్​ ఫిష్​ ఐలాండ్

స్వచ్ఛమైన నీళ్ల​లో బోటింగ్ చేస్తుంటే లోపల ఉన్న రకరకాల స్టార్ ఫిష్​లు క్లియర్​గా కనిపిస్తాయి. వాతావరణం మారినప్పుడల్లా ఆ నీళ్లలో మారిన ఆకాశం రంగు రిఫ్లెక్ట్​ అవుతుంది. దీని పక్కనే బొరకే శాండ్​ బార్ ఉంది. అక్కడికి వెళ్లాలంటే మనీలా నుంచి కార్, బోట్​ల ద్వారా వెళ్లొచ్చు. స్టార్​ ఫిష్​ ఐలాండ్​ నుంచి శాండ్ బార్​కి ఐదు నిమిషాలు బోట్ రైడ్. శాండ్ బార్​ చూడాలనుకుంటే మార్నింగ్ టైంలో వెళ్లాలి. అప్పుడైతే అలలు తక్కువ వస్తాయి. 

అక్వేరియా వాటర్ పార్క్

సముద్ర తీరంలో ప్లాయా కేలటగర్ విలేజ్ పేరుతో ఒక బిల్డింగ్ ఉంది. దాని లోపల పిల్లలకోసం ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంది. బీచ్ వాలీబాల్, సాకర్ ఆడొచ్చు ఇక్కడ. స్విమ్మింగ్ చేయడానికి పూల్ ఉంది. అందులో పిల్లలు ఆడుకునే బనానా బోట్​లు ఉంటాయి.

బోట్ హౌస్​

బోట్​ హౌస్​లని స్థానికులు ‘బాల్సా’ అని పిలుస్తారు. కొందరు వాటిలోనే లంచ్ చేస్తారు. వాటిలో ముఖ్యంగా ‘ఫ్లోటింగ్ కాటేజ్​లు’ స్పెషల్. వెదురు బొంగులతో తయారుచేసిన తెప్ప, దానిమీద కర్రలతో కట్టిన ఇల్లు ఉంటుంది. ఇంట్లో కూర్చుని, సముద్రాన్ని ఈదేయొచ్చు! అందుకే వాటిని ‘తేలియాడే ఇళ్లు’ అంటారు.

ఏమేం చేయొచ్చు?

ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా యాక్టివిటీలున్నాయి. స్టాండ్ అప్ పెడల్, సింగిల్ కయక్, టాండెమ్ కయక్, పెడల్ బోట్, స్పీడ్ బోట్, బనానా బోట్, మౌంటెయిన్ బైక్ వంటివి ఉన్నాయి. వాటికి గంటకు ఇంత అని ఛార్జ్​ చేస్తారు. 

ఎప్పుడు వెళ్తే బెటర్?

మార్చ్​ నుంచి మే వరకు ఎప్పుడైనా వెళ్లొచ్చు. వీకెండ్స్, హాలిడేస్​లో చాలామంది వెళ్తారు. కాబట్టి రద్దీ ఎక్కువ ఉంటుంది. 

ఎలా వెళ్లాలి?

  • డైరెక్ట్​ వీసా, సింగపూర్ మల్టిపుల్ వీసాల మీద వెళ్లొచ్చు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నుంచి విమానంలో మనీలా వెళ్లాలి. మనీలా నుంచి కార్​లో వెళ్తే దాదాపు నాలుగు గంటలు పడుతుంది. మరో రూట్​ కూడా ఉంది. ముందు బటంగస్​కు ట్రైన్​లో వెళ్లాలి. అక్కడి నుంచి ట్యాక్సీలో వెళ్లొచ్చు. 
  • కేలటగన్ గవర్నమెంట్​కు టూరిజం, ఎన్విరాన్​మెంటల్ ఫీజు కట్టాలి. వీటిని రిసార్ట్​ల్లో ఎంట్రీ అయ్యేటప్పుడే కట్టొచ్చు. ఒకవేళ ఒక రిసార్ట్​లో ఫీజు కట్టి, మరో రిసార్ట్​కి వెళ్తే.. ఆల్రెడీ కట్టిన ఫీజు స్లిప్ చూపిస్తే సరిపోతుంది. 
  • పగలు, ఎండ నుంచి కాపాడుకునేందుకు స్కార్ఫ్, టోపీ పెట్టుకోవాలి. బోట్స్​లో తిరిగి వీటిని తీసుకెళ్లాలి. నైట్ టైం దోమల బెడద ఎక్కువే. కాబట్టి మస్కిటో రెపెల్లెంట్ లోషన్ వెంట ఉండాల్సిందే. 
  • బీచ్​లో ఎండ ఎక్కువ తగులుతుందని చాలామంది సన్​స్క్రీన్​ లోషన్స్ పూసుకుంటారు. అయితే ఆ ప్రొడక్ట్స్​లో ఎన్విరాన్​మెంట్​ని పాడు చేసే కెమికల్స్​ ఉంటాయి. వాటివల్ల వాతావరణం కలుషితం అవుతుందని ఒక స్టడీలో తేలింది. కాబట్టి డేంజరస్​ కెమికల్స్​ లేని కోరల్ ఫ్రెండ్లీ సన్​స్క్రీన్​ బ్రాండ్​ ప్రొడక్ట్స్​ మాత్రమే వాడాలి అక్కడికి వెళ్లాక.