సోనియా గాంధీ బర్త్ డే: సోనియమ్మను తెలంగాణ మరువదు.. ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ లక్ష్యం

సోనియా గాంధీ బర్త్ డే: సోనియమ్మను తెలంగాణ మరువదు.. ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ లక్ష్యం

తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేని నాయకురాలు సోనియా గాంధీ. సుదీర్ఘ కాల తెలంగాణ ఉద్యమానికి న్యాయం చేయాలనే ఆకాంక్షతో ఆమె తీసుకున్న నిర్ణయం ఫలితాలను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. రాజకీయంగా ఎంత నష్టం జరిగినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆమె తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి రాష్ట్రం ఇవ్వడంతో ఉద్యమకారుల కలలు నెరవేయాయి. అందుకే  సోనియా గాంధీ ప్రస్తావన లేకుండా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడలేం.

సోనియా గాంధీ మార్గదర్శకంలో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రెండేళ్లుగా ‘ప్రజాపాలన’ అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. సోనియాగాంధీ  స్ఫూర్తితో  తెలంగాణ రాష్ట్రంలో ‘ఇందిరమ్మ రాజ్యం’ పాలన సాగుతోంది. రాష్ట్రం ఇవ్వడమే కాకుండా ఇచ్చిన రాష్ట్రంలో ప్రజల బాగోగుల కోసం ఆమె ఇస్తున్న విలువలు, సలహాలు తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సోనియాగాంధీ వాటికి ఎదురీదుతూ 2009 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 9వ తేదీన నాటి కేంద్ర హోం మంత్రి చిందంబరం చేత తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటన ఇప్పించారు. ఈ ప్రకటన అనంతరం తెలంగాణకు బేషరతు మద్దతిస్తామని చెప్పిన బీజేపీతో మరికొన్ని పార్టీలు గోడమీద పిల్లిలా వ్యవహరించాయి. చిదంబరం చేసిన ప్రకటనతో షాక్‌‌‌‌‌‌‌‌కు గురైన తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకులు కొన్ని అడ్డంకులు సృష్టించడంతో రాష్ట్ర ఏర్పాటులో కొంత జాప్యం ఏర్పడింది తప్ప ప్రక్రియ ఆగలేదు. 

రాష్ట్ర ఏర్పాటుపై  స్వపక్షంలో, విపక్షంలో  కొంత వ్యతిరేకత ఏర్పడినా సోనియాగాంధీ వెనక్కి తగ్గకుండా వ్యూహాత్మకంగా చిక్కుముడులను విడదీస్తూ రాష్ట్ర ఏర్పాటును సుగమం చేశారు. ఇందులో భాగంగా శ్రీ కృష్ణ కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణపై సీడబ్ల్యుసీలో  తీర్మానం చేయడంతోపాటు జీఓఎమ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి పార్లమెంట్​లో  ఆ బిల్లు ఆమోదించేలా వ్యూహాత్మకంగా అడుగులేసి  తెలంగాణ ప్రజల కలలను సోనియా గాంధీ సాకారం చేశారు.

కేసీఆర్ వంచన
ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా విభజన ఉండాలనే లక్ష్యంగా సోనియా గాంధీ  ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక హోదా,  వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ సమన్యాయం చేసి తెలుగు ప్రజలపట్ల ఆమెకున్న ప్రేమను నిరూపించుకున్నారు. భావోద్వేగమైన రాష్ట్ర విభజనతో ఒక ప్రాంతంలో రాజకీయ నష్టం జరుగుతుందని తెలిసినా, అవకాశవాద రాజకీయాలకు ప్రాధాన్యతనివ్వకుండా  తెలంగాణ  ప్రజల చిరకాల వాంఛను సోనియా గాంధీ నెరవేర్చారు. 

సోనియా గాంధీ త్యాగాలు చేస్తే ఇందుకు భిన్నంగా ఉద్యమ పార్టీగా  చెప్పుకున్న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధినేత  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత  అడుగడుగునా వంచనకు పాల్పడ్డారు.  సోనియాగాంధీకి ఎంతో  రుణపడి ఉన్నామని కుటుంబ సమేతంగా ఆమెను కలిసిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అనంతరం మోసం చేశారు. రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తానే పీఠం ఎక్కారు. అప్రజాస్వామ్యంగా పాలిస్తూ అమరవీరుల కుటుంబాల త్యాగాలకు గుర్తింపు ఇవ్వలేదు.  కవులు, రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు, మేధావులు ఇలా అన్ని రంగాల వారు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినా కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చాక అంతా తనవల్లే అయ్యిందనే అహంకార ధోరణితో వారందరినీ మోసం చేశారు. 

మిగులు బడ్జెట్‌ రాష్ట్రం అప్పుల మయం
తెలంగాణను  కుటుంబ కబంధ హస్తాలలో బంధించి నిరంకుశంగా పాలిస్తూ అన్ని రంగాల్లో  పెద్దఎత్తున అవినీతికి పాల్పడి మిగులు బడ్జెట్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు.  సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌తో  గెలిచిన  కేసీఆర్‌‌‌‌‌‌‌‌  పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో భ్రష్టు పట్టిందని  గుర్తించిన  ప్రజలు  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను  గద్దె దించి, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి పట్టం కట్టారు. 2023 ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఒక  సందేశమిస్తూ.. సోనియమ్మ అంటూ నాపై ప్రేమానురాగాలు చూపే మీరు రాష్ట్రాన్ని ‘ప్రజల తెలంగాణ’గా మార్చేందుకు కాంగ్రెస్​కు  ఓటేయండి అని పిలుపిచ్చారు. 

ఆమె ఆశించినట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలో ‘ప్రజా పాలన’ ప్రారంభమైంది. సోనియా ఆదేశాల మేరకు ‘ఆరు గ్యారెంటీలు’ ప్రకటించిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రాగానే 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 9వ తేదీన ఆమె పుట్టిన రోజున వాటిని ప్రారంభించింది. సోనియా గాంధీ మార్గదర్శకంలో  రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తూ కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలు తీసుకుంది. 

ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం
రాజకీయ ప్రయోజనాలే అంతిమ లక్ష్యం కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ నిర్ణయాలు తీసుకుంటే,  బీజేపీ స్వార్థ రాజకీయాలకు పెద్దపీట వేస్తుందని తెలంగాణ విషయంలో రుజువయ్యింది.  తెలంగాణ ఏర్పాటుకు మేం కృషి చేశామని ఒక పక్క బీజేపీ చెబుతుంటే, మరోపక్క ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై ‘తల్లిని చంపి బిడ్డను తీశారు’ అంటూ అవమానకరమైన రీతిలో వ్యాఖ్యానించారు.

2014లో  తెలంగాణ ఏర్పాటు తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష చూపిస్తోంది. రాజకీయాలకు అతీతంగా సోనియా నిర్ణయం తీసుకుంటే మోదీ రాజకీయాలతో తెలంగాణపై  కక్ష గట్టారు.  విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌ నిధులు కేటాయింపులో, మూసీ సుందరీకరణ, మెట్రో రైలు ప్రాజెక్టులో బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోంది.

‘తెలంగాణ రైజింగ్‌ 2047’ లక్ష్యం
కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్‌‌‌‌‌‌‌‌ 2047’ లక్ష్యంగా అన్ని రంగాల్లో దూసుకుపోతూ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలతోపాటు డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 9వ తేదీన సోనియా గాంధీ పుట్టిన రోజు ఉత్సవాలు కూడా జరుపుకోవడం రాష్ట్రానికి ప్రత్యేక పండుగే.  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తొమ్మిదిన్నర ఏండ్ల గడీల పాలన, అవినీతి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడిన ప్రజలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి పట్టం గట్టడంతో  రాష్ట్రంలో సోనియా గాంధీ మార్గర్శకంలో  ‘ఇందిరమ్మ రాజ్యం’ పాలన సాగుతోంది. సోనియా గాంధీ రాజకీయంగా నష్టపోయినా విలువలకే కట్టుబడుతారు.

తెలంగాణ ఏర్పాటుతో ఇతర చోట్ల రాజకీయంగా న‌‌‌‌‌‌‌‌ష్టం  తప్పదని తెలిసినా ఇచ్చిన మాట కోసం ఆమె ముందుకెళ్లారు. త్యాగాలు చేయడం ఆమెకు కొత్త కాదు.  దేశంలో అత్యున్నత పదవైన ప్రధానమంత్రి పదవినే ఆమె తృణప్రాయంగా త్యాగం చేశారు.  దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్‌‌‌‌‌‌‌‌ గాంధీ బలిదానాలు జరిగినా సోనియా గాంధీ జంకకుండా  ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా తమ జీవితాన్నే త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారు.  ప్రజా ప్రయోజనాల కోసం త్యాగాలకు మారుపేరుగా మారిన సోనియమ్మ తెలంగాణ ప్రజల మనస్సుల్లో మాతృమూర్తిగా నిలిచిపోయారు.

తెలంగాణ కల సాకారం
ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గుర్తించిన సోనియాగాంధీ  2000 సంవత్సరం నుంచి 2014 వరకు 14 ఏండ్లు వ్యూహాత్మకంగా అడుగులేశారు. 2000లో 41 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియా గాంధీకి వినతిపత్రం ఇచ్చినప్పుడు ‘నాకు మీ సమస్యలు తెలుసు, తెలంగాణ గురించి కచ్చితంగా ఆలోచిస్తాను’ అని చెప్పడంతో రాష్ట్ర ఏర్పాటుకు  2000లోనే  తొలి అడుగు పడింది. సోనియాగాంధీ మాటిస్తే తిరుగుండదు. ఆమె ఏఐసీసీ తరఫున అప్పటి వాజ్‌‌‌‌‌‌‌‌పేయి ప్రభుత్వానికి లేఖ రాస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం రెండో రాష్ట్ర పునర్విభజన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరగా నాటి హోం మంత్రి అద్వానీ తిరస్కరించారు.

బీజేపీకి తెలంగాణపై చిత్తశుద్ధి లేదని గ్రహించిన సోనియా గాంధీ 2004లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకున్నారు. సొంతంగా మెజార్టీ లేకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితుల్లో సోనియా గాంధీ భాగస్వామ్య పక్షాలను  చాకచక్యంగా రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పించారు.  యూపీఏ ప్రభుత్వం ‘కామన్‌‌‌‌‌‌‌‌ మినిమమ్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రాం’లో తెలంగాణ అంశాన్ని చేర్చడమే కాకుండా,  దీన్ని రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చడంలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారు.  

బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు