కొడంగల్ను దత్తత తీసుకుంటానని చెప్పి కేటీఆర్ మోసం చేసిండు : రేవంత్ రెడ్డి

 కొడంగల్ను దత్తత తీసుకుంటానని చెప్పి కేటీఆర్ మోసం చేసిండు :  రేవంత్ రెడ్డి

కొడంగల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ను దత్తత తీసుకుంటామని చెప్పి మంత్రి కేటీఆర్ మోసం చేశారని ఆరోపించారు.  కొడంగల్లో కట్టిన గుడి, బడి అన్నీ తాను ఎమ్మెల్యేగా ఉన్న  హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమేనన్నారు. కనీసం మండల కేంద్రాల్లో జూనియర్ కాలేజీలను కూడా నిర్మించలేదన్నారు.  

నారాయణ్ పేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకుండా కొడంగల్ కి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని రేవంత్ తెలిపారు. మరోసారి కొడంగల్ ప్రజలను మోసం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఆరోపించారు. మీరు దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరంటూ రేవంత్ హెచ్చరించారు. దాడులు చేయడం మా విధానం కాదని,  అభివృద్ధి చేయడమే తమ విధానమని చెప్పారు.  

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా  పేదలకు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.  ప్రతీ నెలా మొదటి తారీఖున రూ.4వేలు పెన్షన్  అందిస్తామని తెలిపారు.  ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని వెల్లడించారు.  

కేసీఆర్ ఓడిపోతుండు కాబట్టే గజ్వేల్ నుంచి పారిపోతుండని విమర్శించారు రేవంత్.  ఓటమి ఖాయమైంది కాబట్టే కేసీఆర్ ఆపద మొక్కులు మొక్కుతుండన్నారు.  ఓటమి భయం కేసీఆర్ గొంతులో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.  కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుందని, హైదరాబాద్ చుట్టూ 10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని రేవంత్ ఆరోపించారు.  తాను వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ చేస్తానని,  ఇవాళ గాంధీభవన్ లో దరఖాస్తు చేస్తానని రేవంత్ చెప్పుకోచ్చారు.  కొడంగల్ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.