ఇవి తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చే ఎన్నికలు : రేవంత్ రెడ్డి

 ఇవి తెలంగాణ ముఖచిత్రాన్ని  మార్చే ఎన్నికలు : రేవంత్ రెడ్డి

నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేవని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభివర్ణించారు.  కొడంగల్‌లో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన రేవంత్‌ జనసభలో మాట్లాడారు.  ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు, కేసీఆర్ కు మధ్య జరుగుతున్నాయన్నారు.  ఈ ఎన్నికల్లో కర్ణాటక కంటే గొప్ప తీర్పు కొడంగల్ ప్రజలు ఇవ్వాలన్నారు.  గెలిచిన రెండేళ్లలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.  ఏడాదిలో మహబూబ్ నగర్ చించొలి జాతీయ రహదారి పూర్తి చేయిస్తానన్నారు. అంతేకాకుండా ఆడబిడ్డలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు తీసుకోస్తామన్నారు రేవంత్.  

ఐదేళ్లలో కొడంగల్ కు సీఎం  కేసీఆర్ , మంత్రి  కేటీఆర్ ఇచ్చిన  ఏ ఒక్క హామీ ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు రేవంత్ రెడ్డి.  హామీలు ఇచ్చి మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ ముఖంతో ఓట్లు అడుగుతారని నిలదీశారు.  దత్తత కాదు ధైర్యం ఉంటే కొడంగల్ లో పోటీ చెయ్ తేల్చుకుందామని కేసీఆర్ కు తాను సవాల్ విసిరానని చెప్పారు.  అభివృద్ధి చేయలేదు కాబట్టే తాను విసిరిన సవాల్ ను కేసీఆర్ స్వీకరించలేదన్నారు.  కాంగ్రెస్ అధ్యక్ష పదవి తనది కాదన్న రేవంత్ ... కొడంగల్ లో ప్రతీ బిడ్డ కాంగ్రెస్ కు అధ్యక్షుడేనని చెప్పారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు.