నిధులన్నీ మీ సెగ్మెంట్లకేనా?.. కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ ఫైర్​

నిధులన్నీ  మీ సెగ్మెంట్లకేనా?..  కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ ఫైర్​
  • వేరే నియోజకవర్గాలు ఏం పాపం చేసినయ్​?
  • ఇవి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు
  • నాపై పోటీకి రమ్మంటే కేసీఆర్​ తోకముడిచిండు
  • కొడంగల్​ బిడ్డలే రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నరు
  • ప్రజలను మోసం చేసిన బీఆర్​ఎస్​ సన్నాసులు 
  • ఏ ముఖంతో ఓట్లడుగుతున్నరని మండిపాటు
  • కొడంగల్​లో నామినేషన్​ దాఖలు.. భారీగా హాజరైన జనం
  • ఇయ్యాల్టి నుంచి ఐదు రోజులు రేవంత్​ వరుస సభలు

హైదరాబాద్​, వెలుగు : ఈ అసెంబ్లీ ఎన్నికలు ఆషామాషీవి కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేవని, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేవని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘ఇది కేసీఆర్​కు, ప్రజలకు నడుమ జరుగుతున్న పోరాటం. నమ్మించి మోసం చేసిన కేసీఆర్​ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారు” అని తెలిపారు. కొడంగల్​కు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్​, కేటీఆర్​ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. కొడంగల్​ను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని అన్నారు. దత్తత కాదు.. దమ్ముంటే కొడంగల్​లో తనపై పోటీ చేయాలని కేసీఆర్​కు సవాల్​ విసిరితే తోక ముడిచారని ఆయన విమర్శించారు. అభివృద్ధి చేయలేదు కాబట్టే తాను విసిరిన సవాల్ ను కేసీఆర్ స్వీకరించలేదని అన్నారు.

‘‘సిరిసిల్ల, గజ్వేల్​, సిద్దిపేట ప్రజలు చేసుకున్న పుణ్యమేమిటి? కొడంగల్​ ప్రజలు చేసుకున్న పాపమేమిటి?  కేసీఆర్​ ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, గజ్వేల్​, సిద్దిపేటకేనా అన్నీ. కొడంగల్​కు ఎందుకు నిధులివ్వరు? ఎందుకు అభివృద్ధి చేయరు? రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలను ఎందుకు పట్టించుకోరు?’’ అని నిలదీశారు. సోమవారం కొడంగల్​లో రేవంత్​రెడ్డి నామినేషన్​ వేశారు. అంతకుముందు స్థానిక శివాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్​ మాట్లాడుతూ.. ‘‘హామీల పేరిట ప్రజలను నమ్మించి మోసం చేసిన బీఆర్​ఎస్​ సన్నాసులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నరు. కొడంగల్​ను దత్తత తీసుకున్నమని చెప్పుడు కాదు.. నియోజకవర్గాన్ని ఎందుకు బాగు చేయలేదు?” అని నిలదీశారు. 

నా అధ్యక్ష పదవి.. కొడంగల్​లోని ప్రతి బిడ్డది

ఈ రాష్ట్రానికి కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడిగా నాయకత్వం వహించే అవకాశం సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే తనకు ఇచ్చారని రేవంత్​ తెలిపారు. ‘‘నాకు ఇచ్చిన కాంగ్రెస్​ అధ్యక్ష పదవి నాది కాదు.. కొడంగల్​లోని ప్రతి బిడ్డది. ప్రతి కార్యకర్తది. తెలంగాణలో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావడంలో ఇక్కడి ప్రజలదే బాధ్యత. కొడంగల్​ బిడ్డలే ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నరు” అని ఆయన అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్​ అఖండ విజయానికి కారణమైన డీకే శివకుమార్​ను మించిన తీర్పును కొడంగల్‌‌ ప్రజలు తనకు ఇవ్వాలని కోరారు. ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే బాధ్యత తనది అన్నారు. 

ఇక్కడి ప్రజలు ఇచ్చిన బలంతో కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రాంతం పేరు నిలబెట్టానని చెప్పారు. తనకు పదవి లేకపోయినా కొడంగల్‌‌ ప్రజలు అండగా నిలిచారని,  కొడంగల్‌‌ యువతకు ఉద్యోగాలు అందించేందుకు జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని, ఇవి తెలంగాణ భవిష్యత్‌‌ను తీర్చిదిద్దుతాయని అన్నారు. కొడంగల్‌‌ ఆత్మగౌరవం కోసం శాసనసభలో పోరాటం చేశానని, బీఆర్ఎస్‌‌ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఒక్కసారైనా ఇక్కడి అభివృద్ధి గురించి మాట్లాడారా? అని ఆయన ప్రశ్నించారు.

నమ్మి పంపితే మోసం చేసిండు

2009లో మహబూబ్‌‌నగర్‌‌ ప్రజలు కేసీఆర్‌‌ను నమ్మి పార్లమెంట్​కు పంపితే వారినే మోసం చేశారని రేవంత్​ అన్నారు.  మహబూబ్​నగర్​కు తెలంగాణ వచ్చిన పదేండ్లలో కేసీఆర్‌‌ ఎందుకు న్యాయం చేయలేదని నిలదీశారు. ఈ ఎన్నికలు దేశ ముఖ చిత్రంలో కొడంగల్‌‌కు గుర్తింపు తెచ్చే ఎన్నికలని ఆయన అన్నారు. ‘‘గ్రూపులు, గుంపులు కాదు.. కొడంగల్ అంతా కలిసి రావాలి.  కాంగ్రెస్ ను గెలిపించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేయాలి. చీలిపోతే కూలిపోతాం.. కూలిపోతే ప్రజల జీవితాలు ఆగమైతయ్​. ఎన్నికల్లో కర్నాటక కంటే గొప్ప తీర్పు కొడంగల్ ప్రజలు ఇవ్వాలి” అని రేవంత్​ కోరారు. గెలిచిన రెండేండ్లలో నారాయణపేట– కొడంగల్ ఎత్తి పోతల పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఏడాదిలో మహబూబ్ నగర్​– చించొలి జాతీయ రహదారి పూర్తి చేయిస్తానని, ఆడబిడ్డలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అండగా నిలబడే ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత తనదని రేవంత్​ అన్నారు. 

ఇయ్యాల్టి నుంచి 5 రోజులు రేవంత్​ వరుస సభలు

హైదరాబాద్​/మహబూబ్​నగర్​/కామారెడ్డి, వెలుగు :  పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. మంగళవారం నుంచి రోజూ 3 సభల చొప్పున తమ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొననున్నారు. వరుసగా ఐదు రోజుల పాటు (ఈ నెల 7 నుంచి 11 వరకు) ర్యాలీలు, బహిరంగ సభలకు రేవంత్​ హాజరవుతారు. మంగళవారం ఉదయం గద్వాల జిల్లా ఆలంపూర్​లోని జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పార్టీ అభ్యర్థి సంపత్​కుమార్​ ఆధ్వర్యంలో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. అదే రోజు గద్వాల్​, మక్తల్​లోనూ ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు సరిత, వాకిటి శ్రీహరి తరఫున నిర్వహించే బహిరంగ సభలకు హాజరవుతారు. బుధవారం ఖానాపూర్, ఆదిలాబాద్​, జహీరాబాద్  బహిరంగ సభలకు హాజరవుతారు.

 గురువారం పాలకుర్తి పబ్లిక్​ మీటింగ్​లో పాల్గొని.. సాయంత్రం హైదరాబాద్​కు వచ్చి సిటీ కన్వెన్షన్​లో మైనారిటీ డిక్లరేషన్​ను ప్రకటిస్తారు. అదే రోజు సికింద్రాబాద్​, సనత్​నగర్​లో పబ్లిక్​ మీటింగ్స్​లోనూ రేవంత్​ పాల్గొంటారు. ఈ నెల 10న శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించే పబ్లిక్​ మీటింగ్​కు  హాజరవుతారు. ఆ సభకు కర్నాటక సీఎం సిద్ధరామయ్యను చీఫ్​ గెస్ట్​గా ఆహ్వానించారు. ఆ సభలో బీసీ డిక్లరేషన్​ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అదే రోజు రేవంత్​ కామారెడ్డిలో నామినేషన్​ వేస్తారని కాంగ్రెస్​ నేత షబ్బీర్​ అలీ చెప్పారు. ఇక అదే రోజు రాత్రి హైదరాబాద్​లో మైనారిటీలతో స్పెషల్​ డిన్నర్​ ప్రోగ్రామ్​ను ఏర్పాటు చేశారు. శనివారం బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురిల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో రేవంత్​పాల్గొంటారు.