రాజగోపాల్ రెడ్డి పార్టీ ద్రోహి.. వ్యాపారాల కోసం పార్టీ మారాడు

రాజగోపాల్ రెడ్డి పార్టీ ద్రోహి.. వ్యాపారాల కోసం పార్టీ మారాడు

టీ.పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ ద్రోహి అని, వ్యాపారాల కోసమే కాంగ్రెస్ పార్టీ మారాడని ఆరోపించారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రాందీ షాప్ లో కూడా పని చేయడానికి పనికిరాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడలేదన్నారు. తాను కేవలం రాజగోపాల్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడానని చెప్పారు.

రాజగోపాల్ రెడ్డి విసిరిన బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇవాళ చండూరు చౌరస్తాలో నిర్వహించే బహిరంగ చర్చకు తాను హాజరవుతున్నానని, చర్చకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గత ఎనిమిది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోరాడలేదన్నారు. తనమీద రాష్ట్ర ప్రభుత్వం 80కి పైగా కేసులు పెట్టిందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి రాష్ర్ట ప్రభుత్వంపై పోరాటం చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాడని ఆరోపించారు. 

బీజేపీపైనా తీవ్ర విమర్శలు
బీజేపీ పార్టీ కాంట్రాక్టులు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. భద్రాచలం ముంపునకు ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గమే  కారణమని ఆరోపించారు. తెలంగాణకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఎన్నో ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని చెప్పారు. తెలంగాణకు బీజేపీ ద్రోహం చేసిందన్నారు. బీజేపీ పార్టీ చాలామంది నేతలకు కాంట్రాక్టులు, కమీషన్లు ఆశచూపి ప్రలోభాలు పెడుతోందని ఆరోపించారు. చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందన్నారు. కాంగ్రెస్ మునుగోడు సభలో చెరుకు సుధాకర్ పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలను తెలంగాణ ప్రజలు కూడా స్వాగతించాలని కోరారు. సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బలంగా పని చేస్తున్నారని చెప్పారు.