బీజేపీ దేశానికి ప్రమాదకరం

బీజేపీ దేశానికి ప్రమాదకరం

హైదరాబాద్: బీజేపీ దేశానికి ప్రమాదకరంగా మారిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారన్న ఆయన.. సీబీఐ కేసులతో బీజేపీ నేతలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బ్రిటీష్ పాలకులు మారినా..వాళ్ల విధానాలు ఇప్పటికీ అమలు చేస్తున్నారన్నారు.  ప్రగతి భవన్ లో సీబీఐ సోదాలు ఎందుకు జరపడంలేదని ప్రశ్నించారు. వేలాది కోట్ల కాంట్రాక్ట్ లకు ప్రగతి భవన్ నుంచే పునాది వేశారన్నారు. అసలు విచారణలు జరపకుండా.. ఢిల్లీలో చిన్న కంపెనీలపై సోదాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు విసుగుచెందేలా కేసీఆర్ తీరు ఉందని చెప్పారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై కాంగ్రెస్ ఫైట్ చేస్తుందన్న రేవంత్.. ప్రజాస్వామ్యం పట్ల సీఎం కేసీఆర్ కు నమ్మకం లేకుండా పోతుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలను తనకు అనుకూలంగా జరుపుకుంటున్నారని.. ఒకప్పుడు నెలరోజులకు పైగా అసెంబ్లీ సమావేశాలు జరిగేవని అని అన్నారు

రేపు ప్రారంభంకానున్న రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన రేవంత్.. కర్ణాటక, రాయచూర్ నుంచి తెలంగాణ లోకి రాహుల్ యాత్ర ఎంటర్ అవుతుందన్నారు. కేసీఆర్ కు  ఏ విషయం పట్ల క్లారిటీ ఉండదని.. ఫెడరల్ ఫ్రంట్ అని ఇప్పుడు మాట మార్చారని చెప్పారు.  భారత్ జోడో యాత్రలో భాగంగా దేశ చరిత్రను ప్రతి ఒక్కరికీ తెలియజేస్తామని చెప్పారు. దేశ చరిత్రపై కాంగ్రెస్ కు మాత్రమే క్లారిటీ ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.