బడ్జెట్‎తో ఎవరికీ లాభం లేదు: రేవంత్ రెడ్డి

బడ్జెట్‎తో ఎవరికీ లాభం లేదు: రేవంత్ రెడ్డి

ప్రధాని మోడీ రైతులపై కక్ష పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‎తో ఎవరికీ లాభం లేదని ఆయన ఎద్దేవా చేశారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రేవంత్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

‘రైతులకు, యువతకు, మహిళలకు ఏమాత్రం ఉపయోగంలేని బడ్జెట్ ఇది. నల్లచట్టాలను వెనక్కు తీసుకునేలా చేసిన రైతులపై మోడీ పగ పెంచుకున్నారు. అందుకే ఎరువులపై సబ్సిడీ తగ్గించారు. వరి, గోధుమ కొనుగోలుకు సంబంధించి నిధులు తగ్గించారు. ఉపాధిహామీ పథకంపై 25 వేల కోట్ల కోత విధించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, నల్ల చట్టాల వల్ల దేశ ప్రజలు మొత్తం భయాందోళనకు గురై మోడీ ప్రభుత్వంలో తమకు రక్షణ లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తమ పంటలకు మోడీ కనీస ధర కల్పిస్తాడని రైతులు అనుకున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచుతారనుకుంటే.. రైతుల పెట్టుబడి ఖర్చులు పెంచారు. చిన్న వ్యాపారుల జీఎస్టీ తగ్గించే ప్రయత్నం చేయలేదు. ఉద్యోగస్థులకు ట్యాక్స్‎లో ఊరట కలిగించలేదు. కరోనా నియంత్రణకు భారీగా నిధులు కేటాయిస్తారనుకుంటే అది కూడా చేయలేదు. విద్యకు, వ్యవసాయానికి నిధులు పెంచకుండా యువతకు, రైతులకు మొండి చెయ్యి చూపారు. చివరికి నిత్యావసరాల ధరలు కూడా తగ్గించలేదు, కానీ, వజ్రవైఢూర్యాల మీద మాత్రం ధరలు తగ్గించారు’ అని రేవంత్ అన్నారు.

బడ్జెట్ ప్రసంగం మీద సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ చూస్తుంటే.. నవ్వోస్తుందని రేవంత్ అన్నారు. ‘ఆయన నిన్నటి సమావేశంలో మందు కలిపిన కల్లు తాగి మాట్లాడరనిపిస్తోంది. ఒక బాధ్యత సీఎంలాగా మాట్లాడలేదు. విభజన చట్టం అంశాలు, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ యూనిట్, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల విషయం ఏదీ మాట్లాడలేదు. మోడీపై యుద్ధం ప్రకటిస్తారని ఆశించాం. నిర్మలా సీతారామన్, మోడీ గురించి నీచంగా, జుగుప్సాకరంగా కేసీఆర్ మాట్లాడారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మాట్లాడారు. భూస్వాములు, అగ్ర వర్ణాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ మాటలను కేసీఆర్ మాట్లాడినట్లు ఉంది. రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ ద్వారా దళితులు, బలహీన వర్గాలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. రాజ్యాంగం మార్చాలన్నది బీజేపీ కుట్ర. బీజేపీ కుట్రకు కేసీఆర్ వంత పాడారు. రాజ్యాంగం రద్దు చేయాలని బీజేపీ ఎన్నో ఏళ్లుగా కుట్ర చేస్తుంది. కేసీఆర్‎ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని తెరమీదికి తెచ్చారు. బీజేపీ రాజ్యాంగం రద్దు కుట్రకు.. కేసీఆర్ మద్దతు తెలిపారు. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అంబెడ్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్దం చేయాలి. కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకునేందుకు రెండు రోజుల పాటు గాంధీ భవన్‎లో నిరసన దీక్షలు చేస్తాం. రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకొకపోతే.. దేశ యువత కేసీఆర్ నాలుక కొస్తారు. యూపీలో బీజేపీని గెలిపించాలన్న  ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు. కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ సూపారి గ్యాంగ్. యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి సుపారి తీసుకున్నారు. ఓట్లు చీల్చడానికి ఎంఐఎం పోటీ చేస్తుంది. మోడీ గెలవడం, రాజ్యాంగం రద్దు ఇవే ప్రధాన అంశాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అసభ్యకరమైన భాష మాట్లాడారు. కేసీఆర్ భాషను ఖండిస్తున్నాం. సిద్ధాంత పరంగా బీజేపీని, భాష పరంగా కేసీఆర్‎ని వ్యతిరేకిస్తున్నాం. ప్రధాన మంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడితే.. తెలంగాణ పరువు ఏం కావాలి? మహిళలను గౌరవించే సంస్కృతి భారత సంస్కృతి. కేసీఆర్ భాషను సభ్య సమాజం క్షమించదు. కేసీఆర్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో సమాధానం చెప్పాలి. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీనే. విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్‎తోనే సాధ్యం’ అని రేవంత్ అన్నారు.

For More News..

జాతీయ రహదారిపై దర్జాగా రోడ్డు దాటుతున్న పులి

‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్

గుస్సాడీ కనక రాజుకు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్

మహిళా ఫైటర్ పైలట్ల ప్రవేశం శాశ్వతం