‘మెడ మీద కత్తి’ పదానికి అర్థం చెప్పాలె

‘మెడ మీద కత్తి’ పదానికి అర్థం చెప్పాలె

వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతు సమస్యలపై మాట్లాడాలని కాంగ్రెస్ సహా విపక్షాలు భావించాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కానీ సభను అడ్డుకుని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని రక్షించేందుకు టీఆర్ఎస్ ముందుకొచ్చిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆందోళనతో చర్చ లేకుండానే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఉభయ సభలు పాస్ చేశాయన్నారు. నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే, లోక్‌సభలో ఉన్న 9 మంది ఎంపీల్లోనే ముగ్గురు సభకు ఎందుకు రాలేదు? అంటూ రేవంత్ ప్రశ్నించారు. వరేసుకున్న రైతులు ఉరేసుకునేలా రెండు పార్టీలు చేస్తున్నాయని మండి పడ్డారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు మేలు జరిగేలా చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్రాలు కొనకపోవడంతో రైతులు కార్పొరేట్ శక్తుల వైపు వెళ్లక తప్పని పరిస్థితి కల్పిస్తున్నాయన్నారు. దేశానికే అన్నపూర్ణ తెలంగాణ అని చెప్పిన సీఎం కేసీఆర్, వరి ధాన్యాన్నే కొనకుండా కూర్చున్నారని విమర్శించారు. వరితో పాటు ఏ పంటనూ కూడా కొనడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనడం లేదంటూ కేసీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్రం కొననప్పుడే కదా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలన్నారు రేవంత్.

దొంగలా దొరికారు కాబట్టే కేంద్ర ప్రభుత్వం మెడపై కత్తిపెట్టిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు కేసీఆర్. 'మెడ మీద కత్తి' అనే పదానికి అర్థం ఏంటో తెలంగాణ సమాజానికి చెప్పాలన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యానికి కొననప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండే హక్కు మీకు ఉందా...? అంటూ కేసీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై మీకు అవగాహన ఉందా..? అంటూ నిలదీశారు. గతంలో రైతులు వరికి బదులు మొక్కజొన్న, చెరకు, పత్తి పండిస్తే పండించొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారన్నారు. పప్పు దినుసులు పండిస్తే వాటికి సరైన గిట్టుబాటు ధర లేకుండా చేశారన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసినప్పుడు వాటికి గిట్టుబాటు ధరతో పాటు రైతులకు సరైన వసతులు కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చకున్నప్పుడు సీఎంకు తెలియదా.... అంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.