
కొండాపూర్, వెలుగు : కార్యకర్తల సమావేశానికి హాజరైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్న టైంలో గత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని కంటతడి పెట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో చౌరస్తాలోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి జగ్గారెడ్డి హాజరయ్యారు. ఈ నెల 7న జరగనున్న తన కూతురి వివాహానికి కార్యకర్తలంతా హాజరుకావాలని కోరారు. గతంలో ఆర్థిక సమస్యల కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకున్నారు. తాను నియోజకవర్గంలో ఏ సమావేశం పెట్టినా కొందరు ముఖ్య నేతలు తమ భూముల పాస్‌పుస్తకాలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చారని భావోద్వేగానికి గురయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ సభ నిర్వహణకు డబ్బులు లేకపోవడంతో మాజీ ఎంపీపీ చేర్యాల ఆంజనేయులు ఇచ్చారని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. దీంతో కార్యకర్తలు జగ్గారెడ్డిని ఓదార్చేందుకు ప్రయత్నించారు. జగ్గారెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వై.ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ పాల్గొన్నారు.