నిజామాబాద్, వెలుగు : బీఆర్‌ఎస్ సర్కార్ కాళేశ్వరం పేరుతో రూ. 1.20 లక్షల కోట్లను గోదావరి నదిలో పోసిందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సన్మాన సభను గురువారం నిజామాబాద్‌లోని పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ... కేసీఆర్ పాలన మొత్తం దోచుకోడానికి సరిపోయిందన్నారు. బీజేపీ దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
మరో ఐదేండ్లు సైతం కాంగ్రెస్‌నే గెలిపించేందుకు ప్రజలు తీర్మానం చేసుకున్నారన్నారు. అధికారం చేపట్టిన 15 నెలల్లోనే రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌దేనన్నారు. 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ స్కీమ్‌తో గ్రామాల్లో 70 శాతం ఫ్యామిలీలు లబ్ధి పొందుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కాలేజీలు వచ్చాయన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ప్రెస్‌మీట్‌లు పెట్టి గెంతులేయడం తప్పితే.. చేసిందేమీ లేదని, ఆయన ఎవరిని ఉద్దేశించి, ఏమి మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
బీసీ బిడ్డగా చెప్పుకునే అర్వింద్.. కాంగ్రెస్ సర్కార్ రూపొందించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం కేంద్రాన్ని ఒప్పించలేకపోతున్నారన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి రిజర్వేషన్‌ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కరీంనగర్, ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రి గుట్ట నుంచి బాసర వరకు రూ.350 కోట్లతో టెంపుల్ కారిడార్ రోడ్ నిర్మాణం చేపట్టబోతున్నామని ప్రకటించారు. భీంగల్ లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహ స్వామిఆలయ ఆవరణలో రూ.4 కోట్లతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మించడానికి సర్కార్ జీవో జారీ చేసిందని చెప్పారు.
